రెవెన్యూ జిల్లానే ఉమ్మడి రాజధాని చేయాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు యూపీఏ ప్రభుత్వం సిద్ధం చేసిన తెలంగాణ నోట్‌లోనూ పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. సీమాంధ్ర భూభాగంతో ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధానిని నిర్మించడానికి పదేళ్లు చాలా ఎక్కువ సమయం. అయినా కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని సూచించింది. ఆ మేరకే యూపీఏ ప్రభుత్వం ముసాయిదా సిద్ధం చేసి తెలంగాణ ఏర్పాటుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని పరిధిపై రకరకాల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి అందాయి. జీవోఎం తెలంగాణ ప్రక్రియను బుల్లెట్‌ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్తున్నా హైదరాబాద్‌పై కొర్రీల విషయంలోనే తెలంగాణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటే అనేక కుట్రలతో జరిగిందనే విషయం రూడీ కావడం, ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిలువుదోపిడీకి గురవడం, సీమాంధ్రులు బతకడానికి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ బతికే వారి పొట్టకొట్టడం.. తర్వాతి కాలంలో వారే నయా పారిశ్రామిక వేత్తల అవతారం ఎత్తడం వెనుక ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు కుట్ర దాగి ఉంది. పీడిత ప్రజల పక్షాన ఉద్యమాలు సాగించే సీపీఎం పార్టీలాంటివి కూడా భాష ప్రయుక్త రాష్ట్రాలనే పిడివాదనతో తెలంగాణ దోపిడీని సమర్థిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న విషయాన్ని విస్మరించి తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని కోరుతున్నాయి. ఆ వాదనను పక్కనబెడితే హైదరాబాద్‌ పరిధిపై జరుగుతున్న ప్రచారం తెలంగాణ ప్రజలకు అత్యంత తీవ్రమైంది కూడా. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిని ఉమ్మడి రాజధాని చేయాలని కొందరంటే, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ విస్తరించి ఉన్న మొత్తం పరిధిని ఉమ్మడి రాజధాని చేయాలని మరికొందరు కోరుతున్నారు. ఉమ్మడి రాజధానిలో భద్రత, లా అండ్‌ ఆర్డర్‌, రెవెన్యూ సంబంధమైన వ్యవహారాలు, విద్య కేంద్రం చేతిలో ఉంచాలని కోరుతున్నారు. తద్వారా జవసత్వాలు లేని తెలంగాణ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడి ప్రజలపై ఎక్కడా లేని జాలి దయ చూపిస్తున్నారు. హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లా పరిధిలో నగరానికి తూర్పున.. సైదాబాద్‌, అంబర్‌పేట, మారేడ్‌పల్లి మండలాలు, ఉత్తరాన.. తిరుమలగిరి, అమీర్‌పేట మండలాలు, దక్షిణాన.. బండ్లగూడ, బహదూర్‌పురా, పశ్చిమం వైపు షేక్‌పేట, గోల్కొండ మండలాలు ఉన్నాయి. ఈ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా చేసేందుకు తెలంగాణ ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ వాళ్లు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధి మొత్తాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి 627 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా, హెచ్‌ఎండీఏ పరిధి 7,228 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. హైదరాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ, హైదరాబాద్‌ విమానాశ్రయాభివృద్ధి, సైబరాబాద్‌ అభివృద్ధి సంస్థ, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు.. తదితరాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. జీహెచ్‌ఎంసీ 625.52 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా, 150 డివిజన్లున్నాయి. 74 లక్షల మంది జనాభా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఎల్బీనగర్‌, ఉప్పల్‌, పటాన్‌చెరు, బోయినపల్లి, కుత్బుల్లాపూర్‌, గోల్కొండ పరిధులు హద్దులుగా ఉన్నాయి. పాత హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 100 డివిజన్లు ఉండేవి. 12 మునిసిపాలిటీల విలీనం తర్వాత వాటి సంఖ్య 150కి పెరిగింది. పాత హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో 13 నియోజకవర్గాలు ఉండేవి. ఆ తర్వాత వాటి సంఖ్య 15కు చేరుకుంది. రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని మరికొన్ని మునిసిపాలిటీలు విలీనం కావడంతో మరో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కలిశాయి. జిహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 24. ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, మెదక్‌, చేవెళ్ల పార్లమెంటు స్థానాలు హెచ్‌ఎండిఎ పరిధిలో ఉన్నాయి. అయితే చేవెళ్ల, మెదక్‌ పార్లమెంటు స్థానాలు పాక్షికంగా ఉన్నాయి. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానాలు పూర్తిగా హెచ్‌ఎండిఎ పరిధిలో ఉన్నాయి. హెచ్‌ఎండీఏ ఐదు జిల్లాల్లోని 35 మండలాల పరిధిలో విస్తరించి ఉంది. హెచ్‌ఎండీఏ జనాభా 92 లక్షలు. హైదరాబాద్‌లోని 16 మండలాలు, రంగారెడ్డి లోని 22 మండలాలు, నల్గొండలోని 5 మండలాలు, మహబూబ్‌నగర్‌లోని 2 మండలాలు, మెదక్‌లోని 10 మండలాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని యాచారం, శంకర్‌పల్లి, ఉప్పల్‌, కందుకూరు, ఘటకేసర్‌ మండలాలు హద్దుగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలోని పోచంపల్లి, భువనగిరి సరిహద్దుగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఫారూఖ్‌నగర్‌ వరకు సరిహద్దు. మెదక్‌ జిల్లాలోని హత్నూరు, తూప్రాన్‌ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఐదు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏను ఉమ్మడి రాజధానిగా చేసి ఆయా ప్రాంతాలపై కేంద్రం ఆజమాయిషీ ఉంటే ఆయా జిల్లాలు ఉనికిని కోల్పోవడం ఖాయం. మొత్తంగా తెలంగాణ ఉనికికే ముప్పు వాటిల్లే అవకాశముంది. అనేకమైన చిక్కుముళ్లతో ముడిపడిన ఉమ్మడి రాజధానిగా కేంద్రం హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లా వరకే పరిమితమైతే మంచిది. లేకుంటే కొత్త సమస్యలు తలెత్తడం ఖాయం. అప్పుడు తెలంగాణ ఇచ్చి కూడా ప్రయోజనం ఉండదు.