తెలంగాణ ప్రక్రియ వేగవంతానికి టీ కాంగ్రెస్‌ నేతలు చొరవ తీసుకోవాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ జూలై 30న ప్రకటించింది. ఈమేరకు అదే రోజు సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కూడా. అదే రోజు భేటీ అయిన యూపీఏ భాగస్వామ్య పక్షాలు సీడబ్ల్యూసీ నిర్ణయానికి పచ్చజెండా ఊపారు. యూపీఏ ప్రభుత్వానికి అన్నీ తానే అయిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక వేగంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని పది జిల్లాల ప్రజలు ఆకాంక్షించారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌, ఇతర నేతలు ఆ తర్వాత అధిష్టానానికే అడ్డం తిరిగారు. తామే సర్వస్వం అయి సీమాంధ్ర ప్రాంతంలో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తూ అది ప్రజల ఆకాంక్ష అని బుకాయిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన తర్వాత కానీ, రాజ్యసభలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పక్షాన ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రకటన చేశాక కానీ సీమాంధ్ర ప్రాంతంలో, ప్రజల్లో ఎలాంటి ఆందోళనలు కనిపించలేదు. అక్కడి ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటే జులై 31నే తీవ్రస్థాయిలో ఆందోళనలు ప్రారంభం కావాల్సింది. తెలంగాణ డిమాండ్‌ కొత్తగా ఉన్నది కాదు కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర విభజన తప్పదని సీమాంధ్రులు సిద్ధంగానే ఉన్నారు. ఈనేపథ్యంలోనే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభించాక కూడా ఎంతమాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను, తెలంగాణను నిలువునా దోపిడీ చేసిన పెత్తందారులు ఇక తమ దోపిడీ సాగదేమోనని వారు డబ్బు సంచులు కుమ్మరించి సీమాంధ్ర ప్రాంతంలోని జిల్లా కేంద్రాలు, ముఖ్యపట్టణాల్లో కృత్రిమ ఉద్యమాన్ని రాజేశారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకొని, దీనిపై కట్టుబడి ఉన్నది సోనియాగాంధీ కాబట్టి ఆమె కుటుంబానికి చెందిన మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను లక్ష్యంగా చేసుకొని ధ్వంస రచన కొనసాగించారు. దీనిపై సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తేగాని విగ్రహాల విధ్వంసానికి తెరపడలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే అభద్రతా భావంతో మాట్లాడితే ఇక తమకేమి రక్షణ ఉంటుందని అప్పుడు ప్రజలు వీధుల్లోకి రావడం మొదలు పెట్టారు. అయినా ఉద్యమ తీవ్రత అధిష్టానానికి తెలియడం లేదని తామే ఏపీఎన్‌జీవోలతో సమ్మె మొదలు పెట్టించాడు సీఎం కిరణ్‌. హైదరాబాద్‌ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే ధ్యేయంగా వారు ఇక్కడ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇప్పించాడు. ముఖ్యమంత్రి స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ డైరెక్షన్‌లో సాగిన ఏపీఎన్‌జీవోల సభ తెలంగాణవాదులపై దాడులకే పరిమితమైంది. మూడు గంటలకుపైగా సాగిన సభ తెలంగాణ ఉద్యమంపై తెలంగాణవాదులపై విషం కక్కడానికే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన వల్ల ఉద్యోగులకు తలెత్తే ఇబ్బందులేమిటో కూడా చెప్పలేని స్థితిలో అక్కడి ఎన్‌జీవోలు సమ్మె చేస్తున్నారంటే సీమాంధ్రలోని ఉద్యమ కృత్రిమత్వం తేటతెల్లమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పేరుమోసిన లాబీయిస్టులు కుట్రలు చేస్తుంటే టీ కాంగ్రెస్‌ నేతల్లోని కొందరు మాత్రం తామే తెలంగాణ తెచ్చామని ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టించుకోవడానికే పరిమితమవుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను పార్లమెంట్‌లో విజయవంతంగా వినిపించి అధిష్టానంపై ఎంపీలు ఒత్తిడి తేగలిగారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తెలంగాణ ప్రకటనకు ముందు వరకు ముఖ్యమంత్రి లాల్చీ పట్టుకు తిరిగిన మంత్రులు, ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమంలో పాల్గొనని వారు తామే తెలంగాణ తెచ్చామని చెప్పడాన్ని ఇక్కడి ప్రజలు కూడా అంతగా హర్షించడం లేదు. సీమాంధ్రులు మూకుమ్మడిగా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుండగా టీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం అంతే ఐక్యంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని మాత్రం డిమాండ్‌ చేయలేకపోతున్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆందోళనలు ఎందుకని గతంలో ప్రకటించిన వారు ఇప్పుడు నాలిక్కరుచుకొని తెలంగాణపై హైకమాండ్‌ను కలిసి ఒత్తిడి తెస్తామని చెప్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్‌లో నిర్వహించిన టీ నేతల సమావేశానికి ఖమ్మం మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి హాజరుకావడంపై కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ రాష్ట్ర మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు అభ్యంతరం చెప్పడంలో న్యాయం కూడా ఉంది. వారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలనే ఈ సందర్భంగా ప్రతిఫలింపజేశారు.

తెలంగాణ కోసం సాగిన బలిదానాలపై రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలను ఇక్కడి ప్రజలెవరూ ఎప్పటికీ మర్చిపోరు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రేణుకను ఖమ్మం ప్రజలు గెలిపిస్తే ఆమె తెలంగాణకు వ్యతిరేకంగానే ఇంతకాలం పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ అనివార్యం అయ్యే పరిస్థితిలో సందట్లో సడేమియా మాదిరిగా తానూ తెలంగాణవాదినేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా రేపు రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందాలనేది ఆమె లక్ష్యం. తెలంగాణ ప్రజలకున్నంత విశాల హృదయం సీమాంధ్రులకు లేదు అనడానికి రేణుకా చౌదరే ప్రత్యక్ష సాక్ష్యం. ఒక్క రేణుక చౌదరినే కాదు అలాంటి ఎందరో వలసవాదులను తమ ప్రజాప్రతినిధులుగా గెలిపించిన గొప్ప మనుసు తెలంగాణ ప్రజలది. అలాంటి ప్రజలకు ద్రోహం చేయడానికి సీమాంధ్రులు మూకుమ్మడిగా కుట్ర రాజకీయాలకు తెరతీసిన వేళ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఐక్యంగా వాటిని తిప్పికొట్టడానికి ఉద్యుక్తం కావాలి. సంఘటితంగా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయించాలి. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై 47 రోజుల క్రితం ప్రకటన చేసింది. ఆ ప్రకటన తర్వాత యూపీఏ ప్రభుత్వం రాజ్యాంగ పరమైన ప్రక్రియ కూడా ప్రారంభించింది. కానీ ఏదో ఒక మూల సందేహం తెలంగాణ ప్రజలను వెంటాడుతోంది. ఆ సందేహాన్ని నివృత్తి చేయడం ఇక్కడ కాంగ్రెస్‌ నేతల బాధ్యత. నాలుగు దశాబ్దాల పాటు కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎంతమాత్రం ఆలస్యం జరిగినా భరించడానికి సిద్ధంగా ఇక్కడి ప్రజలు లేరు. హోం మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన నోట్‌ను వెంటనే కేబినెట్‌ ముందుకు వచ్చేలా అధిష్టానంపై ఒత్తిడి పెంచాలి. ఆ తర్వాతి ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలి. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసయ్యాక సంబరాలు చేసుకోవచ్చు. ఇప్పుడు అధిష్టానంపై ఒత్తిడి పెంచి ప్రక్రియను వేగవంతం చేయడమే తమ ముందున్న లక్ష్యంగా టీ కాంగ్రెస్‌ నేతలు పనిచేయాలి.