ప్రాణాలు బలిగొన్న నిర్లక్ష్యం
హెలెన్ తుపాను వస్తూనే 11 మంది ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఓ తహశీల్దార్‌నూ కబళించింది. హెలెన్ తుపాను తీరం దాటుతూనే కోస్తాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది. లక్షలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతన్నలు అపురూపంగా పెంచుకున్న లక్షలాది కొబ్బరి చెట్లనూ నేలకూల్చింది. హెలెన్ తుపాను ఊహించినదానికంటే పెను నష్టాన్ని మిగిల్చి బలహీన పడింది. ఇంకా తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉంది. హెలెన్ తుపాను వస్తోందంటూ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా సహాయక చర్యలు చేపట్టడంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. ఇటీవల దేశాన్ని భయపెట్టిన పై-లిన్ తుపాను సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించాయి. ఎక్కువ మంది ప్రజలను తుపాను రాకపూర్వమే సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఒడిశాను పై-లిన్ గడగడలాడించినా సహాయక చర్యల్లో ప్రభుత్వం తీరు కాస్త పర్వాలేదనిపించింది. కానీ హెలెన్ తుపాను సందర్భంగా మాత్రం ప్రభుత్వాలు స్పందించిన తీరు చాలా దారుణంగా ఉంది. తుపాను ముంచుకొస్తున్నా ప్రభుత్వాలు, జాతీయ విపత్తుల నిర్వహణ మండలి చేష్టలుడిగి చూడటం మినహా పెద్దగా ప్రతిస్పందించలేదు. తుపాన్లు దేశాన్ని, రాష్ట్రాన్ని వణికిస్తున్నా ముందస్తు సహాయక చర్యలు చేపట్టడంలో మన పాలకులు ఎప్పుడే నత్తకు వెనకే ఉంటున్నారు. తుపాన్లు సంభవించినప్పుడు ప్రచార్భాటాలతో ఊదరగొట్టడం మినహా నిర్దిష్టమైన చర్యలు చేపట్టి తుపాను ప్రభావిత, లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు చేపట్టిన చర్యలు శూన్యం. రాష్ట్రానికే చెందిన మర్రి శశిధర్‌రెడ్డి జాతీయ విపత్తుల నిర్వహణ మండలికి వైస్ చైర్మన్‌గా ఉన్నా రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో తుపాను సహాయక చర్యలు చేపట్టడం లేదు. అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే అత్యధిక తుపాన్లు సంభవిస్తున్నట్టు రికార్డులు చెబుతున్నా మన పాలకులు మాత్రం నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రెండు మాసాల్లోనే దేశవ్యాప్తంగా పంటలు ఎక్కువగా చేతికి వస్తుంటాయి. ఆ సమయంలో చిన్నపాటి వర్షం కురిసినా రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. అదే తుపాన్లు వస్తే పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. కోస్తాంధ్ర ప్రాంతంలో అత్యధిక భూభాగం ఆయకట్టు ప్రాంతమే కావడంతో నవంబర్, డిసెంబర్ మాసాల్లో పంటలు చేతికి వస్తుంటాయి. తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎక్కువగా బోర్లు, బావుల కింద పంటలు సాగు చేస్తారు కాబట్టి అవి అక్టోబర్‌లోనే కోతకు వస్తాయి. సరిగ్గా ఇదే సమయంలో బంగాళాఖాతంలో సంభవించే అల్పపీడనాలు తుపాన్లుగా మారి ఊర్లకు ఊర్లు ముంచేస్తున్నాయి. ఫలితంగా లక్షలాది ఎకరాల్లో పంటలకు పెనునష్టం సంభవిస్తోంది. యేటా అదే పరిస్థితి పునరావృత్తమవుతున్నా పాలకులు గుణపాఠం నేర్వడం లేదు. తుపాన్లు ముంచెత్తిన తర్వాత ఏవో సర్వేలు చేసి రైతులకు ముష్టివేసినట్లుగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మినహా వారిని ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదు. పై-లిన్ తుపాను వచ్చిపోయిన దాదాపు నెలన్నర తర్వాత రాష్ట్రంలోని తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేంద్ర బృందం రైతులను ఆదుకుంటామని చెప్పకపోగా, ఇప్పుడు మళ్లీ పంటలు వేసుకోవచ్చుకదా అంటూ అమాయకంగా ప్రశ్నించింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ఆరంభమైంది. పై-లిన్ నష్ట పరిచింది ఖరీఫ్ పంటలను. ఆ విషయం తెలియనంత అమాయకులేమి కాదు కేంద్ర బృందం సభ్యులు. కానీ రైతులకేంటి పరిహారం ఇచ్చేది అన్నట్టుగా వ్యవహరించారు. వారి పర్యటన ఆధ్యంతం రైతులకు రోత, కంపరం పుట్టించే స్థాయిలోనే సాగింది. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇప్పిస్తుందని ఆశించిన రైతులకు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నోట్లో పచ్చి వెలక్కాయపడ్డ చందంగా మారింది పరిస్థితి. ఈ ఒక్కసారే కాదు ప్రతిసారి తుపాన్ నష్టపరిచిన నెల, రెండు నెలల తర్వాత పర్యటనలు జరపడం ఇష్టారాజ్యంగా నివేదికలిచ్చి నష్టాన్ని తక్కువ చేయడం కేంద్రానికి పరిపాటిగా మారింది. పైకిమాత్రం తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు ఎంతో చేశామని చెప్పుకుంటోంది. ఇదివరకు తుపాను వస్తుందంటే కనీసం పాలకులు స్పందించి ముందస్తు చర్యలైనా చేపట్టేవారు. కానీ ఈసారి అదీలేదు. కనీసం లోతట్టు, తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించలేదు. ఒకవైపు తుపాను తీరం దాటే సమయంలో మచిలీపట్నం ప్రాంతానికి చెందిన 20 వేల మందిని సహాయక కేంద్రాలకు తరలించి మమ అనిపించారు. కానీ తుపాను తీరం దాటిని కొద్దిసేపట్లోనే తన ప్రభావం చూపింది. రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. 11 మందిని పొట్టనబెట్టుకుంది. వీరిలో సహాయక చర్యలను పరిశీలిస్తున్న తహశీల్దార్ కూడా ఉండటం విషాదకరం. పాలకుల నిర్లక్ష్యం ప్రజలను బలిపెట్టింది. వారికి ఆర్థికంగా పెనునష్టాన్ని సృష్టించింది. దీనిని కొద్దిపాటి పరిహారంతో పూడ్చడం సాధ్యం కాదు. ఆ విషయం తెలిసినా పాలకులు ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు. ఏటా తుపాన్లు వచ్చిన తర్వాతి నష్టాన్ని అంచనాలు వేయడం తప్ప తుపాన్ల నుంచి తీర ప్రాంతాలను రక్షించడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. తీరప్రాంతంలో కరకట్టల నిర్మాణం ప్రతిపాదనలకు ఇంతవరకూ మోక్షం లేదు. ఏటా సంభవిస్తున్న భారీ నష్టాలతో పోల్చితే కరకట్టల నిర్మాణానికి పెట్టేది పెద్ద ఖర్చేమి కాదు. అయినా మన పాలకులు ఆ దిశగా కనీసం దృష్టి సారించడం లేదు. తుపాన్ల ప్రభావం ఒక్క తీరప్రాంతంతోనే ఆగిపోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తుపాన్ల వల్ల భారీ వర్షాలు కురిసి చేతికి వచ్చిన పంటలు నష్టపోతున్నాయి. వారికి పరిహారం ఇవ్వడంలో పాలకులు శాస్త్రీయ ప్రమాణాలు పరిగణలోకి తీసుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంతో సంబంధం లేకుండా ఒక లెక్కకట్టి ఎకరానికి ఇంత అని పరిహారం ఇస్తున్నారు. అలాగే ఈసారి పాలకుల దూరదృష్టి లోపంతో ప్రాణనష్టంతో పాటు భారీ ఆస్తినష్టం సంభవించింది. దీని నుంచి ఇప్పటికైనా పాలకులు గుణపాఠాలు నేర్చుకోవాలి.