సీమాంధ్ర ప్రజల గోడు పట్టని సమైక్య నేతలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సమైక్య రాష్ట్రంలో ముసుగులో అక్కడి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కీలకమైన 11 అంశాలపై కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రానికి చెందిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల అభిప్రాయాలను సేకరించింది. అయితే దీనిని రాజకీయ పార్టీలతో పాటు ముఖ్యమంత్రి కూడా తేలిగ్గానే తీసుకున్నారు. 11 అంశాల్లో అన్నింటికన్నా సీమాంధ్ర ప్రజలకు కీలకమైనది కొత్త రాజధాని ఏర్పాటు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి సహా అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయి. ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవడం తమ తరం కాదని తెలిసి, అందుకు అన్ని దారులూ ముసుకుని పోయినా ఇంకా సమైక్య వాదం అంటూ సీమాంధ్ర నేతలు తమ సొంత లాభాల కోసం వెంపర్లాడుతున్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్ కూడా నెరవేరేలా లేకున్నా లాబీయింగ్‌తో తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇది ఓ రకంగా ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచేదే తప్ప మరోటి కాదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయంలో పేచీ లేకున్న దానివల్ల నష్టపోయేది సీమాంధ్ర ప్రజలే. ఎంతకాలం హైదరాబాద్‌లో ఉంటే అంత వెనకబడిపోక తప్పదు. ఇక్కడ రియల్ వ్యాపారాలు చేసి ఆస్తులు కూడబెట్టుకున్న వారు మాత్రమే హైదరాబాద్‌పై మాట్లాడుతున్నారు. ఇందుకు సీఎం కిరణ్ కూడా అతీతుడేమీ కాదు. హైదారబాద్ ఈ దేశం నుంచి విడిపోయి కొత్త దేశంగా ఏర్పడటం లేదు, ఈ నిజాన్ని గుర్తించడానికి సీమాంధ్ర నేతలు ఇష్టపడటం లేదు. సీమాంధ్ర ప్రాంతానికి సొంత రాజధాని ఉంటేనే ఎప్పటికైనా మంచిదన్న ఆలోచన కొందరికైనా రావడం మంచిది. ఇందులో కిశోర్ చంద్రదేవ్, పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందున్నారు. అయితే వీరి ప్రతిపాదనపై మిగతా వారు మండిపడుతున్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ల వరకు కొనసాగిస్తామని విభజన సందర్భంలో కేంద్రం ప్రకటించింది. అయితే పదేళ్లు అనేది చాలా ఎక్కువ సమయమని అందరూ భావిస్తున్నారు. దీనివల్ల కొత్త రాజధానికి అడుగు పడదన్న భావన చాలామందిలో ఉంది. దీనిబదులు రాజధాని ఎక్కడన్నది నిర్ణయం చేస్తే అక్కడ రాజధాని నిర్మాణానికి ముందుకు వెళ్లాలన్న ఆలోచన చాలామందిలో కనిపిస్తోంది. ఇందులో తొలి అడుగు వేసింది కేంద్రమంత్రి పురంధేశ్వరి అని చెప్పుకోవచ్చు. ఆమె ముందే విషయాన్ని ఊహించి విజయవాడ రాజధాని కోసం స్థానికులతో చర్చించారు కూడా. అక్కడ పారిశ్రామిక వేత్తలతో చర్చించారు కూడా. అయితే ఈ విషయంలో గట్టిగా రాజధాని కోసం కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ పట్టుబడుతున్నారు. విశాఖ పట్టణానికి రాజధాని కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయొద్దని కిశోర్ చంద్రదేవ్ జీవోఎంని కోరారు. సీమాంధ్ర రాష్టాన్రికి విశాఖపట్నాన్ని రాజధానిగా తక్షణం ప్రకటించాలని సూచించారు. . ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రుల బృందాన్ని కలిసి ప్రత్యేక నివేదిక సమర్పించారు. విభజనకు మానసికంగా సిద్దపడ్డవారు ఇప్పుడు రాజీధోరణిలో కొత్త రాజధాని కోసం లాబీయింగ్‌లో పడ్డారు. సీమాంధ్రలో ముఖ్యంగా రాయలసీమలో ఉన్న కొందరు నేతలు ఇంకా రాయల తెలంగాణ అంటూ రొత్త ప్రతిపాదన తెస్తున్నారు. అందుకే ఇలాంటి వారు కొత్త రాజధాని ఏర్పాటులో ఇప్పటి వరకు ఎలాంటి సూచన చేయడం లేదు. అయితే ఎక్కడ పెట్టాలన్నదానిపై ఏకాభిప్రాయం అంతకన్నా లేదు. ఈ దశలో కొందరు ఇప్పుడే రాజధాని ఏర్పాటుకు తమకున్న అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు ఏర్పడ్డ రాష్టాల్ల్రో ఎక్కడా ఉమ్మడి రాజధాని లేదు. అలాంటి అవసరం కూడా రాలేదు. విడిపోయిన రాష్ట్రాలన్నీ కొత్తగా రాజధానులను ఏర్పాటు చేసుకున్నాయి. అభివృద్దిలో ముందుకు సాగుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే పేచి వచ్చింది. రాజధాని అంటే ప్రత్యేక పరిస్థితులు, ఏర్పాట్లు ఉండాలి. రాష్ట్రంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. విమాన, రైల్వే సౌకర్యాలు ఉండాలి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు వసతి సౌకర్యాలు ఉండాలి. ఇవన్నీ విశాఖకు సరిపోతాయని కిశోర్ చంద్రదేవ్ వాదన. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులతో జీవోఎం భేటీకి హాజరైనప్పటికీ కిశోర్ చంద్రదేవ్ వారితో కలవలేదు. ఎనిమిది మంది మంత్రులు జీవోఎంకు ఇచ్చిన లేఖ, నివేదికలపై సంతకం పెట్టలేదు. ఉమ్మడి రాజధాని వల్ల ఉపయోగం లేదని ఆయన వాదిస్తున్నారు. ఉమ్మడి రాజధాని ప్రతిపాదన హాస్యాస్పదం. ఈ డిమాండ్ సహేతుకం కాదంటారు. ఇలా చేయడం వల్ల రాజధాని నిర్మాణంలో వెనకబడి పోతామని ఆయన గ్రహించి ఉంటారు. అయితే కొందరు తమ ఆస్తులను కూడబెట్టుకున్నారు కనుక హైదరాబాద్‌పై పోటీ పడి ప్రకటనలు చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి అయినా భౌగోళికంగా మధ్యలోనే రాజధాని ఉండాలనటం సరికాదు. కేరళ రాజధాని త్రివేండ్రం సహా చాలా రాష్ట్రాల రాజధానులు సరిగ్గా ఆ రాష్ట్ర మధ్యలో లేవు. కాబట్టి, సీమాంధ్రకు విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తూ కేంద్రం వెంటనే ప్రకటన చేయాలన్నారు. కిశోర్ చంద్రదేవ్ మరో ప్రతిపాదనా చేశారు. కోస్తాతో కలిసి ఉండటం రాయలసీమ ప్రజలకు ఇష్టం ఉండదని, అందువల్ల సీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్నారు. వారికి మొదటి నుంచీ బెంగళూరు, హైదరాబాద్‌లతో అనుబంధం ఎక్కువన్నారు. కాబట్టి, ఇరు ప్రాంతాలూ ఒప్పుకుంటే రాయల తెలంగాణను ఏర్పాటు చేయండి. లేదంటే ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయండి. అంతే తప్ప సీమను బలవంతంగా కోస్తాంధ్రలో కలపొద్దన్నారు. నిజానికి ప్రత్యేక సీమ కోసం నాలుగు జిల్లాల వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే విజయవాడ బెటరని పనబాక లక్ష్మి ప్రకటించారు. సీమాంధ్రలో సీమ, ఆంధ్ర ప్రాంతాల మధ్యకూడా స్వభావ, స్వరూపాల్లో తేడా ఉంది. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలు కలిసి ఒక రాష్ట్రంగా ఉంటాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఒక ప్రాంతానికి రాజధాని కేటాయిస్తే, మరో ప్రాంతానికి హైకోర్టును, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలను సమపాళ్లలో కేటాయించడం ద్వారా ఇరు ప్రాంతాలకు న్యాయం చేయొచ్చు. ఇప్పటికైనా సీమాంధ్ర సమైక్య నేతలు గాలిలో దీపాలు పెట్టడం మానేసి వాస్తవాలు గుర్తెరగాలి. సీమాంధ్ర ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పాటు పడాలి.