రాహుల్ ఆందోళననూ పట్టించుకోవాలి
సీమాంతర ఉగ్రవాదాన్ని భారతీయ జనతాపార్టీ పెంచిపోషిస్తున్నదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం వెనుక కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని కొట్టిపారేయలేం. సార్వత్రిక ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు కనుక ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ అని, లౌకికవాదులెవరూ బీజేపీ వైపు మొగ్గుచూపకుండా రాహుల్ ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న యునైటెడ్ ప్రోగెస్సివ్ అలయెన్స్ (యూపీఏ)ను నడిపిస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. 2009 ఎన్నికల సమయంలో యూపీఏ భాగస్వామ్యపక్షాలు గా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే ఇప్పుడు యూపీఏకు దూరమయ్యాయి. డీఎంకే యూపీఏకు వెలుపలి నుంచి మద్దతిస్తుండగా టీఎంసీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. కానీ ఇదే పరిస్థితి 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి ఉంటుందనుకోవడానికి అవకాశం లేదు. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రకటించడాన్ని నిరసిస్తూ నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎన్డీఏ) ప్రధాన రాజకీయ పక్షం జేడీయూ దానికి గుడ్‌బై చెప్పింది. బీజేపీలోనే మోడీకి అందరి మద్దతు లేదు. అగ్రనేత అద్వానీ ఇప్పటికైతే అలకవీడినట్టు కనిపిస్తున్నారు కానీ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. హిందుత్వ అతివాదిగా ముద్రపడిన నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే హిందువుల ఓట్లన్నీ గంపగుత్తాగా బీజేపీకే పడతాయని సంఘ్ పరివార్, రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ శక్తులు వ్యూహ రచన చేశాయి. అద్వానీ అంతటి నేత వ్యతిరేకించినా కాదని మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాయి. ఇది లౌకికవాదులకు రుచించని పరిణామం. అయితే మోడీని ప్రధానిగా చూసుకోవాలనే తలంపుతో హిందుత్వ అతివాదశక్తులు దేశంలో ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. అందులో భాగంగానే ముజఫర్‌నగర్ అల్లర్లు చోటు చేసుకున్నాయని బీజేపీయేతరుల వాదన. అందులో వాస్తవం ఉందని ముజఫర్‌నగర్ అల్లర్ల అనంతరం జరిగిన అరెస్టులు స్పష్టం చేశాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలకు ముజఫర్‌నగర్ అల్లర్లలో ప్రమేయమున్నట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వారు విచారణను ఎదుర్కొంటున్నారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు రగల్చుతున్నది భారతీయ జనతా పార్టీయేనని రాహుల్ ఆరోపించారు. ముజఫర్‌నగర్‌లో చిచ్చుపెట్టింది ఆ పార్టీయేనని, గుజరాత్లో, జమ్మూకాశ్మీర్‌లో విద్వేషాలను రెచ్చగొట్టింది కూడా ఆ పార్టీనేనని రాహుల్ పేర్కొన్నాడు. రాహుల్‌గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల సభలోనే వ్యాఖ్యలు చేయడం రాజకీయ ఆరోపణగా కొందరు పరిగణించవచ్చు కానీ వాటినీ లోతుగా పరిశీలించాల్సిన అవసరమైతే ఉంది. బీజేపీ చర్యల వల్ల సీమాంతర ఉగ్రవాదం పేట్రేగిపోతుందని రాహుల్ పేర్కొన్నాడు. దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలపై హిందుత్వ అతివాదులు జరుపుతున్న దాడుల వల్లే సీమాంతర ఉగ్రవాదం పెరిగిపోతుందనే అర్థం ధ్వనించేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత సీమాంతర ఉగ్రవాదం, అదీ పాకిస్తాన్, ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు దేశంలో పెరిగాయన్న జీర్ణించుకోలేని వాస్తవం. గుజరాత్లో ప్రభుత్వ నేతృత్వంలో మైనార్టీలపై ఊచకోతకు పాల్పడటం, మూడు వేల మందికి పైగా ముస్లిం మైనార్టీలను హత్య చేయడం లాంటి చర్యల వల్ల ఆ ఘటన సహజంగానే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపించే చర్యగా పరిణమించింది. గోద్రా అల్లర్లు, మైనార్టీల ఊచకోత తర్వాతి పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆ ఘటన కొందరిని నిజంగానే అతివాదంవైపు ఆకర్షితులను చేసింది. ఇందుకు బాధ్యత గుజరాత్ ప్రభుత్వానిదే. ప్రజలను కంటికి రెప్పలా కాచుకోవాల్సిన ప్రభుత్వమే, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన పాలకులే పక్షపాతం వహించడం, ఒకవర్గాన్ని టార్గెట్ చేయడం వల్ల అక్కడి మైనార్టీలు అభద్రతలో బతుకులీడ్చుతున్నారు. దేశంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత తత్వాన్ని ఇరుపక్షాలకు చెందిన రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఫలితంగా దేశంలో ఏదో ఓ మూల అప్పుడో ఇప్పుడో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మోడీని ప్రధానిగా ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో మత కలహాలను సృష్టించడం నిజంగా దుర్మార్గం. మత కలహాల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే దేశం తీవ్రంగా నష్టపోతుంది. అమూల్యమైన మానవ సంపదను కోల్పోవడమే కాదు దేశ సమగ్రతకూ భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. మతకలహాలతో రాజకీయ లబ్ధిపొందాలనుకునే వారు చట్టసభలకు పోటీ చేయకుండా దీర్ఘకాలం అనర్హత వేటు వేయాలి. మతకలహాల నియంత్రణకు పటిష్టమైన బిల్లును తీసుకువచ్చి అలాంటి చర్యలకు పాల్పడే పార్టీల గుర్తింపు రద్దు చేయాలి. ముజఫర్‌నగర్ బాధితులతో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయని, 15 మంది యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయని తనకు ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు చెప్పినట్టు రాహుల్ చెప్పుకొచ్చారు. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసి తప్పులో కాలేశారని కొందరు అంటున్నా, ముస్లిం యువతను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నమని ఆగ్రహించినా ఇందులోనూ ఎంతోకొంత వాస్తవం ఉండొచ్చు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశంలో జరిగిన ఉగ్రవాద దాడులు దీనిని రూఢీ చేస్తున్నాయి. పీడిత పక్షంగా ఉండే వర్గానికి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ తోడ్పాటు నందిస్తుందనడంలో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు. ఒక్క ముస్లిం వర్గమే కాదు మతోన్మాధాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలనుకునే శక్తుల పట్ల యావత్ దేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాహుల్ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో కాకుండా వాస్తవిక ధోరణితో చూడాల్సిన బాధ్యతా ప్రతి ఒక్కరిపై ఉంది.