విశ్వాసాలు సరే.. మూఢ విశ్వాసాలు పట్టుకు వేలాడొద్దు

ఇప్పుడు దేశం మొత్తం ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌ జిల్లా దాండియాఖేరా గ్రామం వైపు చూస్తోంది. మన దేశంలోని అన్ని భాషల మీడియా, ఒక్క దేశమేంటీ అంతర్జాతీయ మీడియా మొత్తం ఇప్పుడు అక్కడే తిష్ట వేసింది. ఉన్నవ్‌ గ్రామంలోని 60 ఎకరాల పరిధిలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తవ్వకాలపై అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దాండియాఖేరాకు చెందిన స్వామి శోభన్‌ సర్కార్‌ అనే సాధువు ఈ మొత్తం తతంగానికి కారకుడు. నిన్న మొన్నటి వరకూ ఉన్నవ్‌ జిల్లా అంటేనే ఎవరికీ సరిగ్గా తెలిసేది కాదు. కానీ ఆ జిల్లాకు ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి. అంతర్జాతీయ మీడియాలో గడిచిన కొన్ని రోజులుగా మార్మోగుతున్న పేరు అది. 19వ శతాబ్దానికి చెందిన రాజా రావ్‌రామ్‌ బక్ష్‌సింగ్‌ నిర్మించిన రాజకోటలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు తాను కల గన్నానని స్వామి శోభన్‌ సర్కార్‌ చెప్పాడు. ఆ వెయ్యి టన్నుల బంగారు నిధికి రాజా ఆత్మ రక్షణగా ఉందని, తన ఆత్మకు విముక్తి కల్పించాలని రాజు తనను కలలో కోరాడని శోభన్‌ సర్కార్‌ ఇటీవల వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం వరకు ఉన్నవ్‌ ప్రాంతానికే పరిమితమైన శోభన్‌ సర్కారు ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఆయన అబద్ధాలే ఆడరని, ఆయన చెప్పింది ముమ్మాటికీ నిజమవుతుందని ఆ ప్రాంత ప్రజల విశ్వాసమట. ఆ విశ్వాసం మేరకు రాజకోటలో వెయ్యి టన్నుల బంగారు నిధి ఉండి తీరుతుందని, దానిని బయటికి తీస్తే దేశ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని కొందరు వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టారు. శోభన్‌ సర్కారు చెప్పింది తడవుగా భారత పురావస్తు శాఖ దాండియాఖేరా గ్రామంలో వాలిపోయింది. ఆ గ్రామానికి వీ వీఐపీల తాకిడి పెరిగిపోయింది. ఇప్పుడు అక్కడ జాతర జరుగుతుందా అని అనుమానం కలుగక మానదు. మీడియా శోభన్‌ సర్కారు చెప్పిన విషయానికి అధిక ప్రాధాన్యత కల్పించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం శాస్త్రీయ పరిశోధనలు కూడా జరుపకుండా తవ్వకాలు చేపట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రోజుల తరబడి తవ్వకాలు సాగుతున్నా ఇంతవరకు బంగారు నిధి ఆనవాళ్లేవి కానరాలేదు. దేశంలో రాజరిక పాలన సాగినకాలంలో సామ్రాజ్యాధినేతలు తమ వైభవాన్ని చాటిచెప్పేందుకు ఆలయాలు, కోటలు నిర్మింపజేసి వాటిలో అమూల్యమైన బంగారు, వెండి వజ్రాభరణాలు ఉంచినట్టు చారిత్రక తవ్వకాల్లో అనేక పర్యాయాలు వెల్లడైంది. ఇప్పటికీ దేశంలోని అనేక చారిత్రక ప్రాంతాల్లో గుప్తనిధులు  ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఆ నిధులు దక్కించుకోవడానికి వివిధ రకాల శక్తులు, అనేక సంఘవిద్రోహ చర్యలకు పాల్పడినట్టు ఆధారాలూ ఉన్నాయి. ఈనేపథ్యంలో దాండియాఖేరాలోని రాజకోటలోనూ అమూల్యమైన బంగారు నిధి ఉండి ఉండవచ్చని సాధు సన్యాసులే కాదు మన పాలకులు అనుమానిస్తున్నారు. అందుకే సాధువు శోభన్‌ సర్కారు చెప్పిందే తడవుగా కోటలో తవ్వకాలు మొదలు పెట్టారు. దాండియాఖేరా కోటలో నిధి నిక్షేపాలు ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇందుకు శాస్త్రీయ ఆధారాలేమైనా ఉన్నాయా అనే విషయాలేవి పట్టించుకోకుండా భారత పురాతత్వ శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి 60 ఎకరాల విస్తీర్ణంలో రాత్రింభవళ్లు అవిశ్రాంతంగా తవ్వకాలు జరుపుతున్నారు. అయినా ఇంతవరకూ బంగారం జాడ కనిపించలేదు. ఒక సాధువు కలను ఆధారంగా చేసుకొని తవ్వకాలకు సిద్ధపడ్డ భారత పురావస్తు శాఖ ఒకవేళ అక్కడ ఆయన కలలో చెప్పినట్లుగా వెయ్యి టన్నుల బంగారం దొరకకపోతే ఏం సమాధానమిస్తుంది? అనే ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేదు. ఒకవేళ అదే జరిగితే మన దేశ పరువు ప్రపంచ దేశాల ముందు నగబాటు కాదా? ఆ అవమానాన్ని భరించగలమా? మన దేశ ప్రజల విశ్వాసాలపై ఆధారపడే బతుకుతున్నారు. కానీ పాలకులు కూడా అవే విశ్వాసాలు పట్టుకు వేల్లాడం సరికాదు. పాలకులు ఏదైనా ముందడుగు వేశారంటే ఒకటికి రెండు పర్యాయాలు సరిచూసుకోవాలి. తర్వాతి పరిణామాలను బేరీజు వేసుకున్నాకే రంగంలోకి దిగాలి. దాండియాఖేరాలో శోభన్‌సర్కార్‌ మొదట చెప్పినట్టే వెయ్యి టన్నుల బంగారు ఆభరణాలు లభ్యం కావచ్చు. లేదా ఏమీ దొరక్కపోవచ్చు. వెయ్యి టన్నుల బంగారం దొరికితే శోభన్‌ సర్కార్‌ నిజంగా హీరోగా నిలుస్తాడు. లేదంటే ఆయన ఎలాగైతే ఓవర్‌నైట్‌లో హీరో అయిపోయారో అంతే వేగంగా జీరో అయిపోతారు. అది వేరే సంగతి. కానీ ఒక్క వ్యక్తి కల ఆధారంగా నిధుల తవ్వకానికి సిద్ధపడ్డ ప్రభుత్వం పరువేం గాను అనే ప్రశ్నే ఇప్పుడు సగటు భారతీయుడిని వేధిస్తోంది. ఆలూ లేదు చూలు లేదు కొడుకుపేరు ఏదో అన్నట్టు దొరకబోయే నిధిపై హక్కు తమకు దక్కాలంటే తమకు దక్కాలని ఉత్తరప్రదేశ్‌, కేంద్ర ప్రభుత్వాలు సిగపట్లు పడుతున్నాయి. శోభన్‌ సర్కారు ప్రకటన ఆధారంగా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా తవ్వకాలకు సిద్ధపడ్డారనే వాదనను ఇటీవల పురావస్తు శాఖ కొట్టిపారేసింది. తమ వద్ద పూర్తి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాకే తవ్వకాలు ప్రారంభించినట్టు చెప్పింది. పురవస్తు ప్రకటన తర్వాత శోభన్‌ సర్కారు మరో అడుగు ముందకేశాడు. తనకు మళ్లీ కల వచ్చిందని, ఆ కలలో వెయ్యి టన్నులు కాదు రెండున్నర వేల టన్నుల బంగారు ఉన్నట్లుగా తేలిందని చెప్పాడు. ఆ ప్రకటన తర్వాత మన పాలకులకు మరింత వెర్రెక్కిపోయింది. ఎలాగైనా గై కొనాలి నిధి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే అందరికి మంచిదే. కానీ ఏదైనా అనుకోనిది జరిగితే మాత్రం బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకొని మొత్తం ప్రజలను నవ్వుల పాలు చేసే అవకాశముంది. విశ్వాసాలను తప్పుబట్టడం లేదు. వాటి మాటున ప్రజలను చులకన చేయవద్దనే అందరూ కోరుకునేది. అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి. ఏవైన చర్యలకు సిద్ధపడేటప్పుడు ఒకటికి రెండు పర్యాయాలు శాస్త్రీయ పరమైన ప్రయోగాలు చేసుకొని ముందడుగు వేయాలి.