మనం రెచ్చిపోవద్దు

ముల్కీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈనెల 7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు టీ జేఏసీ ప్రకటించింది. ఈ ర్యాలీకి అనుమతి కోసం హైదరాబాద్‌ నగర పోలీసులకు రాతపూర్వకంగా దరఖాస్తు కూడా చేసింది. అదేరోజు సమైక్యాంధ్ర కోరుతూ ఏపీఎన్‌జీవోలు నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో బహిరంగసభ నిర్వహించ తలపెట్టారు. టీ జేఏసీ శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించిన హైదరాబాద్‌ నగర పోలీసులు ఏపీఎన్‌జీవోల బహిరంగ సభకు మాత్రం అనుమతినిచ్చారు. బయటికేవో షరతులు అని చెప్తున్నా బాజాప్త సభ పెట్టుకోండి మేము వెనుకుండి చూసుకుంటాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమ సారథులుగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిల ప్రోద్బలంతోనే సీమాంధ్రుల బహరింగ సభకు సులభంగా అనుమతి లభించింది. గడిచిన దశాబ్దకాలంగా తెలంగాణ సాధన కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమం సాగుతోంది. ఈక్రమంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన వివిధ ర్యాలీలు, ఆందోళనలకు ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి అనుమతి నిరాకరించింది. ఉద్యమంలో సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశమున్నట్లు ఇంటెలిజెన్స్‌ చెప్పిందనో, అనుమతి ఇస్తే శాంతిభద్రతలు పట్టుదప్పుతాయనో అనుమతి ఇవ్వకుండా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేవారు. తెలంగాణ సాధన కోసం ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా గ్రామ స్థాయి నుంచే నిర్బంధాలు పెట్టి అవి విజయవంతం కాకుండా చేసిన కుట్రలెన్నో మన కళ్ల ముందు కదలాడుతున్నాయి. మొన్నటికి మొన్న శాంతియుతంగా చలో అసెంబ్లీ నిర్వహించుకుంటామంటే సీమాంధ్ర సర్కారు చేసిన రచ్చ అంతాఇంతా కాదు. పది జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే రోడ్లు, రైలు మార్గాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి ఎవరినీ రాజధాని వైపు వెళ్లకుండా అడ్డుకోవాలని కుట్రలు పన్నారు. మొత్తం తెలంగాణను ఖాకీ వలయంగా మార్చి చలో అసెంబ్లీ జరుగనివ్వకుండా చేయాలని ప్రయత్నించిన సీమాంధ్ర సర్కారు, పోలీసు బాస్‌ ఘోరంగా విఫలమయ్యారు. నిర్బంధాలను, భద్రతా వలయాలను, ముళ్ల కంచెలను ఛేదించుకొని తెలంగాణ బిడ్డలు జేఏసీ జెండాలు, నల్ల జెండాలతో అసెంబ్లీ వైపునకు దూసుకొచ్చారు. ఈ రోజు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌, ఇతర నేతలను అరెస్టు చేసే క్రమంలో పోలీసుల దమనకాండ ఇదివరకెపుడూ చూసి ఎరుగం. తెలంగాణ ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నించే సీమాంధ్ర పాలకులు ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న ఏపీఎన్‌జీవోలు హైదరాబాద్‌లో సభ పెట్టుకునేందుకు ఎలా అనుమతించారు అంటే వారి లక్ష్యం సుస్పష్టమవుతోంది. హైదరాబాద్‌లో ఏపీఎన్‌జీవోల సభకు అనుమతి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి హైదరాబాద్‌లో రణరంగం సృష్టించాలనేది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిల వృహం. సమైక్య రాష్ట్రంలోనే తమకు భద్రత లేకుంటే రేపు తెలంగాణ ఏర్పడ్డాక ఇక బతకనిస్తారా అనేదాన్ని ఎత్తి చూపి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని విభజ ప్రక్రియ నుంచి వెనక్కు వెళ్లేలా చేయాలనేది వారి ప్రయత్నం. తెలంగాణను అడ్డుకునేందుకు తెరవెనుక అనేక ప్రయత్నాలు చేస్తున్న సీఎం ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణలోని యువత, విద్యార్థులను రెచ్చగొట్టి మళ్లీ 1969 నాటి పరిస్థితులు తీసుకురావాలని కుట్ర పన్నుతున్నాడు. అందుకే ఏపీఎన్‌జీవోలు అడిగిందే తడవుగా సభకు అనుమతి ఇచ్చి తన కుట్ర రాజకీయాలకు పదను పెట్టాడు. ఇందుకు తనతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న డీజీపీని  ముందు వరుసలో నిలిపాడు. ఏపీఎన్‌జీవోల సభకు 19 షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్టు చెప్పిన పోలీసులు ఆ సభలోకి సంఘవిద్రోహ శక్తులు చొరబడే అవకాశం ఉందనే అనుమానాన్ని తాజాగా వ్యక్తం చేశారు. వారనుకునే సంఘవిద్రోహ శక్తులెవరో? వాళ్లు ఏడో తేదీన ఎలాంటి అరాచకానికి పథక రచన సిద్ధం చేశారో? అది తెలంగాణ ఏర్పాటుకు  అడ్డంకిగా మార్చడానికి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారో మనకు తెలియదు. తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి, కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌, సాగరహారం, సడక్‌బంద్‌, చలో అసెంబ్లీ ఇలా ఎన్నో కార్యక్రమాలకు సీమాంధ్ర సర్కారుకాని, పోలీసులుగాని అనుమతి ఇవ్వలేదు. అంతేకాదు వాటిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి సృష్టించిన రభస ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. తెలంగాణకు పాలకులే అడ్డం అయినప్పుడు  వారు ఎన్ని కుట్రలకైనా సిద్ధపడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సీమాంధ్రులు ఎంతగా రెచ్చగొట్టినా మనం సంయమనంతో వ్యవహరించాలి. నాలుగు దశాబ్దాల పోరాటం ఫలిస్తుందనుకున్న వేళ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలే కాని రెచ్చిపోతే పరిస్థితిని చేయి దాటేలా చేయడం వారికి పెద్ద విషయం కాదు. విడిపోయే సమయంలో సుహృద్భావ వాతావరణం కల్పించే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వమే రెచ్చగొట్టడానికి ప్రయత్నించినపుడు తెలంగాణ ప్రజలు స్వయం నియంత్రణ పాటించాలి. సీమాంధ్రులు పన్నే కుట్రలను ఛేదించి మన తెలంగాణ మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు రెచ్చిపోతే దానిని రచ్చచేయడానికి వారి దగ్గర సకల సాదనాలూ ఉన్నాయి. మనం సంయమనంతో ఉండటమే కాదు. తెలంగాణవాదుల పేరిట విధ్వంసానికి పథక రచన చేసే శక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి దుష్టశక్తుల సమాచారం బట్టబయలు చేయాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వేళ శాంతి, సంయమనం విడిపోయే మనకే అవసరం. అలా అని సీమాంధ్రులు ఏం చేసినా చూస్తూ భరించాలని కాదు. రెచ్చగొట్టడమే ధ్యేయంగా మలుచుకున్న సమయమనే విషయాన్ని గుర్తెరగాలి. తెలంగాణ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే చర్యలు ముమ్మరం చేయాలి. ముల్కీ అమరవీరుల సంస్మణార్థం శాంతి ర్యాలీకి ప్రతి తెలంగాణవాది తరలివచ్చి విజయవంతం చేయాలి.