భ్రమల్లో సీమాంధ్ర బాబులు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందినా ఆంధ్రప్రదేశ్ సమైక్యంగానే ఉంటుందనే భ్రమల్లో ముఖ్యమంత్రి కిరణ్‌బాబు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఏపీఎన్‌జీవో నేత అశోక్‌బాబు కొట్టుకుపోతున్నారు. వాళ్లు అజ్ఞానంతో కొట్టుకుపోవడమే కాదు 13 జిల్లాల సీమాంధ్ర ప్రజలను ఫూల్స్ చేయడానికి యత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం తుది భేటీ గురువారం జరుగనుంది. ఈ భేటీ అనంతరం విభజన సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ మంత్రుల బృందం కేంద్ర కేబినెట్‌కు నివేదిక సమర్పించనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మరికొన్ని లాంఛనాలు మాత్రమే పూర్తి కావాల్సిన నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగానే ఉంటుందని అబద్ధపు, అసత్య ప్రచారాలతో ఈ ముగ్గురు బాబులు సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మొదట సీడబ్ల్యూసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పి, ఆంధ్రప్రదేశ్ విభజనపై రోడ్‌మ్యాప్ సమర్పించి తీరా నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రం సమైక్యంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఖరి వల్లనే రాష్ట్ర విభజన జరుగుతోందంటూ పరోక్ష విమర్శలు గుప్పించాడు. ప్రజలతో సంబంధంలేని నిర్ణయాలు తీసుకునేవారికి వాళ్లు సెలవు ప్రకటిస్తారనీ సెలవిచ్చాడు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి తన అడ్డగోలు వాదననే వినిపించాడు. తెలంగాణ ఏర్పాటు వల్ల నక్సలిజం, టెర్రరిజం పెరిగిపోతాయని, మతతత్వ శక్తులు పేట్రేగుతాయని ఏవో ఫైళ్లు తీసుకెళ్లి తన కంఠశోషను ఏకరువుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యం అని తెలిసినా విడదీయొద్దు సమైక్యంగా ఉంచాలంటూ కోరాడు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ముఖ్యమంత్రితో సమావేశమే జీవోఎం సంప్రదింపుల ప్రక్రియలో చివరిదని తెలిసినా, తానెంత చెప్పినా సమైక్యరాష్ట్రం కొనసాగబోదని పూర్తిగా అర్థమైనా కిరణ్ ఏదో అద్భుతాన్ని సృష్టించి విభజనను ఆపబోతున్నట్లు సీమాంధ్ర ప్రజలను ఊహల్లో విహరింపజేస్తున్నాడు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం కూడా తప్పనిసరి అని, ఈ నేపథ్యంలో అసెంబ్లీ అభిప్రాయం చెప్పకుండా శాసనసభను ప్రోరోగ్ చేయాలంటూ సీఎం వర్గీయులు అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల అనంతరం అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. దీంతో సీఎం ప్రమేయం లేకుండానే శాసనసభను సమావేశ పరిచే అవకాశం స్పీకర్‌కు ఉంటుంది. దీంతో ముఖ్యమంత్రి ప్రాధాన్యత లేకుండా పోయే అవకాశం ఉండటంతో ఆయన వర్గం అసెంబ్లీని ప్రోరోగ్ చేయడం ద్వారా విభజన బిల్లు శాసనసభ ముందుకు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. ఒక్క ముఖ్యమంత్రికి ఉన్న తెలివితోనే కాదు ఆయన రహస్య స్నేహితుడు తెలంగాణ ఏర్పాటుకు ఆదినుంచి అడ్డంకిగా ఉన్న చంద్రబాబు కూడా దీనికి వెనుక వ్యూహ రచన చేస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ బిల్లు కోసం అసెంబ్లీని సమావేశ పరచడంలో రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటానని స్పీకర్ చెప్పడంతో అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాసం తేవడం ద్వారా తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని సీఎం సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. ముగ్గురు బాబుల్లో ముఖ్యుడిగా ఉన్న సీఎం కిరణ్ మరో బాబు అండదండలతోనే ఈ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సీమాంధ్ర ఉద్యోగుల్లో భయాందోళనలు రేకెత్తించడానికి కిరణ్‌బాబు, చంద్రబాబు కలిసి అశోక్‌బాబును పావుగా వాడుకుంటున్నారు. అసెంబ్లీ ముందుకు తన ప్రమేయం లేకుండా బిల్లు వస్తుందేమోనని వణికిపోతున్న సీఎం బయటికి మాత్రం పార్లమెంట్‌లో టీ బిల్లు నెగ్గినా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్తున్నారు. స్పీకర్ కనుక తాను చెప్పినట్టు నడుచుకోకుంటే, అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుంటే స్పీకర్‌పైనే అవిశ్వాసం పెట్టిచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాడు. తద్వారా తన ప్రభుత్వాన్ని తానే కూల్చేందుకు కూడా సీఎం సిద్ధపడుతున్నాడు. ముఖ్యమంత్రి రాజకీయ వైభవం ఎంతో అందరికీ తెలుసు. 2009 ఎన్నికల్లో ఆయన ఎలా గెలిచారో.. ఓట్ల లెక్కింపునకు ముందు ఎలా ప్రవర్తించారో ఏ కాంగ్రెస్ నాయకుడిని అడిగినా చెప్తాడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా రాజకీయంగా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని కాని, నియోజకవర్గ ప్రజల్లో బలాన్ని కాని సంపాదించుకోలేని కిరణ్ ఏ పరిస్థితుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడో అందరికీ తెలుసు. కిరణ్ కాకుండా మరెవరైనా అంతటి గుర్తింపునిస్తే అధిష్టానానికి వీర విధేయుల్లా ఉండేవారు. కానీ కిరణ్ మాత్రమే ధిక్కార స్వరం వినిపించడం వెనుక తనకు తానుగా నాయకుడిగా ఎదగాలనే లక్ష్యం తప్ప మరొకటి లేదు. నియోజకవర్గ ప్రజలే పట్టించుకోని తాను సీమాంధ్రకు నాయకుడిగా ఎదగాలనే కాంక్షతోనే కిరణ్ తెలంగాణ ఏర్పాటు ఆగదని తెలిసినా అక్కడి ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాడు. తద్వారా సీమాంధ్ర ప్రజల్లో విభజనను అడ్డుకునేందుకు సొంత పార్టీనే ధిక్కరించాడనే సానుభూతి పొందాలని చూస్తున్నాడు. అధికారానికి తొమ్మిదిన్నరేళ్ల క్రితం దూరమైన చంద్రబాబు ఈసారి ఎలాగైనా కుర్చీ దక్కించుకోవాలని ఉబలాట పడుతున్నాడు. అందుకోసం విలువలన్నీ పీకి అవతల పారేశాడు. ఆంధ్రప్రదేశ్ విభజనలాంటి కీలకమైన సందర్భంలోనూ ప్రధాన ప్రతిపక్షనేతగా తన పాత్రను పోషించకుండా అన్నింటికీ దూరముంటూ ఇరు ప్రాంతాల ప్రజలను వంచిస్తున్నాడు. సీఎం, బాబు చేతుల్లో పావుగా మారిన ఏపీఎన్‌జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు చేస్తూ తన అపరిపక్వతను బయటపెట్టుకుంటున్నాడు. ఈ ముగ్గురు బాబులు భ్రమల్లో విహరిస్తూ.. సీమాంధ్రుల హక్కులను కాలరాస్తున్నారు. విభజన ఆగదని తెలిసినా సమైక్య రాష్ట్రమే కొనసాగుతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.