సంయమనం పాటించాల్సిన సమయమిది
ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత సీమాంధ్రుల కుట్రలు, కుతంత్రాలకు బలైపోయిన తెలంగాణ ప్రజలు దశాబ్దాల తరబడి కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక ఏర్పాటును అడ్డుకునేందుకు ఇంకా అవే కుట్రలు కొనసాగుతున్నాయి. అందులో భాగమే శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగర నడిబొడ్డులోని ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్‌జీవోలు నిర్వహించే బహిరంగ సభ. తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్ వేదికగా సమైక్య రాష్ట్రం కోసం నిర్వహించే చిట్టచివరి సభ ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర కోరుతూ సభ నిర్వహించే సమయం కాకపోయినా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపీఎన్‌జీవోల వెన్నుతట్టి సభ నిర్వహిణకు ప్రోత్సహించాడు. అదే సమయంలో ముల్కీ అమరవీరుల సంస్మరణార్థం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చిన శాంతిర్యాలీకి మాత్రం అనుమతి నిరాకరించారు. సీమాంధ్రుల సభకు అనుమతి ఇచ్చి, తెలంగాణ జేఏసీ సభకు నిరాకరించడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ దానికి వివరణ ఇచ్చుకున్నాడు. సీమాంధ్రులు సభ తలపెట్టిన ఏడో తేదీన కాకుండా మరో రోజు టీ జేఏసీ శాంతి ర్యాలీకి దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని చెప్పాడు. ఏపీఎన్‌జీవోలు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం వల్లనే వారికి అనుమతి ఇచ్చామని చెప్పారు. ఏపీఎన్‌జీవోల సభకు ఎలా అనుమతి వచ్చింది? ఎవరు అనుమతి ఇప్పించారు? ఏపీఎన్‌జీవోల వెనుకున్న శక్తులేమిటీ? అని ఆలోచించేకంటే ఈ సభ మాటున తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలేమిటో పసిగట్టాలి. ఆ కుట్రలకు మనం పావులుగా మారకుండా స్వయం నియంత్రణ పాటించాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంత ప్రజలను వలస పాలకులు, వారి అనుయాయిలు ఎలా దోపిడీ చేసింది అందరికి తెలిసినదే. తెలంగాణ సాధన కోసం ఉద్యమం తారస్థాయిలో జరుగుతున్న సమయంలోనూ సీమాంధ్ర పాలకుల దోపిడీ, దగాకోరు విధానాలు మారలేదు. వారి పక్షపాత వైఖరిలో ఎలాంటి మార్పు కానరాలేదు. తెలంగాణ ప్రజలు హక్కుల గురించి ఎంతగా ఉద్యమిస్తున్నా అంతకుముంచి మన హక్కుల హణనం కొనసాగిందిక్కడ. తెలంగాణ ప్రజలు దోపిడీ నుంచి విముక్తి కోసం, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ 1500 మందికిపైగా యువత, విద్యార్థులను పోగొట్టుకుంది. కొందరిని రాజ్యమే హత్య చేస్తే మరికొందరు సీమాంధ్రుల కుట్రలు, కుతంత్రాలు చూసి గుండె చెదిరి ఆత్మబలిదానాలకు చేసుకున్నారు. ఆరు దశాబ్దాల ఆకాంక్ష, నాలుగు దశాబ్దాల పోరాటం ఫలిస్తుందనుకున్న వేళ సీమాంధ్రులు మళ్లీ అడ్డుపుల్ల రాజకీయాలు మొదలుపెట్టారు. దానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, రాష్ట్ర రాజకీయాలు (సీమాంధ్రలో) ప్రభావితం చేయగలిగిన శక్తులు ముందువరుసలో నిలవడం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు నిర్ణయం గగ్గోలు పెడుతున్న వారంతా ఒకనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి తీరాలని కోరిన వారే. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన వారే. రాష్ట్రంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఎనిమిది పార్టీల్లో ఏడు పార్టీలు తెలంగాణకు సానుకూలంగా మాట్లాడాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే నిర్ణయాన్ని ప్రకటించాయి. ఒక్క సీపీఎం మాత్రమే సమైక్య రాష్ట్రమే తమ అభిమతమని చెప్పినా, రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను చల్లబరిచేందుకు చర్యలు తీసుకుంటే తామేమి అడ్డుకోబోమని పేర్కొంది. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా తెలంగాణ ఏర్పాటుకు పచ్చజెండా ఊపాయి. అన్ని రాజకీయ పక్షాలు తెలంగాణకు జై కొట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు తెలంగాణపై కల్లబొల్లి కబుర్లు చెప్పిన రాజకీయ పక్షాలు యూటర్న్ తీసుకున్నాయి. తెలంగాణ ఏర్పాటుతో ఏదో ఘోరం జరిగిపోబోతుందంటూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే యాత్రలకు తెరతీశాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో భయాందోళనలు రేకెత్తేలా మాట్లాడాడు. అంతవరకు పెట్టుబడిదారుల స్పాన్సర్‌షిప్‌లో నడిచిన సీమాంధ్రుల పోటీ ఉద్యమానికి కాస్త ప్రజల ఆదరణ దక్కింది. అయితే అది ఇప్పటికే పూర్తిస్థాయిలో కాకపోవడం అక్కడి ఉద్యమ లోపం. సీమాంధ్ర ప్రాంత ప్రజలను పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి తీసుకురావడంతో పాటు తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు భద్రత లేదని చెప్పడమే అభిమతంగా పెట్టుకున్న పెత్తందారులు హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర కోరుతూ ఓ సభకు తెరతీశారు. దానికి ముఖ్యమంత్రి దగ్గరుండి అనుమతి ఇప్పించాడు. సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న డీజీపీ అందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియ పూర్తి చేయించాడు. ఈ సభకు అనుమతి ఇవ్వడం వెనుక ఉద్దేశమే తెలంగాణవాదులను రెచ్చగొట్టడం. ఏపీఎన్‌జీవోల సభ సందర్భంగా విధ్వంసం సృష్టించి, దానిని తెలంగాణవాదులకు అంటగట్టి రాష్ట్ర విభజన ప్రక్రియకు కేంద్రం పుల్‌స్టాప్ పెట్టేలా చేయడం సీమాంధ్ర పెత్తందారుల ఉద్దేశం. దీనికి కర్త, కర్మ అంతా తానై వ్యవహరిస్తున్న వ్యక్తి సీఎం కిరణ్. వాళ్ల ఉద్దేశాలు స్పష్టమైన సందర్భంలో తెలంగాణవాదులు సంయమనం పాటించాలి. ఎవరెన్ని కుట్రలు పన్నినా హైదరాబాద్‌లో సీమాంధ్రులు సమైక్యాంధ్ర కోసం నిర్వహించే చిట్టచివరి సభ ఇదే. ఈ ఒక్క సభలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. పడగొట్టడం గొప్పదనం కాదు.. నిర్మించడం.. నిర్మాణాత్మకంగా వ్యవహరించడమే గొప్ప. సీమాంధ్రులే ఏపీఎన్‌జీవోల సభలో విధ్వంసం సృష్టించుకొని ఆ నింద తెలంగాణవాదులపై మోపడానికి సిద్ధపడుతున్నారు. ఇది వరకు అలా వ్యవహరించిన చరిత్ర వారిది. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్ష, నాలుగు దశాబ్దాల పోరాటం ఫలించబోతున్న వేళ ఉద్రిక్తతలకు తావిచ్చేలా మనం వ్యవహరించడం సరికాదు. ఏపీఎన్‌జీవోలు ఏం చెప్పుకుంటారో చెప్పుకోనివ్వాలి. నిజానిజాలు ఏమిటో ప్రజలకు ఇప్పటికే అవగతమైంది. ఇలాంటి సందర్భంలో మనం ఏమాత్రం పట్టుదప్పినా మొత్తం మొదటికే చేటు తెచ్చేందుకు కుట్రలు సాగుతున్నాయి. ఇప్పుడు మనం ఆ కుట్రలను ఛేదించాలి. మన రాష్ట్రం సాధించుకోవడానికి సంయమనంతో వ్యవహరించాలి.