జీవోఎంకు నివేదించకపోవడం సీమాంధ్రుల హక్కులను కాలరాయడమే

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి విధివిధానాలపై వైఖరి చెప్పాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖలు రాసినా రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు తమేమీ చెప్పబోమంటున్నాయి. నిర్ణయం తీసుకున్నాక ఇంకా తమ అభిప్రాయాలతో పనేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నాయి. తమ పార్టీ విధానం సమైక్యరాష్ట్రం కాబట్టి విభజన విధివిధానాలపై స్పందించబోమని మరో పార్టీ పేర్కొంటోంది. తమ విధానం స్పష్టంగా ఉన్నప్పుడు కేంద్రం హోం శాఖ రాసిన లేఖకు జవాబివ్వాల్సిన అవసరం లేదని ఇంకో పార్టీ చెప్పింది. ఈ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయో, ఎందుకలా మాట్లాడుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. అలాగే ఈ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించకపోయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌ విభజన ఆగుతుందనుకోవడం అవివేవకం, అర్థరహితం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర ప్రాంతానికి చెందిన దాదాపు అన్ని పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. సీపీఎం ఎప్పట్లాగే భాష ప్రయుక్త రాష్ట్రాల పేరుతో పాత పాటే పాడగా, దానికి కొత్తగా వైఎస్సార్‌ సీపీ తోడయింది. తాము జీవోఎంను గుర్తించడం లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఓ లేఖ రాసి చేతులు దులుపుకుంది. కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత తమను అభిప్రాయం అడగడంలో అర్థం లేదు కాబట్టి తాము జీవోఎంను లెక్క చేయాల్సిన అవసరమే లేదని టీడీపీ చెప్తోంది. ఈ మూడు పార్టీల వ్యవహారం చూస్తుంటే తాటాకు చప్పుళ్లతో కేంద్రాన్ని భయపెట్టజూసినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి వైఖరి చెప్తుందో చూసి తర్వాత తాము స్పందించాలని చూసిన టీడీపీ కాంగ్రెస్‌ ఎంతకూ తేల్చకపోవడంతో తాము జీవోఎంను గుర్తించబోవడం లేదని గొప్పలు చెప్పింది. తద్వారా సీమాంధ్ర ప్రాంత ప్రజల హక్కులను హరిస్తున్నామని, వారు గొంతులను నొక్కుతున్నామనే విషయాన్ని విస్మరిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మాత్రమే ఇరు ప్రాంతాల్లోనూ రాజకీయ ప్రాభవం కోరుకుంటోంది. వైఎస్సార్‌ సీపీ తెలంగాణపై యూటర్న్‌ తీసుకొని ఇక్కడ తన దుఖానాన్ని మూసుకుని తెలంగాణ ప్రాంతానికే పరిమితమైంది. ఇక సీపీఎంకు తెలంగాణ ప్రాంతం నుంచే ఏకైక ఎమ్మెల్యే ఉన్నాడు. సీమాంధ్రలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. అయినా భాషా ప్రయుక్త రాష్ట్రాలే తమ విధానమని చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీపీఎం, వైఎస్సార్‌ సీపీ తెలంగాణలో రాజకీయ ప్రాతినిథ్యాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాయి. కానీ టీడీపీ పరిస్థితి అలా లేదు. టీడీపీ రెండు ప్రాంతాల్లోనూ ఉనికిని చాటుకోవాలని తహతహలాడుతోంది. తొమ్మిదేళ్ల క్రితం కోల్పోయిన అధికారాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని ఉవ్విలూరుతోంది. ఈక్రమంలో తప్పుల మీద తప్పులు చేస్తూ తప్పటగుడులు వేస్తూ నవ్వుల పాలవుతోంది. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ, సీపీఎం తీసుకున్నది ముమ్మాటికీ అసంబద్ధ నిర్ణయమే. ఎందుకంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో ముఖ్యమైన అంశాలపై పార్టీల వైఖరి కోరింది. సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని, నదీ జలాల పంపిణీ, ఆర్టికల్‌ 371 (డి), భద్రత, హైదరాబాద్‌పై తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. కానీ టీడీపీ, వైఎస్సార్‌ సీపీ, సీపీఎం మూర్ఖంగా వ్యవహరిస్తూ తాము వైఖరి చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్‌ విభజనే ఆగిపోతోంది అన్నంత అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ పార్టీల్లో సీపీఎం మినహా మిగతా రెండు తెలంగాణ ఏర్పాటుకు తాము అనుకూలమని గతంలో ప్రకటించినవే. కానీ కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియ ప్రారంభించాక పూర్తిగా అడ్డం తిరిగాయి. టీడీపీలోని ఇరు ప్రాంతాలకు చెందిన నాయకులు వేర్వేరు వైఖరులు ప్రదర్శిస్తుండగా అధినేత మాత్రం సీమాంధ్రుల వాదన వైపే మొగ్గు చూపుతున్నాడు. ఆ కారణంగానే జీవోఎంకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి పచ్చజెండా ఊపాడు. హోం శాఖ మంగళవారంలోగా పార్టీల వైఖరి చెప్పాలని కోరింది. ఆ గడువు ముగియడానికి ఒక్కరోజు ముందు టీడీపీ జీవోఎంను గుర్తించడం లేదని పేర్కొంది. తద్వార సీమాంధ్ర ప్రజలను వంచించింది. జీవోఎంకు నివేదించాల్సిన మొదటి అంశం సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనివార్యం అని తేలిన తర్వాత కూడా సీమాంధ్ర ప్రాంతానికి కొత్తగా ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలో చెప్పకపోవడం సరికాదు. కొత్తగా ఏర్పాటవుతున్న సీమాంధ్రలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు ఎక్కువగా వెనుకబడ్డాయని ఆ ప్రాంత నేతలే చెప్తున్నారు. మరి వాటి వెనుకబాటు తనాన్ని దూరం చేసేందుకు పరిష్కారాలేమిటో నివేదించకపోవడం ఆ ప్రాంత ప్రజలను మోసం చేయడం కాదా? ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న ఆర్టికల్‌ 371 (డి) ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే రెండు రాష్ట్రాల్లోనూ ఉండాలా? వద్దా? అనే దానికి సమాధానం ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటీ? జోనల్‌ వ్యవస్థ అమల్లో లేకపోతే విద్యాపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల వారు హైదరాబాద్‌లో మాదిరిగా మిగతా ప్రాంతాల్లోని ఉద్యోగాలను కొళ్లగొట్టినట్లు చేస్తే ఆ ప్రాంత నిరుద్యోగ యువత పరిస్థితి ఏమిటీ? నదీ జలాల వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న సీమాంధ్రులు కనీసం ఆ అంశంపై తమ వైఖరేంటో చెప్పకపోవడంలో ఆంతర్యమేమిటీ? హైదరాబాద్‌ ఇందులో ప్రముఖమైనదని, హైదరాబాద్‌ను ఇరు ప్రాంతాలకు రాజధాని చేయాలని కోరుతున్న సీమాంధ్ర నేతలు అది సాధ్యమయ్యేది కాదని తెలిసినా ఎందుకు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వాళ్లు ఆందోళన చెందుతున్నట్లుగా ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రుల రక్షణ కోసం ఏం కావాలని కోరుకుంటున్నారో అదే జీవోఎంకు నివేదించవచ్చు కదా? అలాగే విద్యుత్‌, ఆస్తులు, అప్పుల పంపిణీపై ఆయా పార్టీల విధానమేమిటో చెప్పకపోవడం సీమాంధ్ర ప్రజలను మోసం చేయడం కాదా? తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌, సీపీఐతో పాటు ఎంఐఎం కూడా మద్దతు తెలిపింది. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదే కాంగ్రెస్‌ పార్టీ, తాము తెలంగాణకు అనుకూలమని ఆ పార్టీ ఎన్నోమార్లు స్పష్టం చేసింది. మిగతా మూడు పార్టీలు తమ వైఖరి చెప్పకపోవడం వల్ల ఎవరికి నష్టం.. సీమాంధ్రలోని సామాన్య ప్రజలకు కాదా? ఈ విషయాలన్నీ తెలిసీ రాజకీయ పార్టీలు విభజన ప్రక్రియ ఇంత ముందుకెళ్లాక కూడా సమైక్య జపం చేయడంలో అర్థముందా? ఇవన్ని సీమాంధ్ర ప్రజలు గుర్తించాలి. తమ హక్కుల కోసం రాజకీయ పార్టీలపై ఉద్యమానికి సిద్ధం కావాలి. తమకేం కావాలో కేంద్రంతో కొట్లాడి సాధించుకోవాలి.