ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కీలకమైన అంశాలపై సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం తన పని పూర్తి చేసిం ది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అనుసరించాల్సిన పద్ధతులు, ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా తలెత్తే ఇబ్బందుల పరిష్కారానికి మంత్రుల బృందం ముసాయిదా సిద్ధం చేసింది. ఆ ముసాయిదాను డిసెంబర్‌ 4న కేంద్ర కేబినెట్‌ ముందు ప్రవేశపెట్టనున్నారు. వెనువెంటనే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సిద్ధం చేసి రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని ప్రణాళిక రూపొందించారు. మొదట గురువారమే జీవోఎం కేబినెట్‌కు నివేదిక సమర్పిస్తుందని మీడియాకు లీకులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో సీమాంధ్ర నేతలు రాజధాని హైదరాబాద్‌ సహా భద్రాచలంపై కొర్రీలు పెట్టడం, నల్లగొండ జిల్లాలోని మునగాల మండలాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని డిమాండ్‌ చేయడంతో విభజన అంశం కాస్త జఠిలంగా మారింది. హైదరాబాద్‌, భద్రాచలంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కొర్రీలు అంగీకరించబోమని తెలంగాణవాదులు స్పష్టం చేయడం, వాటిపైనే సీమాంధ్రులు పట్టుబట్టడంతో కేంద్రం వీటికి మధ్యే మార్గం చూపనున్నట్లు మీడియా లీకుల ద్వారా వెల్లడించింది. ఈనేపథ్యంలోనే మరిన్ని సంప్రదింపులు జరుపుతామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే బుధవారం వెల్లడించగా, అలాంటిదేమీ లేదని జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్‌ అన్నారు. గురువారం జీవోఎం సభ్యులు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీకి షిండే, జైరాం హాజరుకాగా 40 నిమిషాల పాటు చర్చించిన అనంతరం షిండే బయటకు వచ్చేశారు. చిదంబరం, జైరాం రమేశ్‌ మాత్రం ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదింపులు కొనసాగించి నివేదికను సిద్ధం చేశారు. ఆ నివేదికను కేబినెట్‌ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం పొందడం ఇక లాంఛనమే. అంతకన్నా ముందు బిల్లు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పరిశీలనకు పంపుతారు. ఆమె సూచనల మేరకు జైరాం రమేశ్‌ తుది ముసాయిదా సిద్ధం చేస్తారు. దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారు. ఆయన ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అభిప్రాయం కోరుతారు. ముందుగా అనుకున్నట్టైతే డిసెంబర్‌ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా పార్లమెంట్‌లో తెలంగాణ ప్రవేశపెడతారని అంచనా వేయగా అది కొంచం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం ఫైల్‌ను రాష్ట్రపతి వద్దకు పంపిన తర్వాత దానిని ఆయన కేంద్రానికి ఆ ఫైల్‌ను పంపుతారు. ఆ తర్వాతే బిల్లు పార్లమెంట్‌ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మధ్య వ్యవధి కేవలం ఐదు రోజులే ఉండటంతో డిసెంబర్‌ 9న తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ముందుకు రావడం కష్టమే. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు రావడం ఆలస్యమవుతుండటం, మొదట అనుకున్నట్టుగా గురువారం కాకుండా ఆరు రోజులు ఆలస్యంగా కేబినెట్‌ ముందుకు జీవోఎం నివేదిక వస్తుండటంపై తెలంగాణ ప్రజల్లో కొత్త సందేహాలు ముసురుకుంటున్నాయి. సీమాంధ్రులు హైదరాబాద్‌పై కోరినట్టుగా కొర్రీలే కనుక పెడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చికూడా కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. హైదరాబాద్‌ పరిపాలన వ్యవహరాలు, శాంతి భద్రతలు, రెవెన్యూ సంబంధ విషయాలు కేంద్రం చేతిలో పెట్టుకొని తెలంగాణ ఇస్తే అది ఇక్కడి ప్రజలను దారుణంగా అవమానించినట్టే అవుతుంది. నాలుగు దశాబ్దాలు పోరాడి తెలంగాణ సాధించుకున్నది ఇన్ని ఆంక్షలతో కూడిన ప్రత్యేక రాష్ట్రం సాధించుకునేందుకు కాదు. హైదరాబాద్‌ తెలంగాణకు గుండెకాయ. హైదరాబాద్‌తో సీమాంధ్రులకున్న అనుబంధం కేవలం 57 ఏళ్లది మాత్రమే. కానీ తెలంగాణ ప్రజలు తరతరాలుగా హైదరాబాద్‌తో అనుబంధాన్ని పెనవేసుకున్నారు. దానిని విస్మరించి పిడికెడు మంది పెట్టుబడిదారులు, వేలాది మంది దొంగ ఉద్యోగుల కోసం హైదరాబాద్‌పై కొర్రీలు పెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు అంగీకరించబోరు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టిన ఇక్కడి ప్రజల ప్రతిఘటన ఎంత తీవ్రంగా ఉంటుందో కేంద్రం మరోమారు రుచి చూడాల్సి ఉంటుంది. అలాగే ఎవరూ కోరుకోని రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి రెండు జిల్లాలను తెలంగాణపై బలవంతంగా రుద్దాలని చూస్తే దానికి సంబంధించిన ప్రతిఫలం కూడా కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్‌ గౌరవించే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఇంతవరకూ తీసుకువచ్చిందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. తమ ఆరు దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్‌ పార్టీని గుండెల్లో పెట్టి చూసుకోవడానికి కూడా వారు సిద్ధం. కానీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పెట్టుబడిదారులు, హైదరాబాద్‌లో అక్రమంగా ఉద్యోగాలు కొళ్లగొట్టిన వారి డిమాండ్‌లో ఏ మాత్రం న్యాయం లేదు. మరింత కాలం తమ దోపిడీ సాగడానికే వాళ్లు హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం చేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ కూడా సీమాంధ్ర లాబీయింగ్‌కు పూర్తిగా లోనైట్లుగా తేటతెల్లమైన నేపథ్యంలో జీవోఎం నివేదిక కేంద్ర కేబినెట్‌ ముందుకు రావడం ఆలస్యమవడం ఇక్కడి ప్రజలు కీడును శంకించేలా చేస్తోంది. తెలంగాణ ప్రజలకు పోరాటాలు ఉద్యమాలు కొత్తకాదు. తెలంగాణ పోరాటాలకు పురిటిగడ్డ. అది కేంద్రానికి స్పష్టంగా తెలుసు. నాలుగు దశాబ్దాల ఒక ఆకాంక్ష సాధన కోసం పోరాడిన తెలంగాణ ప్రజలకు, ఎన్నో త్యాగాలు చేసిన ఈ ప్రాంత వాసులకు కొర్రీలతో కూడిన తెలంగాణ వస్తే ప్రతిఘటించడం కూడా తెలుసు. ఈ విషయం అందరికంటే స్పష్టంగా కేంద్రానికీ తెలుసు. అన్నీ తెలిసి తెలంగాణపై కొర్రీలు పెడదామని చూస్తే ఆ పార్టీ ఎందుకూ కొరగాకుండా పోతుంది. జీవోఎం సిద్ధం చేసే నివేదిక తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఉండాలి. ఎలాంటి ఆంక్షలు లేని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నే ఏర్పాటు చేయాలి.