పాఠాలు నేర్వని పాలకులు
ప్రకృతి బీభత్సాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్న అలసత్వం ప్రజలకు పెనునష్టాన్ని మిగులుస్తున్నాయి. కొందరు సర్వస్వం కోల్పోయి రోడ్డుపై పడితే, మరికొందరు విలువైన ప్రాణాలను, ఇంకొందరు కుటుంబ సభ్యులు, సన్నిహితులను కోల్పోవాల్సి వస్తోంది. యేటా పంటలు చేతికి వచ్చే అక్టోబర్, నవంబర్ మాసాల్లో వరుస తుపాన్లు సంభవిస్తున్నా ప్రభుత్వం వాటివల్ల కలిగే నష్టనివారణకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టడం లేదు. తుపాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేస్తున్నా పూర్తిస్థాయిలో బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నాయి మన ప్రభుత్వాలు. తుపాన్లు సంభవించి కుంభవృష్టి కురిసిన తర్వాతి సంగతి అటుంచితే అసలు తుపాన్ల వల్ల భారీ నష్టం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలను మన ప్రభుత్వాలు ఇంతవరకూ పట్టించుకున్నది లేదు. తుపాన్లు వచ్చినప్పుడు ఏదో హడావిడి చేయడం ఆ తర్వాత బిచ్చం వేసినట్లు కొంత పరిహారం వెదజల్లి చేతులు దులుపుకోవడం మన పాలకులకు పరిపాటిగా మారింది. ఈ యేడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పుష్పలంగా వర్షాలు కురిసాయి. కరువు ప్రాంతాల్లోనూ చెరువులు, కుంటలు నిండి పంటలు బాగా ఉన్నాయి. వాటిని కోత కోసి మార్కెట్‌లో అమ్ముకునే అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుస తుపాన్లతో ఆకాశానికి చిల్లుపడినట్లుగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో నోటికాడి బుక్క నీటిపాలైంది. వరి, మొక్కజొన్న తదితర చేలు నేలవాలి రైతులు భారీగా నష్టపోగా, చేతికి వచ్చిన పత్తి పూర్తిగా తడిసి మట్టికొట్టుకుపోయింది. ముందే పంటలు చేతికొచ్చిన రైతులు మార్కెట్లలో ధాన్యం, ఇతర ఉత్పత్తులు పోసినా సమయానికి అమ్మకాలు జరుగకా పూర్తిగా తడిసి పెట్టుబడికూడా రానంతగా నష్టపోయారు. మొదట పై-లిన్ తుపాను, ఆ తర్వాత మరో తుపాను, దానికి ఈశాన్య రుతుపవనాలు తోడవడంతో రాష్ట్రంతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. వందలాది మంది మృత్యువాతపడ్డారు. భారీ సంఖ్యలో పశువులు చనిపోయాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు చేతికిరాకుండా పోయాయి. వందల కిలోమీటర్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లోనే తుపాను బీభత్సం లక్షలాది కోట్ల నష్టాన్ని సృష్టించింది. ఇది ఈ ఒక్కసారే అనుకుంటే పొరపాటే. గత కొన్నేళ్లుగా వరుసగా ఇవే రెండు నెలల్లో తుపాన్లు సంభవిస్తున్నాయి. గత వందేళ్లలో రాష్ట్రంలో 75 తుపాన్లు సంభవించగా వాటిలో అత్యధికంగా అక్టోబర్ నెలలోనే 30 తుపాన్లు ఏర్పడ్డాయి. నవంబర్ నెలలో 19 తుపాన్లు, సెప్టెంబర్‌లో ఎనిమిది, జూన్, డిసెంబర్ మాసాల్లో మూడు చొప్పున తుపాన్లు సంభవించినట్టుగా వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. మిగతా నెలల్లో సంభవించే తుపాన్లతో పోలిస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్లు భారీ నష్టాలకు కారణమవుతున్నాయి. వరుసగా పెనునష్టం సంభవిస్తున్నా మన పాలకులకు మాత్రం మేల్కొనడం లేదు. 2011లో సంభవించిన సునామీ జపాన్‌ను అతలాకుతలం చేసింది. ఇక జపాన్ కోలుకోవడమే కష్టమని పలువురు అంచానాకు వచ్చారు. మరికొందరు దానిని నిర్దారించారు కూడా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జపాన్ కేవలం 11 నెలల కాలంలోనే పూర్తిగా కోలుకుంది. ఎంతటి ప్రళయం వచ్చినా దానిని తట్టుకోగల శక్తిని కూడగట్టుకుంది. ఒక పెనునష్టం నుంచి జపాన్ ప్రభుత్వం నేర్చుకున్నంత వేగంగా మన పాలకులు గుణపాఠం నేర్వడం లేదు. సునామీ జపాన్‌కు రూ.14.70 లక్షల కోట్ల ఆస్తినష్టాన్ని కలిగించింది. సుమారు 16 వేల మంది సునామీ దాటికి ప్రాణాలు కోల్పోయారు. 2.50 లక్షల టన్నుల విపత్తు వ్యర్థాలు దేశప్రజలను చాలాకాలం ఇబ్బంది పెట్టాయి. 4 వేల రోడ్లు, 78 వంతెనలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంతటి నష్టం చవిచూసిన జపాన్ త్వరగానే కోలుకుంది. వేగంగా పునర్నిర్మాణ చర్యలు చేపట్టింది. అంతటితో ఆగకుండా ఎంతటి ప్రళయం సంభవించినా తట్టుకునేలా సముద్రానికి అడ్డంగా భారీ కరకట్ట నిర్మించింది. తుపాను తీవ్రత కరకట్టను దాటుకునే జపాన్‌లోకి ప్రవేశిస్తుంది. అంటే తుపాన్ల బారినుంచి కట్ట ఆ దేశాన్ని రక్షిస్తోంది. మన దేశంలోని సముద్రతీర ప్రాంతాల్లో కరకట్టలు నిర్మించాలని నిపుణులు పలుమార్లు సూచించారు. ఆ సూచనలను ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. ద్వీపకల్పమైన మన దేశానికి మూడు వైపులా అరేబియా సముద్రం, బంగాళాఖాతం ఉన్నాయి. వాటిలో తరచూ తుపాన్లు సంభవిస్తుంటాయి. 32,87,263 చ.కి.మీ వైశాల్యం గల భారతదేశంలో 7,516.6 కి.మీ.ల సముద్రతీర ప్రాంతం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 982 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం ఉంది. ఇంతటి సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం ఉన్న మన దేశానికి తీరప్రాంతాల వల్ల భారీగా ఆదాయం కూడా సమకూరుతోంది. అలాగే తరచూ సంభవించే తుపాన్లు భారీ నష్టాలు మిగులుస్తున్నాయి. ప్రభుత్వం కనుక మేల్కొని జపాన్ మాదిరిగా పటిష్టమైన కరకట్టల నిర్మాణానికి పూనుకుంటే భారీ ఆస్తినష్టం, జననష్టం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అక్టోబర్‌లో వరుసగా సంభవించిన తుపాన్లు రైతులను పూర్తిగా ముంచేశాయి. ఇప్పుడు కూడా పంటచేలు కోతల దశలో ఉన్నాయి. కనీసం ఇవైనా చేతికి దక్కుతాయనుకుంటే మరో తుపాను గండం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపానే కనుక తీవ్ర ప్రభావం చూపితే దేశం మరిన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి తుపాన్ల వల్ల కలిగే నష్టనివారణకు చర్యలు చేపట్టాలి. అలాగే బాధితులను ఆదుకోవడంలో, వారికి పరిహారం అందించడంలో పిసినారి తనాన్ని ప్రదర్శించకుండా వాస్తవ నష్టాన్ని గుర్తించి ఆదుకునే చర్యలు చేపట్టాలి.