నిజమే.. తెలంగాణ ఉద్యమం ప్రళయమే
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చాలా ఆలస్యంగా ఒక నిజాన్ని గుర్తించాడు. అది ఆయన చెప్పినట్టుగా రాష్ట్ర విభజన తుపాను కాదు.. తెలంగాణ ఉద్యమ దాటే ప్రళయంతో సమానం. ముఖ్యమంత్రి గగ్గోలు పెట్టినట్టు ప్రళయం కంటే ఎక్కువ కూడా. శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్ తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కిరణ్ రాజకీయాలు మాట్లాడకూడని చోట రాజకీయాలు.. దిగజారుడు రాజకీయాలు మాట్లాడి తన రాజకీయ అపరిపక్వతను చాటి చెప్పాడు. తాను నామినేటెడ్ సీఎంను మాత్రమేనని, తన తండ్రి రాజకీయ వారసత్వంగానే నేతగా కొనసాగుతూ వస్తున్నాను తప్ప సొంత తెలివి తేటలు లేవని తనకు తానే చెప్పుకుని ప్రజల్లో నగుబాటుకు గురయ్యాడు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారో.. అసలు ఆయన ఏ పరిస్థితుల్లో రాజకీయ రంగప్రవేశం చేశారో అందరికీ తెలుసు. తండ్రి మరణం తర్వాత చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రవేశించిన కిరణ్, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. రెండూ యాథృచ్చికంగా జరిగినవే. ఇంకో మాట చెప్పాలంటే ప్రకృతి సిద్ధంగా జరగాల్సిన పరిణామాలు జరిగినప్పుడు కిరణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడమో, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడమో జరిగాయి. ఇప్పుడు అదే ప్రకృతిని కిరణ్ సవాల్ చేస్తున్నాడు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడానికి కిరణ్ ఎన్ని తంటాలు పడ్డాడో.. చివరికి ఎలా ఎమ్మెల్యేగా గెలిచాడో అందరికీ తెలుసు. ఆయన నియోజకవర్గానికి వెళ్లి అడిగితే కిరణ్ ప్రతిభను కథలు కథలుగా చెప్తారు. ఎమ్మెల్యేగా గెలవడానికి అన్ని తంటాలు పడ్డ వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించిన రోజు ఆయన నియోజకవర్గ ప్రజలే ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కిరణ్ చిత్తూరు జిల్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయలేకపోయారు. ఆయన తండ్రి జిల్లాను శాసించడమే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. కానీ కిరణ్ మాత్రం ఇంతకాలం తండ్రిచాటు బిడ్డగానే రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చాడు. ఆయన మరణానంతరం రాజకీయ రంగప్రవేశం చేసిన కిరణ్‌పై అమరనాథరెడ్డి ముద్ర ప్రస్ఫుటం. గతంలో మూడు పర్యాయాలు వాయల్పాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్ 2009లో నియోజకవర్గాల పునర్విభన అనంతరం పీలేరుకు మారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచేందుకు అష్టకష్టాలు పడ్డాడు. సొంత జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచేందుకు అవస్థలు పడిన కిరణ్ శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ విభజన ప్రళయాన్ని అడ్డుకుంటానని బీరాలు పలికాడు. ప్రళయానికి ఎదురొడ్డి నిలిచినవాడు బతికి బట్టకట్టినట్టు చరిత్రలో లేదు. తెలంగాణ ఉద్యమం మహాప్రళయంతో సమానమని చెప్పిన కిరణ్ దాన్ని అడ్డుకోవడానికి ఏం చేస్తాడో మాత్రం చెప్పలేదు. చెప్పడానికి ఆయన చేతుల్లో ఏమీలేదు కూడా. సీల్డ్ కవర్ సీఎం కాబట్టి ఆయనకు ఢిల్లీలోనూ ఆపాటి విలువే ఉంటుంది. అంతకుమించి కిరణ్ ఏదైనా చేస్తే చూస్తూ ఊరుకునే నిస్సహాయ స్థితిలో ఆయన పార్టీ అధిష్టానమేమీ లేదు. కిరణే కాదు కాకలు తీరిన యోధుల్లాంటి నేతలు సైతం అధిష్టానం ముందు మోకరిల్లిన సందర్భాలు కోకొల్లలు. ప్రజాప్రతినిధిగా నాలుగు పర్యాయాలు గెలిచిన కిరణ్ ఆ స్థాయిలో రాజకీయ జ్ఞానాన్ని మాత్రం సముపార్జించుకోలేదనే చెప్పాలి. ప్రళయాన్ని ఆపుతానన్న కిరణ్ నిజంగా అంతటి మొనగాడా? కిరణ్ తలచుకుంటే రాష్ట్ర విభజన ఆగుతుందా? ఆయనకు అంతటి శక్తి సామర్థ్యాలున్నాయా? ఎవరిని మభ్యపెట్టడానికి కిరణ్ ప్రగల్భాలు. ఆయన ఇలాగే చెప్తూ పోతారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. కొత్తగా సీమాంధ్ర ప్రాంతంగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన్ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తన రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో కూడా తెలియని సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడతాననో? ఇంకేదో చేస్తాననో? సీమాంధ్ర ప్రాంత ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అవేవి అయ్యే పనుల్లా కనిపించడం లేదు. ముఖ్యమంత్రివి ఉత్త ప్రగల్భాలే అని తేలిననాడు సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో ఆయనే పలుచనవుతాడు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమన్నది ఎంత సత్యమో ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరితరం కాదన్నది అంతే నిజం. కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి ఇంకా సీమాంధ్ర ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి కిరణ్, మరికొందరు సీమాంధ్ర ప్రాంత నేతలు, పెట్టుబడిదారివర్గ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. వారి అభిప్రాయాలే ప్రజల అభిప్రాయాలుగా చెలామణీ చేసేందుకు ఇన్నాళ్లు వాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వకపోవడంతో ఈ దశలోనూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటామని, లేకుంటే కాంగ్రెస్ వీడుతామని కిరణ్‌లాంటి నేతలు చెప్తున్నారు. ఆయన ఏ పార్టీలో ఉండాలనేది ఆయన ఇష్టం. ఆయనకు అది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. అయితే తప్పుడు ప్రకటనల ద్వారా భావోద్వేగాలు రగల్చే ప్రయత్నాలు మాత్రం క్షమార్హం కాదు. ముఖ్యమంత్రే కాదు సీమాంధ్ర ప్రాంత నేతలు ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలను గుర్తించాలి. ఈ దశలో తెలంగాణ ఏర్పాటు ఆగదు కాబట్టి సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఏం కావాలో కేంద్రం ముందు ఉంచాలి. వాటి సాధనకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. హైదరాబాద్‌పై ఇప్పటికైనా మమకారాన్ని తుంచుకొని సీమాంధ్రకు సర్వహంగులున్న కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక ప్యాకేజీలు కోరుకోవాలి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సీమాంధ్రలో ఏర్పాటు చేసేలా విభజన సమయంలోనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. రాజ్యాంగబద్ధంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. విజభన సమయంలో వారికున్న అభ్యంతరాలేంటో చెప్పకుండా గొంతెమ్మ కోర్కెలు కోరితే అక్కడి ప్రజలు రెంటికీ చెడ్డవారవుతారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా కిరణ్‌కుమార్‌రెడ్డి గుర్తించాలి. ప్రళయాన్ని అడ్డుకుంటామనే మూర్ఖపువాదనకు స్వస్తిచెప్పి సీమాంధ్ర ప్రజల హక్కుల కోసం పాటు పడాలి. ప్రజాప్రతినిధిగా అక్కడి ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి పంపారు కానుక వారి హక్కుల పరిరక్షణ కిరణ్‌లాంటి వాళ్ల ధ్యేయం కావాలి. కానీ ప్రజలతో సంబంధం లేని అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. అలవికాని హామీలిచ్చి ప్రజల్లో పలుచన కావొద్దు.