70కోట్లతో రోళ్లవాగు ఆధునీకరణ
ఎస్సారెస్పీ ద్వారా ఇక ఏడాదంతా నీళ్లు :ఎమ్మెల్యే
జగిత్యాల,ఫిబ్రవరి9(జనంసాక్షి): నియోజకవర్గంలోని రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు రూ.70 కోట్లతో పనులు జరుగుతున్నాయనీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. త్వరలో పనులు కూడా పూర్తవుతాయన్నారు. ఇప్పటి వరకు ఉన్న సామర్థ్యం కంటే నాలుగింతలు ఎక్కువగా నీటి లభ్యత ప్రాజెక్టులో ఉంటుందన్నారు. శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతులకు ప్రాజెక్టు నుంచి నీటినందించామని స్పష్టం చేశారు. రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. దీంతో ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు ఏడాదంతా నీళ్లు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. దీంతో రాయికల్ మండలంలోని రాయికల్, దావన్‌పల్లి, మైతాపూర్, మేడిపల్లి పరిధిలోని గ్రామాల్లోని పంట పొలాలకు సాగునీటి లభ్యమవుతుందన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిండిన చెరువులు, బావులు, బోర్లలో ఉన్న నీటితో పంటలు పండించుకుంటే తమకు అభ్యంతరం లేదని అధికారులు తెలిపారన్నారు.ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద 14.40లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంగా కట్టారని, కానీ ఏనాడు 9లక్షల ఎకరాల కంటే సాగు నీరందించలేదని, ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండకపోవడం వల్ల 6లక్షల లోపే నీరు అందుతుందన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 120 టీఎంసీలు ఉండగా గత పదిహేనేళ్లలో పూర్తిస్థాయిలో నీరుచేరడం లేదని, ఒకవేళ చేరినా, ఆగస్టులో నీరు రావడంతో మొదటి పంటకు నీరు అందించే వీలు దక్కడం లేదన్నారు. అందుకే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. శరవేగంగా పనులు నడుస్తున్నాయనీ, వచ్చే జూన్ నాటికి నీటిని అందించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు.