అధిష్టానమే ముఖ్యమంత్రిని నియంత్రించాలి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కట్టడి చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఇకనైనా దృష్టి సారించాలి. గతంలో అనేక పర్యాయాలు తెలంగాణ ప్రాంతంలో పర్యటించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు. అభివృద్ధి కావాలంటే తాను చేస్తాను కాని తెలంగాణ ఇచ్చే శక్తి మాత్రం తనకు లేదని చెప్పుకున్నాడు. అదే కిరణ్ అధిష్టానం తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకున్నాక ఊల్టా తిరిగాడు. అదివరకు అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పిన సీఎం ఉన్నట్టుండి సమైక్య రాష్ట్రాన్నే కొనసాగించాలని పట్టుబట్టడం ఆరంభించాడు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న అధిష్టానాన్ని, అధినేత్రిని సైతం విమర్శించేందుకు వెనుకాడలేదు. కిరణ్ సమైక్య రాష్ట్రాన్ని ఎందుకు ఇంత బలంగా కోరుకుంటున్నాడు? కిరణ్ వెనుక ఎవరుండి అధిష్టానాన్నే దిక్కరించేలా చేస్తున్నారనే ప్రశ్నలు అప్పట్లో ఉత్పన్నమయ్యాయి. అధిష్టానమే నాటకమాడిస్తోందని కొందరు, సమైక్యవాదాన్ని బలంగా వినిపించి సొంత పార్టీ పెట్టుకుంటాడని ఇంకొందరు ఇష్టం వచ్చినట్లుగా ఊహాగానాలు చేస్తూ పోయారు. కిరణ్ ఏమనుకుంటున్నాడో అనే విషయాన్ని పక్కనబెడితే ఆయన తెలంగాణను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడనేది అర్థం కాని ప్రశ్న. కిరణ్ ఇప్పుడు కొత్తగా సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాడు. ఆయనకంటే ముందు బలమైన సమైక్యవాదులుగా ముద్ర పడిన ఎందరో ఇప్పుడు కనీసం నోరుకూడా ఎత్తడం లేదు. వారితో పోలిస్తే లాబీయింగ్‌లో కాని, రాజకీయ చతురతలో కాని కిరణ్ అనుభవ శూన్యుడు. ఆరంభశూరుడే. అలాంటి కిరణ్ తెలంగాణను అడ్డుకునేందుకు తుదవరకు పోరాడుతానని చెప్తున్నాడు. తనకు మద్దతివ్వాలని నేతలను, ప్రజలను కోరుతున్నాడు. వాయల్పాడు నుంచి పీలేరు వరకు కిరణ్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే కొట్టొచ్చినట్టు కనిపించేది ఆయనకు రాజకీయాలు చేతకానివని. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం తమ శాసనసభ పక్షనేతగా, ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం వెనుక కారణాలు వేరే ఉండొచ్చు. తండ్రి నియోజకవర్గం వాయల్పాడులోనే అంతగా ప్రభావం చూపలేకపోయిన కిరణ్ పునర్విభజన తర్వాత పీలేరుకు మారి చావుతప్పి కన్నులొట్టుబోయినట్టుగా గెలిచాడు. ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. కనీసం మంత్రికాని వ్యక్తిని అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమిస్తే వారికి వీరవిధేయుడుగా వుండాల్సిన వ్యక్తి ఒక్కసారిగా రాజకీయ ప్రత్యర్థిని తలపించేలా తిట్టిపోస్తున్నాడు. తనకు తానుగా సీమాంధ్రులను మాత్రమే ప్రజలుగా గుర్తిస్తూ వారి ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి సెలవు ప్రకటిస్తారని హెచ్చరించాడు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌పై అబద్ధాలు అచ్చేసి నివేదికగా ఇచ్చాడు. నవ్విపోదురుగాని నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉన్న నివేదికను ఆహో ఒహో అంటూ ప్రచారం చేయించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే మతతత్వ శక్తులు పేట్రేగుతాయని, మావోయిస్టుల రాజ్యం మళ్లీ వస్తుందని, ఉద్యోగుల సమస్య తలెత్తుతుందని, నదీజలాల సమస్యలు జఠిలమవుతాయని, విద్యుత్ అందదని ఇలా ఎన్నో అడ్డుపుల్లలు వేసే ప్రయత్నం చేశాడు. ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ప్రజాధనంతో నిర్వహించే రచ్చబండ సభల్లో మాట్లాడుతూ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు విభజన జరుగదని అప్పట్లో చెప్పిన కిరణ్ ఇప్పుడు తుదివరకు తెలంగాణను అడ్డుకునేందుకు పోరాడుతానంటున్నాడు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విభజన నేపథ్యంలో కీలకమైన అంశాలపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన నివేదిక సమర్పించడమే ఇప్పుడు మిగిలుంది. ఆ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసి రాష్ట్రపతి పరిశీలనకు పంపాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది. మరో వారం రోజుల్లో బిల్లు రాష్ట్రపతి నుంచి అసెంబ్లీ అభిప్రాయం కోసం రాష్ట్రానికి రానుంది. ఈనేపథ్యంలో అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని ముఖ్యమంత్రి కోరుతున్నాడు. వివిధ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి వాటి ఆమోదం కోసం అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని లేఖ రాసిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటి నుంచి అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలనే విషయాన్ని సీఎం ఎందుకు విస్మరించినట్టు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుంటే కేబినెట్ తీసుకునే నిర్ణయాలు ఆమోదం పొందబోవనే విషయం ముఖ్యమంత్రికి తెలియదా? అంత అజ్ఞానంతో ఆయన పాలన సాగిస్తున్నాడా? తెలంగాణ బిల్లు వచ్చే సమయంలో అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని ప్రయత్నించడం వెనుక కారణాలేంటి? అంటే ముఖ్యమంత్రి వితండ వాదమే కనిపిస్తోంది. అసెంబ్లీ కనుక ప్రోరోగ్ చేయకుంటే ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా స్పీకర్ నేరుగా సమావేశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ విషయం అప్పట్లో కొన్ని రోజులు స్పీకర్‌గా పనిచేసిన కిరణ్‌కు తెలియదనుకోవడానికి వీల్లేదు. ఆయనను కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించినప్పటికీ ఆయనెప్పుడలా నడుచుకోలేదు. ఒక ప్రాంతానికి ప్రతినిధిగానే వ్యవహరించాడు. తెలంగాణపై కీలక నిర్ణయం తీసుకున్న సమయంలో దోపిడీదారులైన పెత్తందారుల వర్గంలో నిలిచి అన్యాయానికి వత్తాసు పలికాడు. ఆంధ్రప్రదేశ్ విభజనపై అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నాడు. సీమాంధ్ర ప్రజల్లో లేని సమైక్యవాదాన్ని జొప్పించేందుకు సీఎం సహా సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రజలెవరూ కోరుకోని సమైక్యాంధ్ర నేతలకు మాత్రమే ఎందుకు అవసరం అంటే హైదరాబాద్‌ను, తెలంగాణ పూర్తిగా దోపిడీ చేసేందుకు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల పోరాటం సాకారం అయ్యేవేళ కిరణ్ కిరికిరి రాజకీయాలతో చేసే కుట్రలకు తెలంగాణ ప్రజానీకం బదులు తీర్చుకోవడానికి ఎంతో సమయం పట్టదు. కానీ తమ ఆరు దశాబ్దాల ఆకాంక్ష నెరవేరే సమయంలో అలా చేయడానికి తెలంగాణ ప్రజలు వెనుకాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలంటూ సీఎం చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరిపై అధిష్టానం ఆలస్యంగానైనా వేటు వేసింది. అలాగే సొంత ఎజెండా అమలుకోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ముఖ్యమంత్రిని అధిష్టానమే దారికి తీసుకురావాలి. అతడిని నియంత్రించే చర్యలు మొదలుపెట్టాలి.