తెలంగాణపై మోడీ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి?
ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడలో తీర్మానం చేసిన భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత ఆ తీర్మానాన్నే మరిచిపోయింది. ఆ పార్టీ ప్రధాన భాగస్వామ్యపక్షంగా ఉన్న ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా మారుస్తామంటూ చేసిన తీర్మానాన్ని విశ్వాసంలోకి తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లను విడదీసి ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా తెలంగాణపై నోరెత్తలేదు. పై పెచ్చు ఆ పార్టీ జాతీయ నాయకుడు ఎల్‌కే అద్వానీ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో భారత ఉప ప్రధానిగా పాల్గొని తెలంగాణ అవసరమే లేదన్నారు. తాము విడదీసిన మూడు రాష్ట్రాలు రాజధానికి చాలా దూరంలో ఉన్నాయని, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశామని, తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి ఇక్కడ విభజన అవసరమే లేదని సొంత భాష్యం చెప్పుకున్నాడు. తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేకపోయామో బీజేపీ రాష్ట్ర నాయకులు కొంతకాలం క్రితం వివరణ ఇచ్చారు. ఎన్‌డీఏలో బీజేపీ తర్వాత ప్రధాన భాగస్వామ్యపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వద్దన్నది కాబట్టే తాము తెలంగాణ ఇవ్వలేదని చెప్పారు. ఆ పార్టీ అధినేత ఒత్తిడి మేరకే అద్వానీ అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. సంకీర్ణ రాజకీయాల్లో పొత్తులు సాధారణం. కానీ సంకీర్ణ రాజకీయాల కోసం విధానాలు మార్చుకునే పార్టీ ప్రజలకు ఏం చేయగలదో ఆత్మ విమర్శ చేసుకోవాలి. పార్టీ అత్యున్నత సమావేశంలో చేసిన తీర్మానాన్ని అధికారంలో ఉన్నప్పుడు భాగస్వామ్య పక్షం మెప్పుకోసం పణంగా పెట్టిన బీజేపీ తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయమే చేసింది. ఆ పార్టీ అగ్రనేత అద్వానీ తెలంగాణ దారుణమైన వ్యాఖ్యలు చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షలపై దెబ్బకొట్టారు. ఆ పార్టీ మళ్లీ అధికారం కోసం కొన్నేళ్లుగా తెలంగాణ జపం చేస్తోంది. గతంలో అధికారం ఇచ్చినప్పుడు కాకినాడ తీర్మానాన్ని విస్మరించిన విషయాన్ని మరుగుపరిచి ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని ఇంతకాలం ప్రచారంతో ఊదరగొట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకొని, ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ పూర్తి చేయాలంటూ యూపీఏ ప్రభుత్వాన్ని కోరడంతో బీజేపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైంది. ఇంతకాలం తెలంగాణను ఎరగా చూపి ఓట్లు దండుకుందామనుకుంటే కాంగ్రెస్ ముందే స్పందించిందే అని డైలమాలో పడింది. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి తెలంగాణపై దారుణమైన వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభ సందర్భంగానూ మోడీ తెలంగాణకు వ్యతిరేక వ్యాఖ్యలే చేశాడు. మొన్నటికి మొన్న అజ్మీర్‌లో నిర్వహించిన పార్టీ ఎన్నికల సభలోనూ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను బాధపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తోందంటూ దారుణంగా మాట్లాడారు. అన్నదమ్ముల్లాంటి తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెట్టి ‘విభజించు పాలించు’ విధానాన్ని అవలంబిస్తోందని ఆ పార్టీపై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇక్కడి ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతారు? తాము తెలంగాణ ఏర్పాటు నిర్ణయంతో విస్తుపోయామనో.., నిర్ఘాంతపోయామనో.. తెలంగాణ ప్రజలెవరైనా మోడీకి చెప్పారా? కాంగ్రెస్ నిర్ణయంతో రాజకీయ అవకాశం లేకుండా పోయిందే అని విస్తుపోయింది, నిర్ఘాంతపోయింది కేవలం బీజేపీ మాత్రమే. తాను ప్రధాని అయ్యేందుకు తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో కొన్నైనా తోడయ్యేవే.. ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయంతో ఉన్నది కాస్త ఊడిందే అనే నిర్వేదం మోడీకి, ఆ పార్టీ నాయకులకు మాత్రమే ఉంది. తమ అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలపై రుద్దడానికి ఆ పార్టీకి ఎవరు అధికారం ఇచ్చారు. అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగువాళ్లను విడదీస్తున్నారని మోడీ ఇప్పుడు ఆవేదన చెందుతున్నారే.. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్న 57 ఏళ్లలో తెలంగాణ ప్రజలను సీమాంధ్రులు ఏ రోజైనా సోదరుల్లా చూశారా? తెలంగాణ భాషను, యాసను, సంస్కృతి, సంప్రదాయాలను తమవి అనుకున్నారా? ఇవేవి తెలియని మోడీ తనకు తెలిసిన కార్పొరేట్ ప్రపంచం కనుసన్నల్లో వాళ్లు చెప్పిన మాటలు నమ్మి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీజేపీకి ఉన్న కొద్దిపాటి బలమూ కోల్పోవడం ఖాయం. అదే సమయంలో సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వల్ల ఆందోళన చెందుతున్నారని మోడీ వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో నాలుగు నెలలుగా ఉద్యమం సాగుతోందని పెట్టుబడిదారుల కు చెందిన మీడియా నిత్యం గగ్గోలు పెడుతోంది. ఏవో చిన్నపాటి ఆందోళనలను పెద్దవి చేసి మెయిన్ పేజీల్లో అచ్చేయడం, టీవీల్లో అవే దృశ్యాలు పదే పదే చూపడం లాంటి కుప్పిగంతులెన్ని వేసినా సీమాంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ విభజనపై అంతగా ఆందోళన చెందిందీ లేదు. సీమాంధ్రలో సాగిన స్పాన్సర్డ్ ఉద్యమానికి తెరపడ్డాక అక్కడి ప్రజలెవరూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయలేదు. మరీ మోడీకి సీమాంధ్ర ప్రజల్లో ఆందోళన ఎక్కడి నుంచి కనిపించిందో అర్థం కాదు. మోడీ ఎన్‌డీఏ హయాంలో చేసిన రాష్ట్రాల విభజన సామరస్యంగా సాగిందని, దానిని ప్రజలు హర్షించారని పేర్కొన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం వెలువడ్డాక తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు మండుతున్నాయని పేర్కొన్నాడు. ప్రజలను బాధపెట్టి ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్నారంటూ కాంగ్రెస్‌పై శాపనార్థాలు పెట్టారు. ఎన్‌డీఏ హయాంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాలు రాజధానికి చాలా దూరంలో ఉన్నాయి. అవే కాదు ఇది వరకు ఏర్పడ్డ ఏ కొత్త రాష్ట్రమూ రాజధానితో సహా విడిపోలేదు. అలాగే విలీనమూ రాజధానితో సహా అయిన రాష్ట్రమూ లేదు. ఈ రెండూ తెలంగాణకే సొంతం. అసలు ఆంధ్రప్రదేశ్ విభజనపై బీజేపీ వైఖరేంటో అర్థం కావడం లేదు. అదే విభజన అధికారమో.. అవకాశమో.. మోడీకి ఉంటే ఆయన ఎలా విభజన చేశావారో? చెప్పినా బాగుండేది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సహా విలీనమైంది. ఇప్పుడు విడిపోయే సమయంలోనూ రాజధానితో సహా విడిపోతుంది. దీనికి పరిష్కారాలేంటో కనుక్కోవాలి. సీమాంధ్ర ప్రజలకు అన్ని హంగులతో కూడిన కొత్త రాజధాని ఏర్పాటుతో పాటు ఇతర సదుపాయాలూ కల్పించాలని కోరాలి. అంతేకాని విభజననే తప్పుబట్టడం సరికాదు. గతంలో ఉమ్మడి బొంబాయి రాష్ట్ర విభజన సమయంలోనూ గుజరాతీలు తమకు ముంబై నగరం కావాలని పట్టుబట్టారు.. ఉమ్మడి మద్రాస్ విభజన సమయంలోనూ సీమాంధ్రులు తమకు మద్రాస్ కావాలని పట్టుబట్టి భంగపడ్డారు. వారే ఇప్పుడు హైదరాబాద్ కావాలని కోరుతున్నారు. తామే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని అబద్ధాలు ఆడేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, తెలంగాణ ఆకాంక్షపై ఎంతమాత్రమూ అవగాహన లేని మోడీ కేవలం రాజకీయం చేసేందుకు విభజనను తప్పుబట్టడం దారుణం. రాజకీయం చేద్దామని ప్రజల ఆకాంక్షకు సొంత భాష్యాలు చెప్తే తెలంగాణ ప్రజల ఆగ్రహం ఎంతలా ఉంటుందో చవి చూడాల్సి వస్తుంది.