తెలంగాణ ముసాయిదా రాగానే అసెంబ్లీని సమావేశ పర్చండి

– మంత్రి జానారెడ్డి
– గవర్నర్‌ను కలిసిన టీకాంగ్రెస్‌ మంత్రులు
హైదరాబాద్‌, నవంబర్‌ 26 (జనంసాక్షి) :
తెలంగాణ ముసాయిదా అసెంబ్లీ అభిప్రాయం కోసం రాష్ట్రపతి వద్దనుంచి రాగానే శాసనసభను సమావేశ పరచాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. మంగళవారం మంత్రి జానారెడ్డి నేతృత్వంలో గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ మాట్లాడుతూ ప్రోరోగ్‌ విషయమై గతంలోనే గవర్నర్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో కేంద్రం అడుగులు వేగంగా వేస్తున్న తరుణంలో రాష్ట్రపతి నుంచి ఇందుకు సంబందించిన బిల్లు ఎప్పుడైనా వచ్చే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు శాసనసభ్యుల సంఖ్యను 153కు, పది జిల్లాలను 17 జిల్లాలకు పెంచాలనే ప్రతిపాదనలతో టి కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో జిఓఎం మంత్రులను, ప్రధానమంత్రిని, సోనియాగాంధీని కలిసి విన్నవిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయం మేరకు 10 జిల్లాలు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలన్నారు. ఇందులో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. సీమాంధ్ర నేతలు భద్రాచలం గురించి ఆశపడుతున్నది కేవలం ఆప్రాంతాన్ని ముంచేందుకే తప్ప మరోటి కానే కాదన్నారు. భద్రాచలం డివిజన్‌తోపాటు, నల్గొండ జిల్లాలోని మునగాల కూడా తెలంగాణలోనే ఉంటుందన్నారు. ఏఒక్క తిరకాసు పెట్టినా ఊరుకునేది లేనే లేదన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టడంలో జాప్యం జరుగుతుందేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ ప్రాంత మంత్రులుగా శాసనసభను త్వరగా సమావేశ పర్చాలని కోరినట్లు చెప్పారు. వీరితో పాటు మంత్రులు బస్వరాజు సారయ్య, పి. సుదర్శన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ తదితరులు ఉన్నారు.