ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ అంతిమ సంస్కారం

తెలుగువారంతా ఒకే రాష్రంలో ఉండాలని అడ్డగోలు డిమాండ్‌తో హైదరాబాద్‌ వేదికగా నిరాహార దీక్ష అంటూ హంగామా సృస్టించిన జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కి అంతిమ సంస్కారం సభనే నిర్వహించినంత పనిచేశారు. హైదరాబాద్‌లో సమైక్య రాష్ట్రం పేరుతో సభలు పెట్టడం ద్వారా సమైక్య వాదం బలీయంగా ఉన్నదని చూపే దృష్ట ప్రచారానికి జగన్‌ యత్నించారు. తనతో పాటు తన ప్రాంతీయులతో పాటు అన్ని ప్రాంతాల వారు సమైక్య ఆంధ్రప్రదేశ్‌నే కోరుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేశాడు. సమైక్య శంఖారావం పేరుతో హైదరాబాద్‌ నడిబొడ్డున సమావేశం ఏర్పాటు చేసిన జగన్‌ ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరిని కూడా ఆహ్వానించలేదు. దీనిని బట్టి చూస్తే ఆయన సమైక్యవాదంలోనే లోపాలు ఎత్తిచూపుతోంది. శంఖారావం వేదికపై జగన్‌, ఆయన పార్టీ నేతలు అబద్దాలు అలవోకగా పలికి వాటి పునాదులపై సమైక్య ఉద్యమాన్ని నడిపే యత్నానికి తెరలేపారు. 1955లో బోడుగుల రామకృష్ణారావు పదవీత్యాగం, రావి కొండాల్‌రావు వీర తెలుగువాదంలాంటి ఎన్నో ప్రస్తావించిన జగన్‌ హైదారాబాద్‌ అభివృద్ధి, ఇక్కడి ఉద్యోగాల అవకాశాల కల్పనపై కాకీ లెక్కలు చెప్పారు. ఒకప్పుడు ఏడాదికి అంతర్జాతీయ ఐటీ కంపెనీలు 50 వేల మంది విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య ఏడాదికి 20 వేలకు పడిపోయిదంటూ ఓ అర్థంపర్థం లేని లెక్కలు చూపారు. హైదరాబాద్‌, తెలంగాణ ప్రాంతమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గడిచిన కొన్నేళ్లుగా పెను సవాళ్లను ఎదుర్కోంటోంది. ఒకప్పుడు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఐటీ రంగం ఇప్పుడు అంతేస్థాయిలో ఉద్యోగాలను తగ్గిస్తోంది. దీనికి అమెరికా ఆర్థిక పరంగా పెను సవాళ్లను ఎదుర్కోవడం.. తదనంతర పరిణామాలతో అంతర్జాతీయంగా ఐటీ పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కోంటోందని గుర్తించాలి. ఇక్కడ తెలంగాణ కోరుకోవడం.. దాని కోసం ఉద్యమించడం వల్ల హైదరాబాద్‌ అభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో కోత పడిందనేది నూటికి నూరుపాళ్లు అబద్ధం. అలాగే 60 ఏళ్లు కలిసున్నం కాబట్టి హైదరాబాద్‌పై మమకారం పెంచుకున్నామని చెబుతూనే.. మరోవైపు హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని.. సీమాంధ్రులు హైదరాబాద్‌ లేకుండా ఏమాత్రం బతకజాలమని.. ఇంతకాలం హైదరాబాద్‌ను, తెలంగాణను ఎలా పీల్చిపిప్పి చేసింది జగన్‌ ఒక్క మాటలో స్పష్టం చేశాడు. రాష్ట్ర ఖజానాకు 60 శాతం ఆదాయం హైదరాబాద్‌ నుంచి సమకూరుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఎలా వెళ్లాలన్నది జగన్‌ వింత వాదన. హైదరాబాద్‌ లేకుంటే తాము బతుకజాలమని, సీమాంధ్రలో కనీసం ఉద్యోగులకు జీతం కూడా ఇచ్చుకోలేమని చెప్పడం ద్వారా హైదరాబాద్‌, తెలంగాణ దోపిడీని జగన్‌ ధ్రువీకరించాడు. జగన్‌, కిరణ్‌, చంద్రబాబు.. ఈ ముగ్గురికీ తెలంగాణ ప్రజలపై ప్రేమానురాగాలు లేవు. హైదరాబాద్‌ ఆర్థిక అనుబంధం, భూములతో సంబంధం తప్ప. జగన్‌ హైదరాబాద్‌ నడిబొడ్డున సమైక్య శంఖారావం సభ పెట్టి ఆంధ్రప్రదేశ్‌కి దింపుడుకల్లం అంతిమ యాత్రను అధికారికంగా పూర్తి చేశారు. తెలంగాణ వాదులు ముందునుంచి చెబుతున్నట్లు జగన్‌ది మామూలు వీడ్కోలు సభ మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్‌కి సంతాప సభ.. అంతిమ సభ కూడా..