సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అమలు చేయాలి
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని అమలు చేసి తీరుతామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మళ్లీ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గబోమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన రాజ్యాంగ పరమైన ప్రక్రియ కొనసాగిస్తోందని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వివరించారు. తెలంగాణవాదులు కూడా అదే కోరుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఆశించిన ప్రతిసారి సీమాంధ్రులు కుట్రల ద్వారా కేంద్రం ప్రయత్నాలకు అడ్డుతగిలిన గత చరిత్ర గుణపాఠాల దృష్ట్యా త్వరగా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు ఎంత పట్టుదలతో ఉన్నా అధిష్టానం పెద్దలు నిర్ణయం మార్చుకునేలా సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు చేస్తున్న కార్పొరేట్ లాబీయింగ్ చివరిక్షణంలో తమ ఆకాంక్షకు ఏమైనా అడ్డంకిగా మారుతుందా? అనే బెరుకు తెలంగాణ ప్రజలను వెంటాడుతోంది. గతంలో అనేకమార్లు మోసపోయిన నేపథ్యంలో ఈసారి తెలంగాణ సాధించుకొని తీరాలనే లక్ష్యంతోనే తెలంగాణవాదులు ఉన్నారు. తెలంగాణ ప్రజలది న్యాయమైన ఆకాంక్ష అని, 57 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా దోపిడీ, పీడనకు గురైన విషయాన్ని గుర్తించిన కేంద్రం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ విభజనకు రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభించింది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల ప్రజలు, గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల నుంచి వివిధ రూపాల్లో అభిప్రాయ సేకరణ జరిపింది. అన్ని వర్గాల నుంచి సేకరించిన సమాచారం , అన్ని రాజకీయ పార్టీల నిర్ణయం మేరకు కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన ముసాయిదాకు న్యాయశాఖ పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ బృందం ఇరు రాష్ట్రాలకు అప్పులు, ఆస్తులు, నీళ్లు, నిధులు ఇతరత్రా అంశాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఈమేరకు కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేస్తుంది. ఈమేరకు కేంద్రం తన పాత్ర నిర్వహిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ విభజనపై మరింత స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. దిగ్విజయ్ చెప్పినట్టుగా సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేయాలి. అందుకు ముందుగా తెలంగాణకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయాలి. పీసీసీ అధ్యక్షుడితో పాటు పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి. రాబోయే ఎన్నికలకు కొత్త పీసీసీనే సమాయత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలి. అలాగే తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను ఈ ప్రాంత పీసీసీ పూర్తిస్థాయిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి. తెలంగాణ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసి పనులు చేయించాలి. రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లు మరో నెల రోజుల్లోనే పార్లమెంట్ ముందుసు వస్తుందని దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతంపై మాత్రమే చర్చించామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో ఆ పార్టీ బలోపేతానికి వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రజలకేమీ ఇబ్బంది లేదు. కానీ ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ పరంగా తీసుకునే చర్యలు వెంటనే ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటు చేయబోతున్నట్లు మీడియాకు లీకులు అందజేసింది. అయితే విభజన నేపథ్యంలో అభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేసిన కొన్ని కమిటీల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. హైదరాబాద్‌ను తెలంగాణకు దక్కకుండా చేసే ప్రయత్నాలపై ఇక్కడి ప్రజలు మొదటినుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కమిటీలు కూడా దాన్ని ప్రభావం చేసే రీతిలో ఉంటున్నాయి. వాటిని తెలంగాణ ప్రజలు తప్పుబడుతున్నారు. ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని కోరుతున్నారు.