సర్కారు సొమ్ముతో సమైక్య ప్రచారం

కిరణ్‌కుమార్‌రెడ్డి.. తాను ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని అపవిత్రం చేస్తూ సొంత ఎజెండాను మోస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. ప్రజలు.. ప్రజానిర్ణయం.. ప్రజామోదం పేరుతో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతానికి కొమ్ముకాస్తున్నాడు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే సమైక్య రాష్ట్రమే కొనసాగాలని కోరుతానని బహిరంగ సభల్లో సర్కారు సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నాడు. రచ్చబండలో ప్రజాసమస్యలనే ప్రస్తావించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సొంత ప్రచారం చేసుకుంటూ సీమాంధ్ర ప్రాంతంలో సొంత మైలేజీ కోసం పాకులాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌ను విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చే ముందే ఇంటికి పంపుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లడం, సిఎం ఢిల్లీకి వెళ్లక పోవడం రాజకీయ దుమారం చెలరేగేలా చేసింది. ఈ దుమారంతో మంత్రి కన్నా కూడా స్పదించారు. తాను సిఎం రేసులో కాదుగదా ఏ రేసులోనూ లేనన్నారు. సోనియా తనను పిలవలేదని వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి మార్పు అంత సులభంకాదని మంత్రి టీజీ వెంకటేశ్‌ అన్నారు. స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే తప్ప… సీఎం మార్పు ఉంటుందని అనుకోనని ఆయన తెలిపారు. ఇప్పటికే తప్పు చేశామని భావిస్తున్న కేంద్రం.. సీఎంను మార్చి మరో తప్పు చేస్తుందనుకోనని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, శైలజానాథ్‌లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. విభజనకు సంబంధించి కేంద్రం వేగంగా అడుగులు వేయడంతోపాటు,సిఎం ఢిల్లీ పర్యటన వాయిదా పడడంతో రకరకాల ఊహాగాలనాలు చెలరేగాయి. కన్నా లక్ష్మీనారాయణను సిఎంగా చేస్తారన్న ప్రచారంతో దుమారం చెలరేగింది. తెలంగాణ బిల్లు నెలాఖరుకు వస్తుందన్న సంకేతాలను కేంద్రమే ఇచ్చింది. మరోమారు జీవోఎం ముందు సిఎం తన వైఖరిని చెప్పబోతున్నారు. విపక్షాలతో జివోఎం చర్చలు ముగిశాయి. పార్లమెంట్‌ సమావేవాలకు ముందే అసెంబ్లీలో తతంగం పూర్తి చేయాలన్న తొందరను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రదర్శిస్తోంది. మొత్తంగా వేగమైతే కనిపిస్తోంది. బిల్లు రావడమంటూ జరిగితే ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. విభజనపై జీవోఎం సిఫార్సు ఏమిటి? కేంద్రం ఏ నిర్ణయం తీసుకోనుందనే విషయం ముసాయిదా బిల్లులో ప్రస్తావిస్తారా….? హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఆస్తులు, వ్యాపారాలకు చట్టబద్ధ రక్షణ అంశం వెల్లడయ్యే అవకాశముందా..?. 1956కు ముందు మాదిరిగా భద్రాచలం, మునగాల ఆంధప్రదేశ్‌లో ఉండాలన్నది సీమాంధ్ర నేతల డిమాండ్‌ కాగా… పరిపాలన పరంగా అంతర్భాగమైన ఈ ప్రాంతాలు తెలంగాణలోనే ఉండాలని ఈ ప్రాంత నేతలు డిమాండ్‌ చేస్తూ వస్తున్న నేపథ్యంలో దానిపైన ముసాయిదా బిల్లులో స్పష్టత ఉంటుందా…? తెలంగాణేతర ఆంధప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణం, ఆ రాష్టాన్రికి కేంద్ర ప్రభుత్వ పరంగా అందే చేయూత వంటి విషయాల్లో ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం జీవోఎం కీలక భేటీలో కిరణ్‌ అనుసరించే వైఖరే ఆయన భవిష్యత్తును నిర్దారిస్తుందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసనసభకు వచ్చే ముసాయిదా బిల్లులో రాష్ట్ర విభజనకు సంబంధించిన దాదాపు అన్ని అంశాలపైన కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఇందుకు సిద్ధం కావాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం పార్టీ నాయకులకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఈనెల 25, 26 తేదీల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కావొచ్చని అనుకుంటున్నా తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఏదైనా కారణాల వల్ల జాప్యం అయితే డిసెంబరు నెల ప్రారంభంలో సమావేశాలు ఉండొచ్చని అనుకుంటున్నారు. బిల్లును శాసనసభలో వ్యతిరేకించిన తరువాత అందరం రాజీనామా చేద్దామని మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, తదితరులకు ముఖ్యమంత్రి గతంలో సూచించారు. అందుకే అప్పట్లో వారి రాజీనామాలను ఆమోదించలేదు. ముసాయిదా బిల్లును వ్యతిరేకించడం సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకం అయినప్పటికీ ఎవరి ప్రాంత అభిప్రాయాలు వారు చెప్పుకోవచ్చని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. విభజనకు సంబంధించి 11 అంశాలపై స్పష్టత ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు జరిగిన వ్యవహారం చూస్తుంటే ప్రకటనలే తప్ప దేనిపైనా స్పష్టత రావడం లేదని నేతలు చెబుతున్నారు. జీవోఎం సమావేశాలు కూడా మొక్కుబడి వ్యవహారంగానే సాగింది. ఎన్నో అనుమానాలు ఉన్నా అన్నిటికీ మౌనమే సమాధానం అవుతోంది. ఇంతకు ఎలా వీటిని పరిష్కరిస్తారన్నది వేచి చూడాలి. సోమవారం ఆంధ్రప్రదేశ్‌ విభజన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. సర్కారు సొమ్మును సొంత ప్రచారానికి వాడుకోవడంపై అధిష్టానం సైతం ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.