సీమాంధ్రులు హైదరాబాద్‌కు ఎందుకొచ్చారు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత హైదరాబాద్‌పై విభిన్న వాదనలు వినవస్తున్నాయి. వాటిలో కొన్ని బహువిచిత్రంగా ఉంటే మరికొన్ని అతిశయోక్తిగొల్పుతున్నాయి. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశాం కాబట్టి నగరం తమకే దక్కాలనేది వారి వాదన. హైదరాబాద్ నగరానికి సరిగ్గా 57 ఏళ్ల క్రితం పొట్ట చేతబట్టుకొని వలస వచ్చిన ఎందరో ఇప్పుడు బడా పారిశ్రామిక వేత్తలుగా రూపాంతరం చెందారు. తొండ ముదిరి ఊసరవెళ్లిగా మారినట్టు చిన్నపాటి వ్యాపారులు ఇప్పుడు కార్పొరేట్ శక్తులుగా ఎదిగారు. ఆరు దశాబ్దాలు కూడా పూర్తికాక మునుపే వారు అంతటి పురుగోతి సాధించడానికి కారణం హైదరాబాద్. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వమే హైదరాబాద్ సకల సంపన్న రాజ్యం. అభివృద్ధిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉండే ఈ నగరానికి నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. నాలుగు శతాబ్దాల్లో రెండున్నర శతాబ్దాలు స్వతంత్ర దేశానికో, భారత యూనియన్‌లోని రాష్ట్రానికో రాజధానిగా ఉంది. కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. అసఫ్‌జాహీల కాలంలో హైదరాబాద్ ప్రపంచ శ్రేణి నగరంగా గుర్తింపుపొందింది. సొంత విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలకు కరెంట్ వెలుగులు ప్రసాదించారు. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ, విద్యాలయాలు, ఆస్పత్రులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, విశాలమైన రోడ్లు యువతకు ఉపాధి కల్పనకు పరిశ్రమలు స్థాపించారు. హైదరాబాద్‌ను పెద్ద వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో కృషి చేశారు. నిజాం కాలం నిర్మించిన ఎన్నో భవంతులను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపౌలన కోసం ఉపయోగిస్తున్నారు. నిజాం నిర్మించిన భవనంలోనే రాష్ట్ర అసెంబ్లీ, హైకోర్టు, అమెరికన్ కాన్సులేట్ తదిరత జాతీయ, అంతర్జాతీయ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం లభించినప్పుడు హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉండేది. పటేల్ సైనిక చర్యతో హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయించారు. ఎనిమిదేళ్ల పాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది. అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడగా మద్రాస్ నుంచి అవమానకరంగా వెళ్లొచ్చిన సీమాంధ్రులు చీమలదండులా హైదరాబాద్‌కు వలస బాటపట్టారు. హైదరాబాద్‌లో, తెలంగాణలో పది జిల్లాల్లో సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, భూములు, తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కొళ్లగొట్టి నయా కార్పొరేట్ల స్థాయికి పడగలెత్తారు. వ్యాపారాల కోసం వచ్చిన వారు తెలంగాణ, హైదరాబాద్ వనరులు దోచుకొని రాజకీయ నేతలుగా రూపాంతరం చెందారు. ఇప్పుడు వాళ్లే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తామొచ్చే తెలంగాణ ప్రజలకు నాగరికత, వ్యవసాయం నేర్పామని నోటికి వచ్చినట్లుగా అబద్ధాలు వళ్లిస్తున్నారు. వీరంతా ఒక ఎత్తయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి వ్యవహారం మరో ఎత్తు. తానే హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దానని చెప్తున్నాడు. దేశానికి స్వాతంత్య్రం రాకమునుపే హైదరాబాద్ ప్రపంచ శ్రేణి నగరంగా కీర్తి గడించింది. ఇప్పుడు సీమాంధ్రులు ఆక్రమించిన కోటిలో అప్పట్లోనే తుంగ నీలకంఠం బట్టల దుకాణం ఎంతో పేరుగాంచింది. సుల్తాన్‌బజార్‌లో వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు వ్యాపారాలు సాగించే వారు. నిజాం కాలంలో నిర్మించిన ఎన్నో చారిత్రక వారసత్వ కట్టడాలను చంద్రబాబునాయుడు కాలంలో ధ్వంసం చేశారు. హైదరాబాద్ చారిత్రక, వారసత్వ సంపదను విధ్వంసం చేయడం ప్రారంభించిందే చంద్రబాబు. నిజాం హైదరాబాద్ ప్రజల కోసం కేటాయించిన భూములను గోల్ఫ్‌కోర్సులు, విల్లాలకు అప్పనంగా కట్టబెట్టడం మొదలు పెట్టింది కూడా ఈ బడాయి బాబే. హైదరాబాద్ నగర ప్రజల కోసం నిజాం కాలంలో నిర్మించిన విద్యుత్ కేంద్రాన్ని ధ్వంసం చేసి దానిపై ఎన్టీఆర్ మెమోరియల్ పార్క్‌ను, ఐమ్యాక్స్‌ను కట్టించింది కూడా ఈయనే. ఫ్లైవోవర్ల పేరుతో హైదరాబాద్‌లోని పలు చారిత్రాత్మక కట్టడాలను పూర్తిగా ధ్వంసం చేసిన ఘనుడు ఆయన. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికే ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌లో వ్యాపారాల కోసం వచ్చిన సీమాంధ్రులు ఇప్పుడు తామే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం నిజంగా దౌర్భగ్యం. హైదరాబాద్‌ను ఆధారంగా చేసుకొని వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకొని, వాటిని విస్తరింపజేసుకొని తరతరాలకు సరిపడా ఆస్తులు కూడగట్టుకున్న వారు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారా? ఆ పేరిట సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడ్డారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని కొందరు, ఉద్యమాలతో హైదరాబాద్‌కు ప్రాజెక్టులు పరిశ్రమలు రాకుండా పోతున్నాయని ఇంకొందరు విష ప్రచారం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో ఒక్క ఆస్తిని కూడా ధ్వంసం చేసినట్లుగా ఎక్కడా నమోదు కాలేదు. కానీ సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమం తీరును చూస్తే ఎవగింపు కలుగుతోంది. హైదరాబాద్ తెలంగాణకు దక్కొద్దనే ఏకైక లక్ష్యంతోనే సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని అందుకోసం తమ సర్వస్వం దారపోశామని అబద్ధాలపై అబద్ధాలు వల్లెవేస్తున్నారు. సీమాంధ్ర మీడియానైతే ఈ విషయం దిగజారుడు విధానాలు అవలంబిస్తోంది. నాడు ఉమ్మడి మద్రాస్ విభజనప్పుడు చెన్నైని విడిచి వచ్చిన తాము ఇప్పుడు హైదరాబాద్‌ను విడిచిపోవాలా అని వితండవాదం చేస్తున్నారు. కానీ సీమాంధ్రులు గుర్తించాల్సిన అంశాలను పెట్టుబడిదారులు కావాలని మరుగున పడేస్తున్నారు. కాలక్రమంలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధిని తమ వల్ల జరిగిందని చెప్పుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. హైదరాబాద్‌లో వ్యాపార సామ్రాజ్యాలు, కాంట్రాక్టులు, స్టూడియోలు, క్లబ్బులు, పబ్బులు, షాపింగ్ మాల్స్ నిర్మించి తాము ఆర్థికంగా వృద్ధి చెందారే తప్ప హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామనడం సత్యదూరం.