విమోచనం కాదు దురాక్రమణ
తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17ను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ, కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మొదటి నుంచి కోరుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వీటికి వంతపాడాయి. అప్పట్లో టీఆర్‌ఎస్ కూడా గొంతు కలిపి తర్వాత గోడమీది పిల్లవాటం ప్రదర్శిస్తోంది. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో బలవంతంగా చేరిన సెప్టెంబర్ 17పై రకరకాల డిమాండ్లు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని ఔరంగాబాద్, నాందేడ్, బీదర్, ఉస్మానాబాద్, రాయచూర్ తదితర జిల్లాలు ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రలో అంతర్భాగంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో సెప్టెంబర్ 17ను ఆయా ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినంగా నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ స్టేట్‌లోని రాజధాని నగరం సహా తెలంగాణ జిల్లాల్లో మాత్రం విమోచన దినోత్సవం నిర్వహించడం లేదు కాబట్టి ఇకనైనా నిర్వహించాలని బీజేపీ చాలా సార్లు డిమాండ్ చేసింది. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంలో కీలక భూమిక పోషించినట్లుగా చెప్పుకునే కమ్యూనిస్టులు ఇదే డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్నారు. సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవమో, విలీన దినోత్సవం నిర్వహించి అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను తిట్టిపోయాలనేది ఆయా రాజకీయ పార్టీల ఎత్తుగడ. 65 ఏళ్ల క్రితం స్వతంత్ర రాజ్యంగా ఉన్న హైదరాబాద్ సైనిక చర్య ద్వారా ఇండియన్ యూనియన్‌లో కలిసింది. కానీ ఇంత వరకు తెలంగాణ ప్రాంతంలో విమోచన, విలీన దినం నిర్వహణకు పూనుకోలేదు. అసలు హైదరాబాద్ విమోచన, విలోన దినోత్సవ డిమాండే అర్థం లేనిది. భారత దేశానికి మాదిరిగా హైదరాబాద్ బ్రిటిషర్ల ఏలుబడిలో లేదు. హైదరాబాద్ స్వతంత్య్ర రాజ్యంగా ఉండేది. ఇక్కడి ప్రజల సౌకర్యార్థం నిజాం నవాబు చేసిన కృషి చిరస్మరణీయం. కానీ వలస పాలకులు, భారత ప్రభుత్వాన్ని నడిపిన వారు హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు హైదరాబాద్ చరిత్రను తెలియకుండా చేశారు. కాబట్టే ప్రజల్లో కొందరు కూడా విమోచన, విలోన దినోత్సవాల డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నారు. ఇందుకు వారిని తప్పుపట్టలేం. మన చరిత్ర ఏమిటో వారికి తెలియదు. హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన చివరి అసఫ్‌జాహీ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్. హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యాక హైదరాబాద్ స్టేట్‌కు ఆయన రాజ్‌ప్రముఖ్. అది అప్పటి భారత ప్రభుత్వం కల్పించిన గౌరవం. సెప్టెంబర్ 17కు ముందు వెనుక ఏం జరిగింది అనే అంశాలపై ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్య్రం సిద్ధించింది. అదే సమయంలో 543 సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యాయి. భౌగోళికంగా భారత్‌కు సమీపంలోనో, చుట్టూ భారత భూభాగం ఉన్న సంస్థానాలు అనివార్య పరిస్థితుల్లోనో ఇండియన్ యూనియన్‌లో విలీనం కాక తప్పలేదు. కానీ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించే మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇందుకు సమ్మతించలేదు. కాంగ్రెస్ పెద్దలు ఆయనపై ఒత్తిడి తెచ్చినా ససేమిరా అన్నాడు. చివరికి విషయం ఐక్యరాజ్య సమితి వరకూ వెళ్లింది. సమితి జోక్యంతో మీర్ ఉస్మాన్ అలీఖాన్‌తో భారత ప్రభుత్వ పెద్దలు చర్చలు ప్రారంభించారు. ఆ చర్చలు కొలిక్కిరాకముందే భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై యుద్ధం ప్రకటించింది. ఇందుకు హైదరాబాద్ స్టేట్‌లో దేశ్‌ముఖ్‌లు, పట్వారీల ప్రైవేటు సైన్యంగా చెప్పుకునే రజాకార్లు సాగించిన దురాఘతాలు ఒక కారణం. రజాకార్లు నిజాం సైన్యమనే అపవాదును ఆపాదించి వారిపై భారత సైన్యం యుద్ధం చేసి హైదరాబాద్ సంస్థానానికి విముక్తం కల్పించిందనే ప్రచారమే ఎక్కువగా సాగింది. హైదరాబాద్ సంస్థానంలో విస్తరించి ఉన్న దేశ్‌ముఖ్‌లు, దొరలు తమ అక్రమాస్తులను రక్షించుకోవడానికి, మరింత విస్తృతం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సైన్యం మాత్రమే రజాకార్లు. వాళ్లు సాగించిన అరాచకాలను ఇక్కడ సమర్థించడం లేదు. వారి దాష్టీకానికి ఎందరో బలైపోయారు. మరెందరో యువతులు, మహిళలు చెరచబడ్డారు. వారిపై అప్పటి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ప్రజలు తిరగబడ్డారు. ఎందరో వీరులు, ధీరులు వారి అకృత్యాలకు ఎదురొడ్డి పోరాడారు. ఈక్రమంలో అమరులయ్యారు. రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం సాగించిన తెలంగాణ వీరుల త్యాగం బహుమూల్యమైనది. అయితే రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానంపై ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సర్దార్ పటేల్ సైన్యం విరుచుకుపడింది. అప్పుడు రాజ్యం ఏలుతున్నది ముస్లిం రాజు కబట్టి కనపడిన ప్రతి ముస్లింను రజాకార్ అని దారుణంగా హత్య చేశారు. గడ్డం పెంచుకున్న హిందువులూ ఈ హత్యాకాండలో సమిధలయ్యారు. పటేల్ సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో 40 వేల మంది వరకు ముస్లింలను పొట్టనబెట్టుకుంది. మరికొన్ని వందల మంది ఏమయ్యారో కూడా తెలియదు. వేలాది మహిళలపై సైనికులు అత్యాచారం జరిపి హత్య చేశారు. అయితే ఆపరేషన్ పోలో వల్ల హైదరాబాద్ రాజ్యంలో రక్తం బొట్టు కూడా చిందొద్దని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముందస్తుగానే పటేల్‌కు లొంగిపోయాడు. అయినప్పటికీ హైదరాబాద్ సంస్థానం వ్యాప్తంగా ఊచకోతలు కొనసాగాయి. ఈక్రమంలో నిజమైన రజాకార్లతో పాటు అమాయక ముస్లింలు బలయ్యారు. గడ్డం పెంచుకున్న హిందువులు హత్యకు గురయ్యారు. ఆపరేషన్ పోలో విజయవంతమైనట్టుగా ప్రకటించిన భారత ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి అప్పటి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను రాజ్ ప్రముఖ్‌గా ప్రకటించింది. నిజంగా నిజాం రాజే దుర్మార్గుడైతే అతడినే ఎందుకు రాజ్‌ప్రముఖ్‌గా నియమించారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ అప్పటి హైదరాబాద్ సంస్థానం వ్యాప్తంగా జరిగిన పోరాటం నిజాంకు వ్యతిరేకంగానే అయితే అది 1948 సెప్టెంబర్ 17న ముగిసిపోవాలి. కానీ హైదరాబాద్ స్టేట్‌లో 1951 వరకు ఉద్యమాలు, పోరాటాలు కొనసాగాయి. పటేల్ సైన్యం రజాకార్లను మట్టుబెట్టిందే కానీ వారిని సృష్టించిన దేశ్‌ముఖ్‌లను, దొరలను మాత్రం వదిలిపెట్టింది. అసలు దోపిడీదారులపైన వారికి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్‌లో ఆందోళనలు కొనసాగాయి. అంటే హైదరాబాద్ సంస్థానంలో జరిగింది నిజాం వ్యతిరేక పోరాటమా? దేశ్‌ముఖ్‌లు, దొరలకు వ్యతిరేకంగా సాగిందా అనే విషయం అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ సంస్థానం సుసంపన్నమైనది. ఇప్పుడు భారతదేశంలోని 543 సంస్థానాలను ఏలిన ఏ రాజు కూడా నిజాం రాజు మాదిరిగా తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. నిజాం చేసిన అభివృద్ధికి ఇప్పటికీ సజీవ సాక్ష్యాలున్నాయి. కానీ నిజాం రాజు ముస్లిం కావడం వల్లనో మరే కారణాలతోనే ఆయన చేసిన అభివృద్ధిని గుర్తించడం లేదు. ప్రజల కోసం విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల కాక యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు, ఈ ప్రాంత భూముల్లో సిరులు పండించేందుకు గొలుసుకట్టు చెరువులు నిర్మించిన ఘనత నిజాం నవాబులది. ఆయన కీర్తిని ఎప్పుడూ స్మరించని ప్రభుత్వం, పార్టీలు ఆయన్ను తిట్టడానికి మాత్రం విమొచన, విలీన దినోత్సవాలు నిర్వహించాలని కోరుతున్నాయి. హైదరాబాద్ సంస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేసిన నిజాంల పేరిట ఉత్సవాలు జరపని ప్రభుత్వం, శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు మాత్రం నిర్వహించి తన పక్షపాత బుద్ధిని బయటపెట్టుకుంది. నిజాం, కృష్ణదేవరాయల్లో ఎవరు ప్రజల పక్షం వహించారో? ఎవరు తమ ఏలుబడిలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి బాట పట్టించారో అందరికీ తెలుసు కానీ నిజాం చరిత్రను ఎవరికీ తెలయకుండా మరుగు పర్చాలని వలస పాలకులు ఎన్నో కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారు. వాటిని తుత్తినియలు చేసి అసలు చరిత్రను చాటేందుకు తెలంగాణవాదులు ముందుకు వస్తున్నారు. సెప్టెంబర్ 17 అందరూ అనుకుంటున్నట్టు విమోనచన దినమో, విలీన దినమో కాదని, ముమ్మాటికీ దురాక్రమణ దినమని ఎలుగెత్తి చాటుతున్నారు.