సీఎం రాజకీయాలు మాని తుపాను బాధితులను ఆదుకోవాలి
‘పదవులు శాశ్వతం కాదు.. ప్రజలే శాశ్వతం.. వారు ఏం కోరుకుంటున్నారో రాజకీయ పార్టీలు అదే చేయాలి. అలా చేయని వారికి ప్రజలు శాశ్వతంగా సెలవు ప్రకటిస్తారు. గతంలో ఇలా తమను విశ్వసించిన ఎందరికో ప్రజలు సెలవు ప్రకటించారు కూడా.’ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇలా సెలవిచ్చారు. తాను పనిచేస్తున్నదే ప్రజల కోసమంటే లెక్చర్లిచ్చే ముఖ్యమంత్రి వరుసగా రెండు తుపాన్ల కారణంగా సర్వస్వం కోల్పోయి రాష్ట్ర ప్రజలంతా అల్లాడుతుంటే ఆయన మాత్రం ఫక్తు రాజకీయాలే చేస్తున్నాడు. మైకుందికదా అని ఉపన్యాసాలు, నీతి సూత్రాలు వళ్లించే ముఖ్యమంత్రి మరి ఎందుకు రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను విస్మరిస్తున్నాడు? ప్రకృతి సృష్టించిన విలయంతో కట్టుబట్టలతో మిగిలిన, ఆరుగాలం శ్రమనూ కోల్పోయిన అభాగ్యులను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పుడు పట్టించుకోకుంటే ఈ ప్రజలు కిరణ్‌కు శాశ్వతంగా సెలవు ఇవ్వలేరని అనుకుంటున్నాడా? ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ కాబట్టి దీనిని అంత ఎక్కువకాలం గుర్తుపెట్టుకోలేరనే ధీమాతో ఉన్నాడా? ఇవ్వన్నీ కిరణ్ తప్ప ఇంకెవరూ జవాబు చెప్పలేని ప్రశ్నలు. తుపాను సహాయక చర్యలు, బాధితులను ఆదుకునేందుకు సర్కారు చూపిన చొరవపై అన్నిపక్షాలు విమర్శల జడివానలో ప్రభుత్వాన్ని ముంచెత్తుతున్నా కిరణ్ ఎందుకు తన రాజకీయాలు తాను చేసుకుంటున్నాడు.. సర్కారీ లెక్కల ప్రకారమే రాష్ట్రంలోని 521 మండలాలు, 4,200 గ్రామాలు తుపాను దాటికి అతలాకుతలమయ్యాయి. 8 లక్షల హెక్టార్లలో పంటలకు నష్ట వాటిల్లింది. కానీ ఇవ్వన్నీ కాకిలెక్కలే. క్షేత్రస్థాయిలో వాస్తవాలను విస్మరించి ప్రభుత్వ యంత్రాంగం పైపైన రూపొందించిన పంటనష్టం లెక్కలివి. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,727 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. 42 మంది మనుషులు చనిపోగా, 1,700లకు పైగా పశువులు మృత్యువాతపడ్డాయి. తుపాను దాటికి రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది రైతులే. ఇప్పుడే కాదు ఎప్పుడు తుపాను సంభవించిన రైతులే బాధితులు. మిగతా ప్రజలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా రైతులతో పోల్చినప్పుడు వారికి సంభవించిన నష్టం తక్కువనే చెప్పాలి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా సంభవించిన తుపాన్లు 70 శాతానికిపైగా అక్టోబర్, నవంబర్ నెలల్లోనే. యేటా ఈ రెండు నెలల్లోనే తుపాన్లు సంభవిస్తున్నా, అదే సమయంలో రాష్ట్రంలో పంట దిగుబడి వస్తుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గతంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు, ఈ యేడాది పూర్తిగా భిన్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాతనే సీఎం కిరణ్‌కు హఠాత్తుగా ప్రజలు గుర్తుకు వచ్చారు. ప్రజలంటే ఆయన దృష్టిలో సీమాంధ్రులేనని పలు సందర్భాల్లో స్పష్టం చేశాడు. ఇప్పుడు ప్రకృతి బీభత్సం సృష్టించి అన్ని ప్రాంతాల్లో పెను నష్టం సంభవిస్తే సీఎం మళ్లీ తన పక్షపాత వైఖరిని చాటిచెప్పాడు. మొదట ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించిన సీఎం కిరణ్ సోమవారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించి బాధితులను ఆదుకుంటామని సీఎం హామీల వర్షం గుప్పించాడు. పై-లిన్ తుపానుకు ముందు హడావిడి చేసిన అధికారయంత్రాంగం దాని తర్వాతే వచ్చిన మరో తుపానను మాత్రం విస్మరించారు. వరద బాధిత ప్రాంతాల గుర్తింపు, నిర్వాసితుల తరలింపు వంటి సహాయక చర్యలను పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు వరద బాధిత రైతులను పరామర్శించడంలోనూ ముఖ్యమంత్రి తన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ ఆ విషయాన్ని విస్మరించి తాను సీమాంధ్ర ప్రాంతానికే ముఖ్యమంత్రిని అని మరోమారు చాటుకున్నాడు. వరుసగా రెండు మార్లు సీమాంధ్ర ప్రాంతంలోనే ముఖ్యమంత్రి పర్యటించడం, అక్కడి రైతులను ఓదార్చడం సంగతి పక్కనబెడితే రాష్ట్రమంతా వరద తాకిడితో ఇబ్బందులెదుర్కొంటున్న వేళ కిరణ్ ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టవద్దంటూ రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాసి రాజ్యాంగ పరిధిని ప్రశ్నించాడు. తాను నామినేటెడ్ సీఎంను అనే విషయాన్ని కిరణ్ ఎప్పుడో మర్చిపోయాడు. తన స్థాయికి మించిన గొంతెమ్మ కోర్కెలతో కాంగ్రెస్ అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ద్వారా సీమాంధ్ర ప్రాంతంలో హీరో అనిపించుకోవాలని పరితపిస్తున్నాడు. ప్రజలంతా ఆకలితో అలమటిస్తుంటే తాను మాత్రం పెట్టుబడిదారుల పక్షం వహిస్తూ దోపిడీవర్గానికి కొమ్ము కాస్తున్నాడు. ప్రజలను పట్టించుకోకపోతే వాళ్లు సెలవు ఇస్తారు అన్న తన వ్యాఖ్యలను తానే విస్మరించి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. వరద బాధితులను ఆదుకోవడం, పరామర్శించడంలో తన వివక్షను చూపుతున్న కిరణ్, అదేసమయంలో తెలంగాణను అడ్డుకునే రాజకీయ కుట్రలను మాత్రం వీడలేదు. అధికారయంత్రాన్ని పరుగులు పెట్టించి ప్రజలకు సత్వర సేవలందించాల్సిన ముఖ్యమంత్రి తన పనిని విస్మరించి కంటి తుడుపు సమీక్షలతో కాలయాపన చేస్తున్నాడు. సీమాంధ్ర ప్రాంతంలో ఎంతస్థాయిలో నష్టం సంభవించిందో తెలంగాణ జిల్లాల్లోనూ అదేస్థాయిలో పంటనష్టం వాటిల్లింది. కానీ కిరణ్ సీమాంధ్రకు మాత్రమే ఎక్కువ పరిహారం ఇచ్చి తెలంగాణ రైతులకు వివిధ కొర్రీలతో ఎగవేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి దానికి మచ్చతెచ్చేలా నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడు.