తెలంగాణ ఉద్యమానికి ప్రపంచ ఖ్యాతి


ఉప్పు సత్యాగ్రహం సరసన తెలంగాణ మహాగర్జన
ప్రపంచ ముఖ్య ఘట్టాల్లో తెలంగాణ అస్తిత్వ పోరాటం
ఎకనామిక్స్‌ టైమ్స్‌ ప్రత్యేక కథనం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమానికి ప్రపంచ ఖ్యాతి లభించింది. మహోద్యమాల సరసన తెలంగాణ ఉద్యమం చేరింది. ప్రపంచంలో ఎనిమిది ప్రధాన ఘట్టాల్లో తెలంగాణ ఉద్యమం ఒకటిగా కీర్తించింది. యావత్‌ ప్రపంచంలో ఇదే అదిపెద్ద ఉద్యమంగా పేర్కొంటూ ఎకనామిక్స్‌ టైమ్స్‌ ప్రత్యేక కథనం ప్రచురించింది. వివరాల్లోకి వెళ్తే.. స్వాతంత్య్ర సమరంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో 1930లో మొదలైన ఉప్పు సత్యాగ్రహం తర్వాత భారత దేశంలో తెలంగాణ అస్తిత్వ పోరాట మహా సింహ గర్జన నిలిచింది. 2010 వరంగల్‌లో నిర్వహించిన ఈ సభకు 30 లక్షల మంది హాజరై చరిత్ర సృష్టించారు. 1986లో బెనజీర్‌ భుట్టో తిరిగి పాకిస్తాన్‌కు వచ్చినప్పుడు, అలాగే 1989లో చైనాలో ప్రజాస్వామ్యం కోసం విద్యార్థులు తియానన్‌మెన్‌ స్కైర్‌ పోరాటం, 1963లో వాషింగ్టన్‌ మార్చ్‌, 2011లో ది అరబ్‌స్ప్రింగ్‌ పోరాటం, 2004లో లెబనాన్‌లో ది ఆరెంజ్‌ రివల్యూషన్‌, 2003, ఫిబ్రవరి 15 ఇరాక్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలు ప్రపంచంలో ముఖ్యఘట్టాలుగా నిలిచాయి. ఈ అరుదైన రికార్డు తెలంగాణ ఉద్యమం సొంతం చేసుకోవడం గర్వించదగ్గ విషయం.