గుట్టు బయటపెట్టిన బాబు
తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిజస్వరూపాన్ని మళ్లీ బయటపెట్టుకున్నాడు. తానెప్పటికీ సమైక్యవాదినేనని నిరూపించుకున్నాడు. రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎప్పుడో ఒకసారి తెలంగాణకు జై కొట్టినంత మాత్రాన నిజంగానే రాష్ట్రం ఇచ్చేస్తారా? అంటూ తొండి ఆట మొదలు పెట్టాడు. ఇంతకాలం తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సమన్యాయం పేరుతో కొత్త నాటకాన్ని రక్తి కట్టిస్తోంది. హాలివుడ్ ఫిక్షన్‌లా ఇష్టం వచ్చినట్లుగా కథ అల్లుకుపోతూ తెలంగాణ ప్రజలను నిండా ముంచ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాన్ని సాకారం చేద్దామనే ఒకప్పటి తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి, ప్రస్తుత తొమ్మిదన్నరేళ్ల ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ విభజన ఆపాలంటూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాయడం. తనను తాను ఎక్కువ చేసి చూపే అలవాటు మిగతా వారికన్నా చంద్రబాబుకు ఎక్కువే. అందుకే తెలంగాణ ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాలని ఆయన ఢిల్లీలో చేయని కుయత్నాలు లేవు. జాతీయ పార్టీల నేతల ఇళ్లకు ఎక్కే గడప దిగే గడప అన్నట్టు తిరిగినా ఫలితం దక్కలేదు. చివరికి ఢిల్లీలో దొంగదీక్ష చేసి జాతీయ మీడియా వేసే ప్రశ్నలకు సమాధానమివ్వలేక తోకముడుచుకొని వచ్చేశాడు. పై పెచ్చు జాతీయ మీడియాపైనే ఆరోపణలు గుప్పించాడు. ఎన్ని పిల్లిమొక్కగ్గలేసినా తెలంగాణ ఆగకపోవడం, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరమైన చర్యలను వేగవంతం చేయడంతో ఎలాగైనా తెలంగాణ ఏర్పడకుండా చూడాలని ప్రయత్నిస్తున్నాడు. ఢిల్లీలో అధికారంలో ఉన్న యూపీఏను కాదని మిగతా ఏ పార్టీలను, కూటములను కోరినా లాభం లేదంటూ ఆంధ్రప్రదేశ్ విభజన ఆపాలంటూ ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశాడు. 2008లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేసింది. అలాగే యూపీఏ-1 ఏర్పాటు చేసిన ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ సమర్పించింది. 2009 డిసెంబర్ ఏడో తేదీన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ తెలంగాణకు సమ్మతి తెలిపింది. అంతకుముందు అసెంబ్లీ నిండు సభలో అధికార కాంగ్రెస్ కనుక తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రైవేట్ తీర్మానాన్ని తీసుకువస్తామని చంద్రబాబు నాయుడే అన్నాడు. ఇన్ని పర్యాయాలు తెలంగాణపై చెప్పిందే చెప్పిన బాబు తీరా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే మాట మార్చేశాడు. విభజనపై రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుంటారా అంటూ కేంద్రంపై నిందవేశాడు. అంతటితో ఆగకుండా పార్టీలకతీతంగా తన సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను స్పీకర్ ముందు క్యూలో నిలబెట్టి రాజీనామాలు చేసేలా వ్యూహం పన్నాడు. సీమాంధ్ర పెట్టుబడిదారులతో కలిసి ఆ ప్రాంతంలో కృత్రిమ ఉద్యమాన్ని నడిపించిందీ ఈయననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్‌డీఏ అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పటికీ తానే తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నానని, ఆ పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానాన్ని ఎలా తుంగలో తొక్కిందో బయటపెట్టాడు. చంద్రబాబు 2009లో తెలంగాణకు అడ్డం తిరిగిన తర్వాత ఎన్నడూ లేనంతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టాలంటే వేలాది మంది పోలీసులు, అంతకురెట్టింపు సంఖ్యలో చంద్రదండు, ముందస్తు అరెస్టులు అవసరమయ్యాయి. మరోవైపు సీమాంధ్రలోనూ రాజకీయ ప్రాభవం మకసబారింది. ఈ నేపథ్యంలో తెలంగాణపై ఓ మాట చెప్తే పోలా అంటూ గతేడాది డిసెంబర్ 28న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్‌పార్టీ మీటింగ్‌లోనూ తెలంగాణకు సానుకూల వైఖరి ప్రకటించాడు. తీరా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాక, అందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాలు మద్దతు తెలిపాక బాబు మళ్లీ అడ్డం తిరిగాడు. తన నాటకాలతో ఇరు ప్రాంతాల్లోనూ పార్టీని సజీవంగా ఉంచుకోవడానికి పెద్ద డ్రామానే ఆడాడు. తమ పార్టీ లేఖ ఇస్తేనే యూపీఏ ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించిందని, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిందని ఇక్కడ చెప్తూ సీమాంధ్రలో మాత్రం విభజనకు తాము వ్యతిరేకమనే అర్థం ధ్వనించేలా మాట్లాడారు. బాబు స్వయంగా తాను గతంలో ఎలా తెలంగాణను అడ్డుకున్నదీ ఏకరువుపెట్టాడు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిందని దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం కావాలని కోరుతున్నాడు. చంద్రబాబు ఇదే డిమాండ్‌తో ఢిల్లీలో దీక్ష చేస్తే తెలంగాణ మొత్తం పది జిల్లాల్లో ఆయనకు మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా నిరసన ప్రదర్శనో, రిలే దీక్షో చేసింది లేదు. మరి తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయాలని చంద్రబాబు కోరుతున్నారో ఎవరికీ అర్థం కాదు. ఆయనను తమకు న్యాయం చేయమంటూ ఏ తెలంగాణ పౌరుడు కోరాడో చెప్పడు. రాష్ట్ర విభజనపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం, 11 అంశాలపై మీ వైఖరేంటో చెప్పాలంటూ రాష్ట్రంలోని గుర్తింపుపొందిన ఎనిమిది పార్టీలను కోరింది. అందుకు సమాధానం ఇవ్వడానికి మంగళవారం గడువుగా పేర్కొంది. అయితే సమన్యాయం పేరుతో దొంగ ఏడుపులు ఏడుస్తున్న బాబు విభజన అనివార్యమని తెలిసినా దానికి సమాధానమివ్వలేదు. తద్వార సీమాంధ్ర ప్రజలను దారుణంగా వంచించాడు. ఈ విషయానికి వస్తే ఆయనొక్కడే కాదు వైఎస్సార్ సీపీ, సీపీఎం కూడా అంతే దుర్మార్గ రాజకీయాలు చేశాయి. ప్రజలకు ఏం కావాలో కూడ చెప్పకుండా సమైక్య రాష్ట్రమే తమ అభిమతమని లేఖలతో సరిపెట్టాయి. తద్వారా రేపు ఏర్పడబోయే సీమాంధ్ర ప్రాంతంలోని వెనుకబడిన ప్రాంతాలు మరింత వెనుకబడిపోయే ప్రమాదముంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేయాలని, అందుకు ఇరు ప్రాంతాల జేఏసీలు, వివిధ సంస్థల బాధ్యులను పిలిచి మాట్లాడాలని, అప్పటి వరకు తెలంగాణ ఏర్పాటును ఆపాలంటూ బాబు ప్రధానికి లేఖ రాశాడు. అసలు సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలేంటో మాత్రం బాబు చెప్పడం లేదు. అవే అభ్యంతరాలపై పార్టీల వైఖరిని జీవోఎం కోరినా దానికీ జవాబు లేదు. కేవలం సీమాంధ్ర పెట్టుబడిదారులకు, దొంగతనంగా ఉద్యోగాలు కొళ్లగొట్టిన వారికి ప్రయోజనాలు చేకూర్చేందుకు, హైదరాబాద్ కోసం సీమాంధ్ర ప్రజల హక్కులను కాలరాస్తున్నాడు. నిత్యం సమన్యాయమని చెప్తూ ఇరు ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు.