విజయోత్సవ సభలు కాదు ఆంక్షలు లేని హైదరాబాద్‌ కోసం ప్రయత్నించండి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఘనత కాంగ్రెస్‌ పార్టీదే తప్ప మరే ఇతర పార్టీది కాదు.’ అని ఇటీవల ‘జయభేరీ’ పేరుతో టీ కాంగ్రెస్‌ నేతలు నిర్వహిస్తున్న విజయోత్సవ సభల్లో ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు. తమ ఉద్యమాలతోనే కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని చెప్పే ఉద్యమ పార్టీకి, సంస్థలకు కాకుండా తెలంగాణ ఏర్పాటు చేసే క్రెడిట్‌ తమకే దక్కాలనే తాపత్రయం టీ కాంగ్రెస్‌ నేతల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నాలుగు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఉద్యమం ఫలించబోయే వేళ సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులు ఢిల్లీలో అనేక కుట్ర రాజకీయాలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. సీడబ్ల్యూసీ నిర్ణయానికి యునైటెడ్‌ ప్రొగ్రెస్సివ్‌ అలయెన్స్‌ (యూపీఏ) భాగస్వామ్యపక్షాలు ఆమోదముద్ర వేశాయి. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. హోం మంత్రిత్వశాఖ సిద్ధం చేసిన ముసాయిదాకు మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ఒకవైపు రాజ్యాంగపరమైన ప్రక్రియ కొనసాగుతుండగానే సీమాంధ్ర ప్రాంత నేతలు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌పై తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి శక్తిమేరకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన కాంగ్రెస్‌ పాపమేనని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా అదే పల్లవి అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ్యాంగ పరిధిని దాటి తానూ ఒక ప్రాంతానికే పరిమితమన్నట్టుగా వ్యవహరించాడు. విభజన పాపం సోనియాగాంధీదేనని పరోక్షంగా ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల అభ్యంతరాల స్వీకరణతో పాటు విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇరు ప్రాంతాల వాదనలు విన్న ఆంటోనీ కమిటీ తన నివేదిక మాత్రం సీమాంధ్రులకు అనుకూలంగా రూపొందించింది. హైదరాబాద్‌పై ఆంక్షలు, కొర్రీలు పెడుతూ సత్యదూరమైన విషయాలను తన నివేదికలో ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు పూర్వం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్‌, అంతకుపూర్వం స్వతంత్ర దేశంగా ఉండేది. ఇండియన్‌ యూనియన్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీనమైనప్పుడు ప్రత్యేక అధికారాలు, సదుపాయాలు కల్పించారు. హైదరాబాద్‌ను పరిపాలించిన కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు ఇక్కడి ప్రజల సౌకర్యార్థం ఎంతో విలువైన భూములను కేటాయిస్తే వాటిని ఉమ్మడి రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా పందేరానికి పెట్టాయి సీమాంధ్ర ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సందర్భంగా చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం యథేచ్ఛగా ఉల్లంఘనలకు గురైన తర్వాతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. తెలుగుపేరుతో ఏర్పాటు చేసిన రాష్ట్రంలో తెలంగాణ యాస, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అడుగడుగునా అవమానాలు, అవహేళనలకు గురయ్యాయి. తెలంగాణ భూములు, వనరులు, నీళ్లు, నిధులు సీమాంధ్రుల వశమయ్యాయి. తెలంగాణ ప్రాంత యువతకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలను కూడా దొడ్డిదారిని కొళ్లగొట్టారు. అలా కూడబెట్టుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి ఇప్పుడు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగానో, స్వయం ప్రతిపత్తిగల రాష్ట్రంగానో మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకాలం తెలుగుతల్లిని విభజిస్తారా? తెలుగువారిని విడదీస్తారా అంటూ సెంటిమెంట్‌ డైలాగులు కొట్టిన సీమాంధ్ర నేతలు, పెట్టుబడిదారులు తెలంగాణ ఏర్పాటు ఖాయమని తేలిన తర్వాత హైదరాబాద్‌నైనా తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారు. ఆ కుట్రల మేరకే ఆంటోనీ కమిటీ, టాస్స్‌ఫోర్స్‌ నివేదికలు. సీమాంధ్ర ప్రాంత నేతల లాబీయింగ్‌ ఎంతటి బలమైనదో ఈరెండు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌ పరిధిలోని భూములు, ఆదాయం, పాలనా వ్యవహారాలు కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కాకుండా గవర్నర్‌ నేతృత్వంలో కమిటీకి కట్టబెట్టేందుకు సీమాంధ్రులు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. వారికి కేంద్రంలోని ప్రముఖులను ప్రభావితం చేసే శక్తిసామర్థ్యాలున్నాయి కూడా. హైదరాబాద్‌పై ఇన్ని కుట్రలు సాగుతున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ‘జయభేరీ’ పేరుతో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుండగానే జయభేరీ సభలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటో వారికే తెలియాలి. కేవలం తామే తెలంగాణ తెచ్చామనే విషయం ప్రజలకు చెప్పుకోవాలనే ఉభలాటం తప్ప మరొకటి ఇందులో లేదు. తెలంగాణ తెచ్చాం కాబట్టి మళ్లీ ఎన్నికల్లో మమ్మల్నే గెలిపించడంటూ ప్రజలను దేబిరించడానికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సభల పేరుతో ఆర్భాటాలు చేస్తున్నారు. హైదరాబాద్‌పై కొర్రీలు పెట్టేందుకు సీమాంధ్రులు చేస్తున్న ప్రయత్నాలకు ఢిల్లీలో కాస్త ఆసరా దొరికినట్టయింది. వారు సోనియాగాంధీని ప్రభావితం చేయగలరా? పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు నుంచి నిర్ణయం వెనక్కు తీసుకునేలా చేయగలరా అనే వాదన కన్నా తెలంగాణపై మంత్రుల బృందం సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తున్న సమయంలో హైదరాబాద్‌పై తాడోపేడో తేల్చుకోవాలి. హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టి తెలంగాణ ఇవ్వడమంటే అది కాంగ్రెస్‌ పార్టీకే ఆత్మహత్యాసదృశ్యం. అలాంటి ప్రయత్నమే చేస్తే ఆ పార్టీ కోలుకోలేనంతగా నష్టపోవడం ఖాయం. అప్పుడు వీళ్లు సభలు పెట్టి ఊదరగొడుతున్న జయభేరీలు ఎందుకు కొరగావు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ గౌరవిస్తారు కానీ అది ఆంక్షలు లేని ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు మాత్రమే. హైదరాబాద్‌నే కాదు భద్రాచలం రెవెన్యూ డివిజన్‌నూ సీమాంధ్రలో కలిపి వందలాది గిరిజన గూడాల్ని ముంచి పోలవరం కట్టాలని చూసే ప్రయత్నాలను కూడా తెలంగాణ ప్రజలు క్షమించబోరు. ఇప్పటికైనా టీ కాంగ్రెస్‌ నేతలు వాస్తవాలు గుర్తెరిగి ఆంక్షలు లేని తెలంగాణ సాధనకు కృషి చేయాలి. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు ఏ సభలైనా పెట్టుకోవచ్చు.