బాబు ఢిల్లీకి ఎందుకు పోయిండు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ ఢిల్లీ పోయిండు. ఒకప్పుడు యునైటెడ్‌ ఫ్రంట్‌, తర్వాత నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌లకు కన్వీనర్‌గా కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబునాయుడు ప్రభ గడిచిన తొమ్మిదేళ్లలో పూర్తిగా సన్నగిల్లింది. కంప్యూటర్‌ను తానే కనిపెట్టాననే స్థాయిలో ఫోజులు కొట్టే ఈ ఐటీ నిరక్షరాస్యుడు ఉన్నట్టుండి ఎందుకు ఢిల్లీలో వాలిపోయాడా? అనే సందేహం తెలంగాణ ప్రజలను పట్టిపీడిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితులకు తెరదించడమనే పేరుతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నాయకులను వెంటబెట్టుకొని హస్తిన చేరిన చంద్రబాబు ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా బిజీగా కనిపించారు. చంద్రబాబుకు మొదటి నుంచి అది అలావాటు కూడా. తనకు తానుగా బిజీగా ఉన్నట్టు బిల్డప్‌ ఇచ్చుకోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. రాజకీయ అసంబద్ధ నిర్ణయాలతో అధికార పీఠానికి బహుదూరమైన బాబు రాజకీయ గ్రాఫ్‌ కొన్నేళ్లుగా నేల చూపులే చూస్తోంది. ఈ ఎకనామిస్ట్‌ పొలిటికల్‌ కెరేర్‌ గ్రాఫ్‌ డమేల్మనడంతో ఆయననే నమ్ముకున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇప్పుడు తెలంగాణను అడ్డుకోవడంలో ఎవరెవరు ఎలా ఉపయోగపడతారో వారిని అలాగే ఉపయోగించుకుంటున్నారు. అలాంటి ఉపయోగ పథకంలో భాగంగానే బాబు ఢిల్లీలో అడుగుపెట్టినట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాబును అతి దగ్గరగా చూసిన వారే కాదు.. తెలంగాణపై ఆయన మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరి ఇప్పటి టూర్‌పై సందేహాలు ముసురుకునేలా చేస్తోంది.  చంద్రబాబుకు మొదటి నుంచి తెలంగాణ అంటే చిన్నచూపే. అసెంబ్లీలో తెలంగాణ పదమే ఉచ్చరించవద్దని నిర్బంధాలు పెట్టిన కర్కోటకుడు చంద్రబాబు. ఇక్కడ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కోరుతుంటే సమైక్యవాదంతో 2004 ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబును తెలంగాణ ప్రజలే కాదు.. మొత్తం రాష్ట్రంలోని ప్రజలు ఓట్లతో చావు దెబ్బతీశారు. అయినా బాబు నేనసలే మొండోడ్ని అన్నట్టుగా కొన్నాళ్లు బిల్డప్‌ ఇచ్చాడు. ఓట్ల రాజకీయాల్లో అంతకు కొద్దికాలం క్రితం వరకు కలిసి వచ్చిన అదృష్టం ఆమడం దూరం పోవడంతో హైటెక్‌ బాబు భూమార్గం పట్టాడు. అప్పుడు ఆయనకు ప్రజలు గుర్తొచ్చారు. వారి అవసరాలు గుర్తొచ్చాయి. అన్నింటికీ మించి రాజకీయ సమాధి కట్టిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష వెంటాడింది. 2009 ఎన్నికల్లో గెలిస్తే తప్ప రాజకీయ భవిష్యత్‌ ఉండొదని, బాఆగమేఘాల మీద తెలంగాణపై నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని లేఖరూపంలో యూపీఏ -1 హయాంలో ఏర్పాటు చేసిన ప్రణబ్‌ముఖర్జి కమిటీకి ఇప్పించాడు. అదేలేఖను బూచీగా చూపి తెలంగాణ ప్రజల ఓట్లను దండుకునేందుకు ఉద్యమపార్టీతో పొత్తుపెట్టుకున్నాడు. కానీ బాబుకు అధికారం మాత్రం దక్కలేదు. ఎన్నికలు అయిపోగానే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమ హోరు ఢిల్లీని కదిలించింది. తొలిసారిగా తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పక్షాన ఆ ఏడాది డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనపై ప్రకటన వెలువడింది. అంతకు 24 గంటల ముందు వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కోరిన బాబు నాలుక ఆవేశంతో బుసలు కక్కింది. తెలంగాణ ఏర్పాటు ఎలా చేస్తారంటూ బాబుగారు ఆవేశంతో ఊగిపోయారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకస్థానాల్లో ఉన్న పొరుగు రాష్ట్రాల వారిపై అక్కసు వెళ్లగక్కి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. ఆ తర్వాత తెలంగాణపై బాబు వేసినన్ని పిల్లిమొగ్గలు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు కూడా వేయరేమో! అన్నట్టుగా ప్రవర్తించాడు. ఆ చంద్రబాబు నాయుడు మళ్లీ ఇప్పుడు ఢిల్లీలో అడుగుపెట్టడం వెనుక కారాణాలేమిటా? అని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లోని బలమైన ప్రత్యేక రాష్ట్ర కాంక్షపై కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 30న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌ విభజనపై రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభించింది. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని సీమాంధ్ర ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దశాబ్దాల పోరాటానికి ఫలితం వస్తుందులే అని ఎవరి పనులు వారు చేసుకుపోయారు. కానీ సీమాంధ్ర పెత్తందారులు మాత్రం రెచ్చిపోయి ఆ 13 జిల్లాల్లో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. సరిగ్గా అదేసయంలో చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణపై అడ్డుపుల్ల రాజకీయాలు మొదలుపెట్టారు. తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర పేరిట సీమాంధ్ర జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించి అక్కడి ప్రజలకు ఉన్నవీ లేనివీ నూరిపోశాడు. అంతేకాదు ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ ఇస్తానంటే తానే అడ్డుకున్నానని చెప్పుకున్నాడు కూడా. చేసేదంతా చేసి ఇప్పుడు రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నివారించాలని కోరుతూ తన బృందాన్ని వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్లాడు. ఒకప్పుడు అక్కడ చక్రం తిప్పిన చరిత్ర ఉంది కాబట్టి దాన్నేమైనా వాడుకొని తెలంగాణకు బాబు మళ్లీ అడ్డం పడుతాడని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 2009లో బాబు ప్రవర్తనతోనే వెనక్కిపోయిన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మళ్లీ ఇప్పుడు ఆగితే ఇక్కడి ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ రావణకాష్టంలా మార్చిందని బాబు ఆవేశంగా మాట్లాడటం కాదు ఎంతమంది సమ్మతించాక యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుంది అనే విషయాన్ని అందరూ విస్మరిస్తున్నారు. ప్రజలందరినీ సమానంగా చూడలేని బాబులాంటి వారు ఆంధ్రప్రదేశ్‌లో అనిశ్చిత పరిస్థితి పరిష్కారానికి ఢిల్లీకి వెళ్లేంత విశాల హృదయుడని ఎవరూ అనుకోబోరు. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు ఇప్పటికే సుస్పష్టం. ఇప్పుడు కూడా  బాబు తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు కానీ హైదరాబాద్‌పై సీమాంధ్రులకు హక్కులు కల్పించాలని ఢిల్లీ పెద్దలను కోరినట్టుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే మంత్రుల బృందానికి అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఉన్నా చంద్రబాబు తన గ్యాంగ్‌ను వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్లి ఏం చేశాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణపై స్పష్టమైన ప్రకటనేది చేయకుండానే బాబు ఢిల్లీలో చక్కర్లు కొట్టడం కూడా అనేక సందేహాలకు తావిస్తోంది. ఇరు ప్రాంతాల నేతలతో  ఢిల్లీకి వెళ్లడం ద్వారా సమన్యాయం అనే కొత్త డిమాండ్‌తో బాబు కొత్త రాజకీయ కుట్రకు తెరతీసినట్టుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మొత్తంగా బాబు ఢిల్లీ పర్యటనపైనే తెలంగాణ ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని నివృత్తి చేసే బాధ్యతను టీ టీడీపీ కాకుండా అధినేతే స్వయంగా తీసుకుంటే మంచిది.