పేలుళ్లపై మూలాల్లోకి వెళ్లాలి

బీహార్‌ రాజధాని ప్రపంచానికే శాంతిమంత్రం బోధించిన బుద్ధుడు పుట్టిన రాజ్యం. బీహార్‌లోని పాట్నా ఆదివారం వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో ఐదుగురు చనిపోగా.. మరెందరో క్షతగాత్రులై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాట్నాలాంటి ఘటనలను భారతీయులెవరూ సమర్థించరు.. సమర్థించరు కూడా.. ముక్తకంఠంతో ఉగ్రవాద చర్యలను పాకిస్తాన్‌ ప్రేరేపిత ఐఎస్‌ఐ నీడలను తప్పుబట్టి తీరుతారు. కేంద్రంలో దాదాపు పదేళ్లుగా యునైటెడ్‌ ప్రొగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ) అధికారంలో ఉండగా.. నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ) అధికారానికి చేరువైంది కూడా అప్పుడే. రెండు వరుస సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీజేపీ గతంలో అధికారానికి చేరువైంది. హిందుత్వ ఎజెండాను పక్కనబెట్టి.. లౌకిక వాదాన్ని భుజానికి ఎత్తుకున్నప్పుడు కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ నేతృత్వంలోని రాజకీయ సంకీర్ణ కూటమి అధికారాన్ని పంచుకుంది. తర్వాత రెండు ఎన్నికల్లో అధికారానికి బహుదూరమై 2014 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. భారతీయ జనతా పార్టీ స్వతహాగా మతతత్వ రాజకీయ పార్టీ. బీజేపీలాంటి మరికొన్ని రాజకీయ పార్టీలు దేశంలో మన్నగలిగిన కేంద్రంలో అధికారానికి బహుదూరంగానే ఉన్నవి. రామజన్మభూమి వివాదం, బాబ్రీ మసీదు కూల్చివేత లౌకికవాదానికి పేరెన్నికగన్న భారత దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచాయనేది చారిత్రాత్మక వాస్తవం. దేశంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు జరిగిన వర్గాల మధ్య విద్వేషం, హత్యకాండలలాంటి సంఘటనలు బహుస్వల్పం. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశంలో అల్పసంఖ్యాకులైన ముస్లిం మైనార్టీ యువతను పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) మతోన్మాద ఉగ్రవాదం వైపు ఉసిగొల్పిందనేది చారిత్రాత్మక వాస్తవం. దీనిని అంగీకరించడానికి దేశంలోని పెక్కుమంది ప్రజలు, లౌకికవాదం పార్టీలు అంగీకరించకపోవచ్చు. కానీ చారిత్రాత్మక సంఘటనలు మరుగుపర్చలేరు. దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15కు ఒక్క రోజు ముందు భారత్‌ నుంచి వేరుపడ్డ ఇస్లామిక్‌ దేశమైన పాకిస్తాన్‌ స్వతంత్య్రాన్ని సంపాదించుకుంది. ఆ రోజు తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లుగా ఉన్న పాకిస్తాన్‌ విచ్ఛిన్నమై బంగ్లాదేశ్‌ అనే కొత్త దేశం ఆవిర్భవించడానికి భారత్‌ దోహదపడిందని పాకిస్తానీ అతివాద భావజాలమున్న వ్యక్తులు, సంస్థలు విషసిస్తున్నారు. అందులో వాస్తవాలు లేకపోలేదు కూడా. పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ విభజన, అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం దేశంలో మైనార్టీ అణగారిన వర్గాన్ని పాకిస్తానీ ఇంటెలీజెన్స్‌ ఐఎస్‌ఐ వైపు ఆకర్శితులను చేసిందనేది ఒప్పుకోవాల్సిన నిజం. దేశంలో ఒకనాడు అన్నదమ్ముల్లా కలిసున్న హిందు, ముస్లింల మధ్య విద్వేశాలు రగిల్చింది. ఇరువర్గాలకి రాజకీయ ప్రతినిథ్య వర్గాలుగా చెప్పుకుంటున్న పార్టీలే. గతంలో దేశ రాజకీయాల్లో ప్రబల శక్తులుగా ఉన్న కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు తర్వాత కాలంలో బీజేపీ ప్రత్యేక ఓటు బ్యాంకు రాజకీయాలను సమకూర్చుకునేందుకు, కూడగట్టుకునేందుకు దేశ ప్రజల మధ్య ఎంతటి  విభజనకైనా సిద్ధపడ్డాయి. ఈ సందర్భంలో మిగతా రాజకీయ పార్టీల్లాగే కమ్యూనిస్టులను  చూడలేం. కానీ మారిన పరిస్థితుల్లో ఆ పార్టీల్లాగే అదే ధోరణి అని చెప్పుకోవచ్చు. ఇకపోతే శాంతి కాముకులుగా పేరున్న బుద్ధుడు పుట్టి నడియాడిన నేల బీహార్‌ ఆదివారం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లకు రాజకీయ కోణం ఉంది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన మోడీ మొన్నటి వరకు తమ రాజకీయ భాగస్వామి జేడీయూ నేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కే వ్యతిరేకంగా చేపట్టిన ఎన్నికల ప్రచార సభలో.. సభకు ముందు వరుసగా ఆరు పేలుళ్లు చోటు చేసుకోవడం, పాట్నా రైల్వే స్టేషన్‌ పేలుళ్లలో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం.. మరెందరో క్షతగ్రాతులవడం యావత్‌ దేశ ప్రజలను నివ్వెరపరిచింది. ఈ సందర్భంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ యువ నేత రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కుటుంబ పెద్దలను కోల్పోయిన సుమారు 15 మంది యువకులను పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ తమవైపు ఆకర్శించేందుకు రంగంలోకి దిగిందని, ఈ విషయాన్ని భారత ఇంటెలీజెన్స్‌ విభాగానికి చెందిన అధికారులు తనకు చెప్పారని రాహుల్‌ ఇటీవల ఎన్నికల ప్రచార సభలో బాహాటంగా వ్యాఖ్యానించారు. రాహుల్‌ వ్యాఖ్యలు త్వరలో జరగబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు, సీట్లు సంపాదించవచ్చనే వాదన నాణేనికి ఒకవైపు మాత్రమే. ఎవరు అంగీకరించిన, ఎవరు ఎంత తీవ్రంగా విభేదించినా రాహుల్‌ వ్యాఖ్యల వెనుక కొన్ని చేేదు నిజాలు ఉన్నాయన్నది కఠోర వాస్తవం. ఆదివారం పాట్నాలో వరుస పేలుళ్లు దేశం దృష్టిని ఆకర్శించడానికి కారణం నరేంద్రమోడీ. గుజరాత్‌లో గోద్రా అల్లర్లు, తర్వాత తదనంతర పరిణామాల నేపథ్యంలో 300 మంది మైనార్టీల ఊచకోత ఘటన దేశంలోని అల్ప సంఖ్యాకులుగా ఉన్న మైనార్టీ యువతను పొరుగు దేశ అతివాద ప్రాబల్యానికి ఎంతోకొంత గురి చేసి ఉండవచ్చు. గుజరాత్‌లో అమాయక ముస్లిం గర్భిణుల కడుపులు చీల్చి, గర్భస్థ పిండాలను శూలాలకు గుచ్చి మంటల్లో కాల్చిన దారుణమైన చరిత్ర నరేంద్రమోడీకి సొంతం. దాని తాలూకూ జ్ఞాపకాలను మోడీని వెంటాడుతుండగా ఆయననే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో నిర్భలులైన మైనార్టీ యువత, లేదా దాని వెనుక ఉన్న శక్తులు పాట్నా పేలుళ్ల వెనుక కారణమై ఉండవచ్చునేమో. ఒకనాడు అన్నదమ్ముల్లా కలిసిఉన్న భారత ప్రజల మధ్య చిచ్చుపెట్టింది మతతత్వ రాజకీయ పార్టీలు. హిందు, ముస్లింలుగా భారత ప్రజలను విభజించింది కూడా ఆ రాజకీయ పార్టీలే. ఈ నేపథ్యంలో మోడీ సభకు ముందు.. తర్వాత.. సభ ప్రాంగణం వెలుపల జరిగిన పేలుళ్లు ఒక వర్గం వారు చేసినవిగానే భావించాల్సి వస్తోంది. కానీ అందుకు దారితీసిన పరిస్థితులను సమీక్షించడానికి  ఆయా పార్టీల్లోని రాజకీయ ఆధిపత్య వర్గం అంగీకరించాలి. పాట్నా పేలుళ్లే కాదు.. దేశంలో ఏ ఏ ఉగ్రవాద ప్రేరేపిత ఘటనలను దేశ ప్రజలెవరూ అంగీకరించబోరు. పాలకులే కత్తిగట్టినప్పుడు నిర్భలులైన మైనార్టీలు పొరుగు దేశ అతివాద సంస్థలకు ప్రభావితమయ్యే అవకాశం లేకపోలేదు. రాహుల్‌గాంధీ చెప్పినట్లు ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌ ఘటనల బాధితులుగా ఉన్న మైనార్టీకి చెందిన యువతతో పాకిస్తానీ ఐఎస్‌ఐ సంప్రదింపులు జరుపుతూ ఉండవచ్చు. దేశంలో అల్పసంఖ్యాకులైన ప్రజలపై పాలకులే కత్తిగడితే దాని దుష్పరిణామాలు ఈ రోజు పాట్నా, గతంలో హైదరాబాద్‌, అంతకుముందు పూణే, మరి అంతకుముందు ముంబయిలాంటి ఘటనల వల్ల సామాన్య ప్రజలు బలైపోవచ్చు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చే వ్యక్తులను, పార్టీలను ప్రజా క్షేత్రానికి దూరంగా ఉంచడమే. ఇందుకోసం మతకలహాల నిరోధక చట్టం పార్లమెంట్‌ చేయాలి. ఇలాంటి చర్యలకు పాల్పడిన ఒకరిద్దరిని రాజకీయాలకు దూరం చేస్తే తప్ప స్వచ్ఛమైన భారత్‌లో మత రాజకీయాలకు అంతముండదు.