ముఖ్యమంత్రికి జ్ఞానోదయమైంది

ఆంధ్రప్రదేశ్‌కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎట్టకేళకు జ్ఞానోదయమైంది. హైదరాబాద్‌ స్టేట్‌ను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను వంచించిన నవంబర్‌ ఒకటి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలు ఇకపై ఉండవేమో అనే అనుమానం వ్యక్తం చేశాడు. తన చేతులమీదుగా చిట్టచివరి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలు నిర్వహించాననే అర్థం ధ్వనించేలా మాట్లాడాడు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌ వాస్తవాలను తెలుసుకోవడం, అంగీకరించడంతో పాటు అధిష్టానంపై, సోనియాగాంధీపై తన ఆక్రోషాన్ని వెళ్లగక్కాడు. తాను సమైక్యవాదినేనని మళ్లీ చెప్పాడు. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలు ఉంటాయో లేదోనని రాష్ట్ర ప్రజలు అనిశ్చితిలో ఉన్నారంటూ తన సొంత పైత్యాన్ని తెలంగాణ ప్రజలపై రుద్దాడు. తెలంగాణ ప్రజలే కాదు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మెజార్టీ ప్రజలు సీమాంధ్ర భౌగోళిక ప్రాంతం కొత్త రాజధానిగా ఏర్పాటు కావడాన్ని స్వాగతిస్తున్నారు. హైదరాబాద్‌ను, తెలంగాణను కొళ్లగొట్టి వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న పెట్టుబడిదారి శక్తులు మాత్రమే తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఇదివరకు కృత్రిమ ఉద్యమాన్ని నడిపించారు. డబ్బు సంచులతో ప్రభావితమైన ఉద్యమం పాలపొంగు మాదిరిగానే ఎంతవేగంగా ఎగసిందో అంతే వేగంగా చల్లారింది. ఉద్యోగుల సమ్మె సైతం దాదాపు అదే కోణంలో ప్రారంభమై అలాగే ముగిసింది. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ ప్రాబల్యం కోసమే కాంగ్రెస్‌, వైఎస్సార్‌ సీపీ, టీడీపీ సమైక్య రాష్ట్రం పేరుతో స్పాన్సర్డ్‌ ఉద్యమాలు సాగిస్తున్నాయి. ప్రజామోదం లేని ఉద్యమాన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులకు చెందిన మీడియా ఇప్పటికీ ఎక్కువ చేసే చూపుతోంది. రాష్ట్ర ప్రజలు అనిశ్చితిలో ఉన్నారని చెప్పిన కిరణ్‌ అది ఏ రాష్ట్ర ప్రజలో మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విభజన పూర్తికాలేదు కాబట్టి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌ 23 జిల్లాల ప్రజలను రాష్ట్ర ప్రజలుగా భావిస్తున్నారు అనుకోవడానికి వీల్లేదు. ఆయన దృష్టిలో రాష్ట్ర ప్రజలంటే 13 జిల్లాలకు చెందిన సీమాంధ్రులు మాత్రమే. వారి హక్కులు మాత్రమే ముఖ్యమంత్రికి కావాలి. వారు పంటలు నష్టపోతేనే కిరణ్‌ పరామర్శకు వెళ్తాడు. హైదరాబాద్‌ ఆదాయాన్ని, తెలంగాణ ఆదాయాన్ని సీమాంధ్ర అభివృద్ధికి ఖర్చు చేస్తాడు. అదేమిటని అడిగితే ఒక్క రూపాయి ఇవ్వ ఏం చేసుకుంటారో చేసుకోమంటాడు ఈ హైదరాబాదీ. తాను ఇక్కడే పుట్టానని చెప్పుకునే కిరణ్‌ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా హైదరాబాదీల ప్రవర్తించలేదు. హైదరాబాద్‌ ప్రజల భాష ఆయనకు ఒంట బట్టలేదు. హైదరాబాద్‌ సంస్కృతీ ఆయనకు తెలియదు. కిరణ్‌ ఈ మధ్య తనకు తానుగా ఇందిరాగాంధీతో ఆపాదించుకుంటున్నాడు. ఆమె 1972 డిసెంబర్‌ 21న పార్లమెంట్‌లో తాను విశాలాంధ్రను కోరుకుంటున్నానని చెప్పారని, ఆమెలాగే తాను సమైక్యవాదినని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్నా సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నాడు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాజకీయ నాయకుడిగా పరిణతి చెందని కిరణ్‌, సొంతగా తన నియోజకవర్గంలో గెలవడానికే గత ఎన్నికల్లో చెమటోడ్చాల్సి వచ్చింది. ఇకపై ఆ పరిస్థితి లేకుండా సొంత రాజకీయ బలాన్ని సమకూర్చుకునేందుకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కిరణ్‌ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. తెలంగాణ ఏర్పాటును ఆపడం తన తరం కాదని తెలిసినా సీమాంధ్ర ప్రజలను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అంతేకాదు సీఎం ఎప్పటి మాదిరిగా నవంబర్‌ ఒకటి ఉపన్యాసంలోనూ అబద్ధాలనే వల్లెవేశాడు. పొట్టిశ్రీరాములు తెలుగు మాట్లాడేవారికి ఒక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని తన అజ్ఞానాన్ని చాటుకున్నాడు. పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ కోసం ప్రాణత్యాగం చేశాడనే తప్పుడు ప్రచారం సీమాంధ్ర ప్రాంతంలో ఇప్పుడు ప్రబలంగా ఉంది. ఆ మహనీయుడు ప్రాణత్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని విడదీస్తారా అంటూ చరిత్ర తెలియని వారు మాట్లాడుతుంటే నవ్వుకోని వాళ్లుండరు. వాళ్ల మాదిరిగా కిరణ్‌ కూడా పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ అంటూ తన తెలియని తనాన్ని చాటుకున్నాడు. ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడదీయడం కోసమే పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశాడనే నిజాన్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చెప్పలేకపోయాడు. పొట్టి శ్రీరాములుకు సంబంధమే లేని ఆంధ్రప్రదేశ్‌తో ఆయనను ముడిపెట్టడం రాజకీయ వ్యభిచారంతో సమానం. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడే నాటి పరిస్థితులపై కూడా కిరణ్‌కు పూర్తి అవగాహన లేదు. తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలనే విశాల దృక్పథంతో హైదరాబాద్‌ స్టేట్‌ ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు సమ్మతించారు. ఫజల్‌ అలీ కమిషన్‌ ప్రతిపాదనలు కాదని, కనీసం అసెంబ్లీ ఎన్నికల వరకైనా ఎదురుచూడకుండానే ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఆ రోజు చేసుకున్న ఒప్పందాలను సీమాంధ్రులు ఉల్లంఘించడమే కాదు తెలంగాణ ప్రజల హక్కులను కాలరాశారు. చట్టాలను అతిక్రమించి హైదరాబాద్‌, తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన ఆస్తులను కొళ్లగొట్టారు. తెలంగాణ యువతను నిరుద్యోగులుగా మార్చి హైదరాబాద్‌లో కొలువులన్నీ ఎత్తుకెళ్లారు. తెలుగు భాష పేరుతో ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుకు కుట్రపన్ని తెలంగాణ యాసను, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అవహేళన చేశారు. సీమాంధ్రులు ఉల్లంఘనలు నిరసిస్తూ తమ రాష్ట్రం తమకే కావాలని నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ పరమైన ప్రక్రియ ప్రారంభిస్తే సీఎం సమైక్య జపం చేస్తున్నాడు. కానీ తన ప్రయత్నం నెరవేరబోదని ఆలస్యంగా గుర్తించాడు. అదీ ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నవంబర్‌ ఒకటిన.