సర్కారు చూపంతా సీమాంధ్రపైనే…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం మొదలైందే వివక్ష, అణచివేత, దోపిడీ, పీడనల నుంచి విముక్తం కోసం. స్వపరిపాలన, ఆత్మగౌరవం కోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో తాము మనలేమని తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తుంటే కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. ఇలాంటి సందర్భంలోనూ సీమాంధ్ర సర్కారు తెలంగాణపై తన వివక్షను చూపింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో కీలకమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ నివేదికగా ప్రధాన కార్యరర్శి ప్రసన్నకుమార్‌ మహంతి కొన్ని రోజుల క్రితం ఓ నివేదికను కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించారు. కేవలం ముఖ్యమంత్రి ఆదేశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని 13 జిల్లాలకు ఎలా న్యాయం చేయాలో సీఎస్‌ జీవోఎంకు నివేదించారు. ఆ నివేదిక పూర్తిగా సీమాంధ్ర ప్రాంతానికి ఉద్దేశించిందే తప్ప మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది కాదు. సీమాంధ్రులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నప్పుడు పేలిన అవాకులు చెవాకులు అన్నీ ఇన్నీ కావు. విడిపోతే తెలంగాణాకే నష్టమని.. ఇంకేదేదో మాట్లాడారు. తీరా విభజన వేళ తెలంగాణ ఇస్తే తమ బతుకులు ఎట్లా అంటూ సీమాంధ్ర పెట్టుబడిదారులు, నేతలు గగ్గోలు పెడుతున్నారు. తమ గోషను సీమాంధ్ర ప్రజల గోసగా వినిపించజూస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను పూర్తిగా ముంచేసి, పోలవరం కట్టుకుని మూడో పంటకు నీళ్లు ఎత్తుకెళ్లాలని ఉవ్విల్లూరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి కుట్రలతో తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ చేసిన సీమాంధ్రులు విభజన వేళ కూడా తమ దోపిడీ యథేచ్ఛగా సాగేందుకు కుట్రలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలపై అబద్ధాలు చెప్తూ సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టించాడు. తన వక్రదృష్టితోనే జీవోఎంకు సీఎస్‌తో నివేదిక ఇప్పించారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేయాలనే గొంతెమ్మ కోర్కెను సీఎస్‌తో పలికించాడు కిరణ్‌. అంతేకాకుండా ఇక్కడ ఉండే సీమాంధ్రుల రక్షణ కోసం హెచ్‌ఎండీఏ పరిధిలో శాంతిభద్రతల బాధ్యతను కేంద్రం చేతిలో ఉంచాలంటూ ఓ ఉచిత సలహా కూడా పడేశారు. డీఎస్సీ, ఇతర జోనల్‌ పోస్టుల్లో సీమాంధ్రులు కనుక ఉద్యోగాలు చేస్తూ ఉంటే వారికి ఉద్యోగ రక్షణ కల్పించాలని, ఖాళీలు లేకుంటే సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించైనా వారికి పోస్టింగులు ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగుల పొట్టకొట్టే ప్రతిపాదనా చేశారు. భద్రాచలాన్ని పూర్తిగా ముంచేసేందుకు సీమాంధ్రలో కలపాలని, నల్గొండ జిల్లాలోని మునగాల మండలాన్ని కృష్ణా జిల్లాలో విలీనం చేయాలంటూ సూచించారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఆస్తులు-ఆదాయం పంపిణీకి జనాభా ప్రాతిపదికగా చేసుకోవాలంటూ కొత్తగా 52, 42 శాతం కేటాయింపుల ప్రతిపాదన చేశాడు. ఈ ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉన్న తెలంగాణ వాళ్లకు న్యాయంగా దక్కాల్సిన 42 శాతాన్ని ఇష్టారాజ్యంగా కొళ్లగొట్టారు కాబట్టి దానిని కొత్త ప్రతిపాదనగానే చూడాల్సి వస్తోంది. ఆర్టీసీ, ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణిలో తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాలని తేల్చేశారు. అసలు సీమాంధ్ర ప్రాంతంలో ఒక్క బొగ్గు గని కూడా లేనప్పుడు సింహభాగం సీమాంధ్రకు ఎలా కేటాయించాలో అసలు ఇది ఎలాంటి ప్రతిపాదనో కూడా ఆలోచించకుండానే చేసేశారు. ఆర్టీసీ, ఇతర ప్రాంతీయ కార్యాలయాల ఆస్తులు హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో కుదువ పెట్టినందున జనాభా నిష్పత్తి ఆస్తులు పంపిణీ చేయాలని నివేదించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు. ఇలా సీమాంధ్రుల పక్షపాతంగా ఇన్ని ప్రతిపాదనలు చేసిన సీఎస్‌ ఒక్క తెలంగాణ విషయంలో జలయజ్ఞానికి మాత్రం కేటాయింపులు చేయాలని కోరడం విచిత్రం. అదీ తెలంగాణపై పాలకులకున్న ప్రేమ.