ప్రజలు కోరుకోని రాయల తెలంగాణ ఎందుకు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచడానికో, తోవకు తెచ్చుకోవడానికో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం చిత్ర, విచిత్రమైన ప్రత్యామ్నాయాలను ప్రచారంలో పెడుతోంది. వాటిలో ఇటీవల కాలంలో ప్రబలంగా వినిపిస్తున్నది రాయల తెలంగాణ. తెలంగాణలోని పది జిల్లాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాను ఆనుకొని ఉండే కర్నూల్, దానికి అవతలి వైపు ఉండే అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు జాతీయ మీడియా ఇటీవల పలు పర్యాయాలు కథనాలు వెలువరించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై జులై 30న నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో, యూపీఏ భాగస్వామ్యపక్ష పార్టీల సమావేశంలో నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ప్రతిపాదించారు. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోట్‌ను కూడా సిద్ధం చేసింది. సీడబ్ల్యూసీ కోరినట్లు పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుతో పాటు హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు కొనసాగించాలని అందులో పేర్కొంది. నోట్‌ను ఆమోదించిన కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందాన్ని కూడా నియమించింది. హోం మంత్రి షిండే నేతృత్వంలోని మంత్రుల బృందం ప్రజలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్రానికి చెందిన కీలక శాఖల అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనిమిది శాఖల ముఖ్య కార్యదర్శులతో సంప్రదింపులు జరిపిన మంత్రుల బృందం తన నివేదికను సోమవారం యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి అందజేసింది. ఆమె నివేదికను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవడం మిగిలుంది. తర్వాతి ప్రక్రియలన్నీ లాంఛనమే. అయితే కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగిస్తూనే ప్రజల్లో అనేక సందేహాలకు తావిచ్చేలా వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం చేయాలనే ప్రచారం ఒకటైతే, ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లు హైదరాబాద్ శాంతిభద్రతలు, పాలనవ్యవహారాలు, రెవెన్యూ సంబంధిత పర్యవేక్షణ, విద్యా సంస్థలో అడ్మిషన్లు తదితర వ్యవహారాలు కేంద్రం చేతిలోనో లేక గవర్నర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్రత్యేక బృందం చేతిలోనో ఉంచుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఇలా చేస్తే ఎలాంటి ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందోననే సమాచారమూ తెప్పించుకుంది. హైదరాబాద్‌పై కొర్రీలు పెడితే తెలంగాణ ఇచ్చి కూడా ప్రయోజనం ఉండదనే సమాచారం ఆ ప్రయత్నాలకు స్వస్తి పలికింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై కూడా సీమాంధ్ర పెత్తందారులు రకరకాల డిమాండ్లు యూపీఏ ప్రభుత్వం ముందుంచారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయాలని మొదట కోరి తర్వాత హెచ్‌ఎండీఏ పరిధి ఉమ్మడి రాజధానిగా ఉండాలన్నారు. హెచ్‌ఎండీఏ ఐదు జిల్లాల్లో విస్తరించి ఉందని విషయాన్ని విస్మరించి అసంబద్ధమైన డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఇది తెలంగాణ ప్రజలకు ఆగ్రహం తెప్పించే చర్యే కావడంతో దీనిపై నిర్ణయాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారు. ఉమ్మడి రాజధాని సరిహద్దులు ఎలా ఉంటాయో మాత్రం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పక్షాన వెల్లడించలేదు. ఇదిలా ఉండగానే రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దీనిపై అభిప్రాయ సేకరణకు ఇంటెలిజెన్స్ బ్యూరోను రంగంలోకి దించారు. ఐబీ అధికారులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మీ అభ్యంతరాలేంటి అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదించడం ఐబీ పని. తాము సేకరించే సమాచారంపై మూడో కంటికి కూడా తెలియకుండ వ్యవహరించాల్సిన బాధ్యత ఐబీపై ఉంటుంది. అలాంటిది ఐబీ నేరుగా ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు కోరడం అనైతికం. తమ బాధ్యతలను కాదని ఇతర పనులు చేయడమే. ఐబీ అభిప్రాయ సేకరణపై విమర్శలు వెల్లువెత్తిన తర్వాత కూడా ఆ పనిని కొనసాగించింది. పరిపాలన వ్యవహారాలపై నిత్యం నీతులు చెప్పే మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ ఐబీ చర్యలను మంచి పరిణామమనడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ కొలిక్కి వచ్చి బిల్లు అభిప్రాయ సేకరణ కోసం అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్, సీమాంధ్ర నేతలు అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలనే కోరుతున్నారు. ఈమేరకు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంబంధిత ఫైలును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబుకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ బిల్లులు శాసనసభ ఆమోదం పొందాలి. సాధారణంగా యేటా మూడు సీజన్లలో అసెంబ్లీని సమావేశ పరుస్తారు. సమావేశాల తర్వాత ప్రత్యేకమైన ఆర్డినెన్స్‌ల అమలు కోసం అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తారు. అలా చేస్తేనే ఆర్డినెన్స్‌లకు ఆమోదం లభిస్తుంది. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అప్పటి నుంచి అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. చేయమని ముఖ్యమంత్రి స్పీకర్‌ను కోరలేదు కూడా. అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రితో పనిలేకుండా స్పీకర్ నేరుగా సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. అదే జరిగితే ఇంతకాలం తాను సమైక్యవాదినని చెప్పుకున్న వాదనకు పసలేకుండా పోతుందని ముఖ్యమంత్రి, స్పీకర్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆయన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడే కాబట్టి ఒత్తిడికి తలొగ్గి ప్రోరోగ్ ఫైల్‌ను మంత్రి వద్దకు పంపాడు. కిరణ్ సమైక్యవాదే అయితే తెలంగాణపై శాసనసభకు పంపే బిల్లుపై తన అభిప్రాయం చెప్పుకోవచ్చు. కానీ అందుకు విరుద్ధంగా సీఎం సభను సమావేశం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డిసెంబర్ 20లోగా శాసనసభను సమావేశ పరచకతప్పదు. ఈనేపథ్యంలో ప్రోరోగ్ ద్వారా శాసనసభ సమావేశాలను సీఎం మహా అయితే 20 రోజులు వాయిదా వేయించగలడు. అంతకుమించి ఆయన చేతుల్లోనూ ఉండదు. ఈ విషయం తెలిసి కూడా ప్రోరోగ్ పేరుతో రాద్దాంతం చేయడం ఎందుకో ఆయనకే తెలియాలి. కేంద్రం ప్రజలు కోరుకోని రాయల తెలంగాణపై ఆరాలు తీస్తుంటే సీఎం విభజన బిల్లు అసెంబ్లీ అభిప్రాయానికే రావద్దన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు చర్యలకు తెలంగాణ ప్రజలు సరైన రీతిలో సమాధానమిచ్చితీరుతారు.