ప్రైవేటు బస్సులను రద్దు చేయడమే పరిష్కారం
తెలతెలవారుతుండగానే పెను విషాదం. మరికాసేపట్లో గమ్యం చేరాల్సిన వారు గాఢ నిద్రలోనే కాలి బూడిదైన దైన్యం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి 45 మంది సజీవ దహనం. జాతీయ రహదారి 44పై పూర్తిగా కాలి ఇనుప చువ్వలు తేలిన బస్సు నిండా శవాల గుట్టలు. రోడ్డంతా కమురు వాసన. పండుగ కోసమంటూ కొందరు, వివిధ పనులపై మరికొందరు వోల్వో బస్సులు బయల్దేరారు. మరో గంటన్నరలో గమ్యస్థానం హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉండగా మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సు అధికవేగంతో ఉండటం, డీజిల్ ట్యాంకర్ లీక్ అవడంతో మంటలు ఒక్కసారిగా బస్సంతా వ్యాపించాయి. డ్రైవర్ వెనుక ఉన్న డోర్ లాక్ చేసి ఉండటం, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ కిందకు దూకేయడంతో కనీసం డోర్ తీసేవారు లేక ప్రయాణికులంతా బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చింది. 50 మందితో రాత్రి 10 గంటలకు బెంగళూర్‌లో బయల్దేరిన వోల్వో బస్సు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జాతీయ రహదారిపై అతి వేగంతో దూసుకువచ్చిన బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరగడానికి డ్రైవర్ అజాగ్రత్తే కారణం కాగా మంటలు అంటుకున్న తర్వాత కనీసం డోర్ లాక్ ఓపెన్ చేసినా మరికొంత మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడేవారు. 50 మందిలో ఐదుగురు మాత్రమే కాలినగాయాలతో బస్సు అద్దాలు పగులగొట్టుకొని బయటకు దూకేయగా మిగతా వారిలో ఎక్కువ మంది సీట్లలో కూర్చున్నవారు కూర్చున్నట్టే కాలి ఎముకల గూడులా మిగిలారు. బస్సు అంటుకోగానే పొగ బస్సంతా వ్యాపించడంతో చాలా మంది ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారని, అంతలోనే మంటలు చుట్టుముట్టడంతో అలాగే ప్రాణాలు విడిచారని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఒక్క ప్రమాదంలో ఇంత ఎక్కువ సంఖ్యలో బస్సు ప్రయాణికులు మృత్యువాతపడింది ఇప్పుడే. ప్రమాదం జరిగిన తర్వాత కారణాలు అన్వేషించే పనిలో ఎప్పట్లాగే అధికారయంత్రాంగం నిమగ్నమైంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తామెక్కడ బాధ్యులం కావాల్సి వస్తోందని అధికారయంత్రాంగం సాకులు వెదికే ప్రయత్నాలు చేస్తోంది. బస్సు మొదట దివాకర్ రోడ్ లైన్స్ పేరున రిజిస్టర్ అవగా, రెండేళ్లుగా దాని స్టేటస్ ఇనాక్టివ్‌గా ఉన్నట్లు ఆర్టీఏ వెబ్‌సైట్ చెబుతోంది. అంటే రెండేళ్లుగా ఎలాంటి రిజిస్ట్రేషన్ ఇతరత్రా అనుమతులు, కనీసం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా లేని బస్సు నిత్యం రోడ్డుపై ప్రయాణిస్తున్న రోడ్డు రవాణా సంస్థ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. బస్సును 2010లోనే జబ్బార్ ట్రావెల్స్‌కు విక్రయించినట్లుగా దివాకర్ రోడ్‌లైన్స్ వివరణ ఇస్తూ అమ్మకం పత్రం మీడియాకు విడుదల చేయగా, ప్రమాదానికి గురైన బస్సు నం. ఏపీ 02టీఏ 0963పై అనంతపురం జిల్లాలో రిజిస్ట్రేషన్ అయి ఉండగా అదే నంబర్‌పై అదే ట్రావెల్స్ చెందిన మూడు బస్సులు నడుస్తున్నట్లుగా తేలింది. ఒక్క జబ్బార్ ట్రావెల్స్ మాత్రమే కాదు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ట్రావెల్స్ కూడా ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌పై గల పలు బస్సులను తిప్పుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నాయనేది బహిరంగ రహస్యం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను దెబ్బతీసేందుకు వివిధ పార్టీల్లోని పెద్ద నేతలు అడ్డగోలుగా ట్రావెల్స్ ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ఆర్టీసీ బస్సులకు 70 కిలోమీటర్ల వద్ద ఫ్యూయల్ స్పీడ్ లాక్ చేస్తారు. ఆ వేగంలో బస్సును నియంత్రించడం డ్రైవర్‌కు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులకు వేగ నియంత్రణ లేదు. కొన్ని బస్సులు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. పాలెం వద్ద జరిగిన ప్రమాదానికి గురైన బస్సు ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో ఉందని, అందువల్లే డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడనే వాదన వినవస్తోంది. కాగా బస్సును బెంగళూర్ నుంచి హైదరాబాద్ వరకు ఒకే డ్రైవర్ నడపాల్సి ఉండటం, అతడు మద్యం తాగడం వల్లనే ప్రమాదం జరిగిందనే మరో వాదన వినిపిస్తోంది. ఈమేరకు అతడి నుంచి వైద్యులు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. త్వరలో ఇది నిజమో కాదో తేలిపోతుంది. మెట్రో నగరాలన్నింటికీ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు సర్వీసులు ఎక్కువగా ఉండటం, వాటికి ఎలాంటి వేగ నియంత్రణ లేకపోవడంతో ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఎక్కువ ప్రమాదాలకు గురైనవి ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులే. కేవలం స్పీడ్ లాక్ లేకపోవడం వల్లనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అలాగే ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణ లేమీ, లంచగొండి తనం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ విచ్చలవిడి తనానికి కారణమవుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే స్పందించడం తర్వాత అన్నీ మర్చిపోయి తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టుకోవడం అధికార యంత్రాంగానికి పరిపాటిగా మారింది. పాలెం వద్ద సంభవించిన ప్రమాదం యావత్ దేశాన్ని నివ్వెర పరచడం, విషయం అంతర్జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా ప్రచారంలో ఉండటంతో మన అధికారయంత్రాంగం ఇప్పుడు ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నట్టు నటిస్తోంది. ఆర్టీసీని నిలువునా ముంచుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలపై అధికారులకే కాదు ప్రభుత్వ పెద్దలకు చక్కటి అవగాహనే ఉంది. కానీ వారిచ్చే లంచాలకు మరిగిన ఈ రెండు వ్యవస్థలు ఇతరులెవరైనా వీటి బండరాన్ని బయటపెట్టినా పట్టించుకోవడం లేదు. అడ్డగోలు ధరలతో ప్రయాణికుల జేబులకు చిల్లుపెడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఎలాంటి నియంత్రణ లేకపోవడం దారుణం. అదే సమయంలో ఆర్టీసీ ఆదాయాన్ని కొళ్లగొట్టడం, ఒకే రిజిస్ట్రేషన్‌పై ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతూ ప్రభుత్వ ఖజానాను గుళ్ల చేస్తున్నాయి. ఇందుకు ఆర్టీఏ అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలు, వివిధ శాఖల అధికారులతో ట్రావెల్స్ సంస్థలకున్న మంచిమాట అన్నీ చూసీచూడనట్లు సాగేలా చేస్తోంది. పండుగకు ఇంటికి వస్తున్న ఉద్యోగులు, కడుపులో బిడ్డతో సహా కాలిపోయిన యువతి, వైద్య పరీక్షల కోసం బయల్దేరి పెళ్లి రోజునే నూరేళ్లు నిండిన దంపతులు ఇలా బస్సు ప్రమాదం బలితీసుకున్న ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. ప్రభుత్వం ఎంత పరిహారం ఇచ్చినా, ఆ కుటుంబాలకు జరిగిన నష్టం పూడుతుందా? ఆర్టీసీకి సమాంతరంగా విస్తరించి ప్రైవేట్ ట్రావెల్స్‌ను పూర్తిగా రద్దు చేస్తే తప్ప ప్రయాణికులకు రక్షణ ఉండదు. ఈ ఏడాది ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి ఇది రెండోసారి. గత ఆగస్టు 9న అంబర్‌పేట్ వద్ద ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు ఏసీలో గ్యాస్ లీకవడంతో తగలబడింది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. 2011 ఏప్రిల్ 27న శంషాబాద్ సమీపంలోనూ బస్సు అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా కాలిపోయింది. అప్పుడు బస్సులో ఒక్కడే ప్రయాణికుడు ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. 2009 నవంబర్ 2న చిత్తూరు పాత బస్టాండ్‌లో నిలిపి ఉంచిన బస్సు ఇంజిన్ పేలడంతో మంటలు చెలరేగి 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇలాంటి ఎన్నో ప్రమాదాల బారిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పడ్డ సందర్భాలున్నాయి. ఏమాత్రం రక్షణ లేని ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఇప్పటికైనా రద్దు చేసి ఆర్టీసీకి జవసత్వాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడాలి.