కిరికిరి లేకుండా తెలంగాణ ఇస్తేనే కాంగ్రెస్‌కు భవిష్యత్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానం మేరకు హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలి. సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌పై పెడుతున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకొని అనవసరమైన కొర్రీలు పెడితే తెలంగాణ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండబోదు. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని చేయాలని సీడబ్ల్యూసీ సూచించింది. అయితే హైదరాబాద్ పరిధిపై అనేక డిమాండ్లు జీవోఎం దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధాని చేయాలని కొందరు కోరుతుండగా, హైదరాబాద్ మునిసిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయాలని మరికొందరు కోరుతున్నారు. ఉమ్మడి రాజధాని పరిధిలో పరిపాలన, శాంతిభద్రతల నిర్వహణ, రెవెన్యూ వ్యవహారాలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్లపై కేంద్రం లేదా గవర్నర్ పెత్తనం ఉండాలని సీమాంధ్రులు కోరుతున్నారు. హైదరాబాద్‌పై కిరికిరిపెట్టి తెలంగాణ ఇస్తే నాలుగు దశాబ్దాలు కొట్లాడి తెలంగాణ సాధించుకున్నా ప్రయోజనం ఉండబోదు. పైగా హెచ్‌ఎండీఏ పరిధి తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. హైదరాబాద్‌పై ఆ కొర్రీలు అంగీకరిస్తే ఐదు జిల్లాలు తమ సహజ స్వభావ, స్వరూపాలను కోల్పోతాయి. అది తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై ప్రస్తుతం చేస్తున్న కసరత్తును బట్టి డిసెంబర్‌లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి. సోనియాగాంధీ జన్మదినం 9లోగా తెలంగాణ బిల్లు పెట్టే యోచనలో ఉంది. చిరస్థాయిగా సోనియా పేరు తెలంగాణ చరిత్రలో నిలిచిపోవాలన్న సంకల్పంతో అన్నట్లుగా తెలంగాణ విభజనపై కేంద్రం శరవేగంతో ముందుకు పోతున్నది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలనే కృతనిశ్చయంతో జివోఎం యుద్ద ప్రాతిపదికన కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చివరగా ఆయన అభిప్రాయం తీసుకోవడంతో ఇక దాని కసరత్తు పూర్తయ్యింది. ఇక బిల్లు మాత్రమే మిగిలి ఉందని కేంద్రమంత్రులు షిండే, మొయిలీలు చెప్పారు. అంటే తెలంగాణ ఏర్పాటు తిరుగలేనిదని నిరూపించబోతున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, తెలంగాణ కేంద్రమంత్రులు, సీఎంతో చర్చించి అభిప్రాయ సేకరణలకు ముగింపు పలికారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు శ్రమించి ఒక నివేదికను జీవోఎం తయారు చేయనున్నది. అందరూ సమర్పించిన అభిప్రాయాలపై కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, ఏకే అంటోనీ, గులాంనబీ అజాద్, నారాయణస్వామి, జైరామ్ రమేష్, వీరప్పమెయిలీ బృందం ఒక నిర్ణయానికి వచ్చి నివేదికను సోనియాకు సమర్పిస్తారు. అనధికారికంగా ఆమె ఇచ్చే గ్రీన్ సిగ్నల్ బట్టి బండి ముందుకు పోతుంది. హైదరాబాద్ ప్రధాన సమస్య కాబట్టి దానికి తాము కనుగొన్న పరిష్కారానికి సోనియా ఒకే అన్న మరుక్షణమే నివేదిక కేంద్ర కేబినెట్‌కు చేరిపోతుంది. గురువారం కేంద్ర కేబినెట్‌కు నివేదికను సమర్పించగలమని జీవోఎంలోని మంత్రులంతా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. అలా జివోఎం నివేదిక క్యాబినెట్‌కు చేరిన తర్వాత క్యాబినెట్ డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసి న్యాయశాఖ అభిప్రాయాలను కోరుతుంది. ఇదే విషయాన్ని షిండే కూడా తెలిజేశారు. దీంతో కేబినేట్‌కు నివేదిక రాగలదని భావిస్తున్నారు. న్యాయ శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే నెలాఖరులోపు రాష్టప్రతికి అక్కడినుంచి రాష్ట్ర అసెంబ్లీకి చేరుతుంది. రాష్టప్రతి 15 రోజుల గడువుతో బిల్లును అసెం బ్లీకి పంపిస్తారు. అంటే డిసెంబరు1ను బిల్లు అసెం బ్లీకి చేరితే తిరిగి 15వ తేదీలోపు చర్చ ముగించు కుని మళ్లీ రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతికి చేరిన తర్వాత బిల్లులోని అంశాలపై, రాష్ట్ర అసెంబ్లీ చర్చించిన వాటిని పరిశీలించి తిరిగి కేబినెట్‌కు పంపిస్తారు. కేబినెట్ నేరుగా పార్లమెంటులోని తొలుత లోక్‌సభకు ఆ తర్వాత రాజ్యాసభలో ఆమోద ముద్ర వేయించిన తర్వాత తుది ఆమోద ముద్ర కోసం రాష్టప్రతికి వెళ్తుంది. రాష్టప్రతి ఆమోద ముద్రను వేయటం నామమాత్రమే. దీంతో పక్రియ ముగుస్తుంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించప చేయించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు పక్కా వ్యూహంతో సిద్ధంగా ఉన్నారు. ఉభయ సభలో ఆమోదం పొందిన తర్వాత జనవరి 1న ఇరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను, పిసిసి చీఫ్‌లను, ఉప ముఖ్యమంత్రులను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటిస్తారని ఎఐసిసి వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే ఇందులో మరో కోణం కూడా లేకపోలేదు. ఒకవేళ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే కోల్ స్కామ్, ఇతర వివాదా స్పద అంశాలపై రచ్చ జరిగి పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టలేకపోతే ఏమి చేయాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. అవి తెలంగాణ బిల్లుకు అడ్డం కాకుండా తీసుకోవాల్సిన చర్యల్లో తలమునకలయ్యారు. ెతెలంగాణపై ఇదివరకే పలుమార్లు అఖిలపక్షం నిర్వహించారు. మరోమారు అఖిలపక్ష భేటీ, సిఎంతో చర్చలు ముగిశాయి. అఖిల పక్ష సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎవరి వాదనలు వారు వినిపంఇచారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని అన్ని సమస్యలను మంత్రుల బృందం పరిశీలిస్తుందన్నారు. నీటిపంపకం, విద్యుత్, రెవెన్యూ సహా వివిధ సమస్యలున్నాయని సీఎం చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు అనేక సమస్యలకు పరిష్కారాలు అవసరమని షిండే అభిప్రాయపడ్డారు. అయితే వీటన్నటినీ పరిగణనలోకి తీసుకుని విభజన బిల్లును అసెంబ్లీకి పంపనున్నారు. అయితే తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల ఆకాంక్షపై కొర్రీలు కనుక పెడితే అది కాంగ్రెస్ పార్టీకి పెను నష్టాన్ని చవిచూపిస్తుంది.