రెండు రాష్ట్రాల్లో స్వేచ్ఛాయుత పాలనుండాలి

ఆంధ్రప్రదేశ్‌ విభజన.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియలో ఒక అంకం ముగిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే కీలకాంశాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ వర్గాల అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలోని ఎనిమిది కీలకశాఖ కార్యదర్శులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించి, విభజన నేపథ్యంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర సమాచారం రాబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సామాన్య ప్రజలతో పాటు వివిధ సంస్థలు, గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల అభిప్రాయాలను జీవోఎం సేకరించింది. ఇంతవరకూ జీవోఎం సేకరించిన సమాచారంతో పాటు వివిధ శాఖల ముఖ్య అధికారులు సమర్పించిన నివేదికలు, ఇతర త్రా సమాచారం క్రోడికరించి మంత్రుల బృందం తమ నివేదికను సిద్ధం చేయడమే మిగిలింది. ఈనెల 21న జీవోఎం తుది విడత భేటీ కానుంది. ఈమేరకు ఇప్పటి వరకు సేకరించిన సమాచారంతో కూడిన నివేదికను కేంద్ర మంత్రివర్గానికి అదేరోజు మంత్రుల బృందం సమర్పిస్తుంది. కేంద్ర కేబినెట్‌ సూచన మేరకు హోం మంత్రిత్వ శాఖ నివేదిక సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి పంపుతుంది. అసెంబ్లీ అభిప్రాయం తీసుకున్న తర్వాత విభజన ప్రక్రియ ఫైలు రాష్ట్రపతి వద్దకు అక్కడినుంచి పార్లమెంట్‌ ఉభయ సభలకు చేరనుంది. ఈ మొత్తం ప్రక్రియ మనో పక్షం నుంచి 20 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇది వరకే సిద్ధం చేసిన ముసాయిదా మేరకు హైదరాబాద్‌, పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు వల్ల తలెత్తబోయే ముఖ్యమైన 11 అంశాలపై జీవోఎం వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుంది. వాటి పరిష్కారానికి చూపాల్సిన చర్యలను జీవోఎం కేంద్రానికి సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్‌ రాజధానిగా ఉంటుంది. సీమాంధ్ర భూభాగంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో కూడా జీవోఎంనే నిర్ణయిస్తుంది. ఏ నగరం కొత్త రాష్ట్ర రాజధానికి అనుకూలమైనది, స్థానిక డిమాండ్లు, సీమాంధ్ర ప్రాంతాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇతరత్రా అంశాలను జీవోఎం ఇప్పటికే క్షుణ్నంగా అధ్యయనం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సీమాంధ్ర పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా రాత్రికి రాత్రే తీసుకున్నది కాదు. కొన్నేళ్లుగా దీనిపై సంప్రదింపుల ప్రక్రియ సాగుతోంది. ఆ ప్రక్రియలో భాగంగా చివరగా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించింది. కాంగ్రెస్‌ నిర్ణయం ఏకపక్షమని ఆరోపిస్తూ సీమాంధ్ర పార్టీలు విభజన నేపథ్యంలో ఎటూకాని వైఖరితో సీమాంధ్ర ప్రజల హక్కులను హరించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇరు ప్రాంతాల్లో ప్రాతినిథ్యం ఆశతో తెలంగాణ, సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసింది. విభజన అనివార్యం అని తెలిసీ జీవోఎం భేటీకి హాజరుకాక, ఎలాంటి నివేదిక ఇవ్వకుండా ప్రజలను వంచించింది. జీవోఎం సంప్రదింపుల ప్రక్రియ ముగిసి తెలంగాణ బిల్లు సిద్ధమయ్యే సమయంలోనూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పిల్లిమొగ్గలతో పెద్ద కమేడియన్‌గా మిగిలిపోయారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక ప్రాంతానికి కొమ్ము కాయడమే అన్యాయమంటే జీవోఎం భేటీలోనూ అసంబద్ధమైన వాదనలతో విసుగు తెప్పించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఆయన సీమాంధ్ర ప్రాంతానికి పరిమితం కావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వాదనలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. వాదవివాదాలు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామిక ప్రభుత్వాలే రాజ్యాధికారాన్ని నిర్వహించాలి. అదే ప్రజాస్వామ్యం. సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మించే వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఉమ్మడి రాజధాని పరిధిపైనే అభ్యంతరాలున్నాయి. సీమాంధ్రకు అన్ని హంగులతో కూడిన కొత్త రాజధానిని వీలైనంత త్వరగా నిర్మించాలి. అలాగే జాతీయ విద్యాసంస్థలు, పెద్ద ఆస్పత్రులు, ఇతర వసతులు సమకూర్చాలి. ఇరు ప్రాంతాల్లోనూ ఎవరి పెత్తనం లేకుండా స్థానిక ప్రభుత్వాల ఏలుబడిలోనే ఉండాలి. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామిక ప్రభుత్వాలు అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాఫీగా సాగిపోతుంది. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాద్‌ శాంతి భద్రతలు, రెవెన్యూ వ్యవహారాలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ రాష్ట్రపతి చేతిలోనో, గవర్నర్‌ చేతిలోనో పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. అలాగే భద్రాచలాన్ని ముంచి పోలవరం కట్టేందుకు సాగుతున్న కుయత్నాలను విజ్ఞతతో గుర్తించాలి. నల్గొండ జిల్లాలోని మునగాలను కృష్ణ జిల్లాలో కలిపినా, భద్రాచలంలో తూర్పుగోదావరి జిల్లాకు బదలాయించినా అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లేవు సరికదా పాలనాపరంగా కొత్త సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఉమ్మడి పేరుతో హైదరాబాద్‌పై పెట్టే కొర్రీలు కొత్త సమస్యలకు దారితీస్తాయి. హైదరాబాద్‌పై రాష్ట్రపతి, గవర్నర్‌ అజమాయిషీ చేసినప్పుడు తెలంగాణ ఇచ్చి కూడా ప్రయోజనం ఉండదు. మంత్రుల బృందం హైదరాబాద్‌పై వచ్చిన ప్రతిపాదనలు, భద్రాచలం, మునగాలపై వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించే ముందు స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎన్నాళ్ల నుంచి ఉంది, భద్రాచలం, హైదరాబాద్‌ను కావాలని సీమాంధ్రులు ఎందుకు కోరుతున్నారో గుర్తించి సరైన నివేదిక సమర్పించాలి. వీలైనంత త్వరగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి.