మైనార్టీలపై దాడులు ఎక్కడ జరిగినా ఖండించాలి
పాకిస్థాన్‌లోని పక్తూన్ ఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్‌లోని చారిత్రక చర్చి తాలిబాన్ ఆత్మహుతి బాంబర్లు, కెన్యా రాజధాని నైరోబీలోని ఓ షాపింగ్ మాల్‌లో అల్‌ఖాయిదా సానుభూతి పరులుగా చెప్తున్న వారు సృష్టించిన మారణహోమం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇరు దేశాల్లో నివసిస్తున్న మైనార్టీలపై ఉగ్రవాదుల దాడి నూటికి నూరుపాళ్లు ప్రజాస్వామిక హక్కుల హననమే. పెషావర్‌లోని ఓ చర్చిలో ఆదివారం ప్రార్థనలకు హాజరైన క్రిస్టియన్లపై ఇద్దరు తాలిబాన్ బాంబర్లు ఆత్మాహుతి దాడికి పాల్పడి సుమారు 80 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇక నైరోబీలోని వెస్ట్‌గేట్ షాపింగ్ మాల్‌లోకి చొరబడిన సుమారు 15 మంది అల్‌కాయిదా అనుబంధ ‘అల్ షెబాబ్’ సంస్థకు చెందిన ఉగ్రవాదులు నాలుగు రోజులుగా మారణహోమాన్ని కొనసాగిస్తున్నారు. వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికులు భారతీయులే. అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సాధారణ ప్రజలున్నారు. ఈ రెండు దాడులు కొన్ని గంటల వ్యవధిలోనే చోటు చేసుకోవడమే కాదు ఈ దాడులకు అనేక సారూప్యతలు ఉన్నాయి. ఇరు దాడులు ఉగ్ర ప్రేరేపితాలే. ప్రపంచ దేశాలకు పెద్దన్నల వ్యవహరిస్తున్న అమెరికా ఇస్లామిక్ దేశాలు సహా పలు చిన్న దేశాలపై సాగిస్తున్న దురాక్రమణకు వ్యతిరేకంగానే పెషావర్‌లోని చర్చిలో మానవబాంబు పేలుళ్లు జరిగినట్లుగా స్పష్టమవుతోంది. మరోవైపు సోమాలియాలోని దక్షిణ ప్రాంతంలో సాగుతున్న ఉగ్రవాద అణచివేత చర్యల్లో కెన్యా పాలుపంచుకుంటోంది. 2011 నుంచి ఆఫ్రికన్ యూనియన్ బలగాలతో కలిసి సుమారు నాలుగు వేల మంది కెన్యా సైనికులు సోమాలియాలో సైనిక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. దానికి ప్రతీకారంగానే తాము వెస్ట్‌గేట్ షాపింగ్‌మాల్‌పై దాడి చేసినట్లు ‘అల్ షెబాబ్’ సంస్థ ప్రకటించింది కూడా. మూడు రోజులకుపైగా తుపాకుల మోతలతో దద్దరిల్లిన వెస్ట్‌గేట్ షాపింగ్ మాల్ మృతుల సంఖ్య ఎంతో ఇంతవరకూ స్పష్టత రాలేదు. సుమారు 70 మంది మృతిచెందినట్లు అధికారులు పేర్కొనగా, ఆ సంఖ్య ఎప్పుడో వందను దాటి ఉంటుందని సమాచారం. మరోవైపు పాకిస్థాన్‌లో తాలిబాన్ ఆత్మాహుతి బాంబర్లు 700 మందికి పైగా ప్రార్థనలు నిర్వహిస్తున్న చర్చీని టార్గెట్‌గా చేసుకొని పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో సుమారు 70 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఆధిపత్యానికి అనేక దేశాలు అష్టకష్టాలు పడుతున్నది, కొన్ని దేశాలు దాని దురాఘతానికి బలైంది నూటికి నూరుపాళ్లు నిజం. అలాగని ఏమీ తెలియని అమాయకులను లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడటం మాత్రం అన్యాయం. ఉగ్ర సంస్థలే కావొచ్చు హక్కుల సంస్థలే కావొచ్చు తమ యుద్ధం ఎవరితోనే ముందుగా తేల్చుకోవాలి. పాలకుల దురాఘతాలతో, దుశ్చర్యలతో, స్వార్థ నిర్ణయాలతో ఎలాంటి సంబంధం లేని ప్రజలను బలిచేయడం ఆయా సంస్థలకు సరికాదు. భారత్‌లోనూ ఉగ్రజాడలు ఉన్నాయి. వాటికి మతం రంగు కూడా పులుముకుంది. మతం ప్రాతిపదికన వివిధ సంస్థలు ప్రభుత్వాలను హెచ్చరించేందుకు ప్రజలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నారు. అయితే వీటికి భిన్నమైన పరిస్థితి గుజరాత్‌లో మనం కళ్లారా చూశాం. ఇక్కడ ప్రభుత్వమే నరమేధాన్ని ప్రోత్సహించినట్టుగా అనేక ఆధారాలున్నాయి. గోద్రా అనంతర పరిణామాలు గుజరాత్‌లో ఎంతో భయోత్పాతాన్ని సృష్టించాయి. భారత్‌లో మైనార్టీలుగా ఉన్న ముస్లింలు గుజరాత్ నరమేధంలో భారీగా నష్టపోయారు. 2001లో అక్కడ జరిగిన పరిణామాలు ఇంకా ఎవరి స్మృతిపథంలోంచి పోలేదంటే అవి మనసున్న వారిని ఎంతలా వెంటాడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్‌లో మైనార్టీలపై దాడిని ఒక్క ముస్లిం సమాజమే ప్రశ్నించలేదు. దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువులు సైతం ఇలాంటి ఘటనలు మంచివి కావన్నారు. పాలకులే సూత్రధారులుగా మారి నరమేధాన్ని సృష్టించడాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుబట్టింది. దాని తాలుఖూ చేదు జ్ఞాపకాలు ఇంకా గుజరాతీలను వెంటాడుతున్నాయి. గుజరాత్‌లో మైనార్టీలపై దాడులను ఎలాగైతే ఖండించామో పెషావర్, నైరోబీ దాడులపైనా అదే విధంగా స్పందించాలి. ఏ దేశంలోనైనా మైనార్టీలపై, హక్కుల గురించి గొంతెత్తలేని అశక్తులపై దాడులకు పాల్పడటం మానవత్వానికే మాయని మచ్చ. మత మౌఢ్యంలో కొట్టుకుపోయే వారికి మానవత్వమెక్కడ ఉంటుందని ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడానికి. 21వ శతాబ్దం ప్రజలను శరవేగంతో ముందుకు తీసుకెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ వేగం మాటున పెద్దన్న అమెరికా దురాక్రమణలున్నాయి. కుతంత్రాలున్నాయి. వ్యాపార సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష మరింత స్పష్టంగా ఉంది. తాము లాభ పడేందుకు, తమ దేశ కంపెనీలు లబ్ధిపొందేందుకు ప్రపంచంలోని అనేక దేశాల అవసరాలను ఆసరగా చేసుకొని అమెరికా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడం, తర్వాత ఆయా దేశాల్లో వివిధ పేర్లతో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకొని బలహీనులపై దురాక్రమణకు పాల్పడటం అమెరికాకు ఇటీవల మామూలైపోయింది. అమెరికా లాభాపేక్ష, స్వార్థ చింతన ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శత్రువులను కూడా మూటగట్టుకుంది. వివిధ దేశాలపై దురాక్రమణకు పాల్పడుతున్న నాటో బలగాల దాష్టీకాలతో విసిగి వేసారిన వివిధ సంస్థలు అమెరికా, అలాంటి చర్యలకు పాల్పడుతున్న మరికొన్ని దేశాలపై యుద్ధమే ప్రకటించాయి. ఈ యుద్ధంలో ఎందరో సైనికులు, ప్రత్యర్థి వర్గాలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ యుద్ధం సామాన్య ప్రజలను సమిధలుగా మార్చడమే అందరినీ కలచివేస్తోంది. మైనార్టీలపై, అల్పసంఖ్యాకులపై ఆధిపత్య వర్గాలు దాడులకు పాల్పడటం, వారిని చెరబెట్టడం ఇప్పుడే కొత్తకాదు. కానీ అది ఇటీవల కాలంలో కొత్త పుంతలు తొక్కుతోంది. కొన్ని చోట్ల ఆయా వర్గాల హక్కులను పూర్తిగా హరించడమో, శాశ్వతంగా వారి నోరు మూయించడమో లక్ష్యంగా దురాఘతాలు సాగుతున్నాయి. ఇవి ప్రజాస్వామిక వ్యవస్థలో ఎంతమాత్రం క్షేమకరం కానివి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నే నేలకూల్చిన చరిత్ర ప్రపంచ దేశాలది. అప్పుడు బ్రిటన్ సాగించిన రీతిలోనే అమెరికా ఇప్పుడు ప్రపంచంపై పట్టుకోసం వ్యాపార సామ్రాజ్య విస్తరణకు తెరతీసింది. ఈ విస్తరణ కాంక్ష కొన్ని వర్గాలను పూర్తిగా తుడిచిపెట్టేదిగా ఉంది. మరికొన్ని వర్గాలను లోభరుచుకొని వారి గొంతులు నొక్కాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు తిరుగుబాటుగా కొన్ని సంస్థలు చేస్తున్న ప్రతిఘటన చర్యలు అమాయకులనే బలిగొంటున్నాయి. ఇటు ఆధిపత్యవర్గం, అటు పీడిత వర్గం యుద్ధంలో సామాన్యులు సమిధలు కావడం, మైనార్టీలు లక్ష్యం కావడం మానవాళి మనుగడకే ప్రశ్నిస్తోంది. నరమేధం ఇలాగే కొనసాగితే మన నాగరికత తెచ్చిపెట్టిన ఫలితమిదా? అని మనల్ని మనమే నిందించుకోవాల్సి వస్తుంది. మైనార్టీల హక్కులను కాలరాయాలని చేసే యత్నాలనే కాదు, మైనార్టీలపై దాడులను సైతం పౌరసమాజం స్వేచ్ఛగా ప్రశ్నించగలగాలి. తద్వారా ఆయా శక్తుల్లో మార్పులు రావడం సంగతి అటుంచితే మనం కనీసం మనుషులమని, మరికొందరిని మనుషులుగా మర్చగలమనే ధీమా, ఆత్మవిశ్వాసం పొందాలి. తద్వారా సమసమాజ స్థాపనకు బాటలు వేయాలి.