తెలంగాణ ప్రజలది విశాల హృదయం
తెలంగాణ సాధన కోసం నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ప్రజాస్వామిక ఉద్యమం లక్ష్య సాధనకు చేరువైంది. మరో రెండు సవాళ్లను అధిగమిస్తే ఆరు దశాబ్దాల ఆకాంక్ష సాకారం అవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పది జిల్లాల ప్రజలు అవిశ్రాంత పోరాటాలు, ఉద్యమాలు చేసినా ఒక్కరోజు సీమాంధ్రుల మాదిరిగా దిగజారి ప్రవర్తించలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గుంటూరుపల్లెలు, హైదరాబాద్ నగరంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న సీమాంధ్ర కాలనీల ఒక్కరోజు కూడా దాడులు జరిగింది లేదు. 1969లో తెలంగాణ మహోద్యమంగా సాగిన సందర్భంలో జరిగిన కొన్ని ఘటనలను సాకుగా చూపి రాజ్యం వందలాది మంది తెలంగాణ యువతను కాల్చి చంపింది. మృతుల సంఖ్యను 369 మందిగా లెక్కచెప్పింది. ఆ తర్వాతి కాలంలోనూ సీమాంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు క్రూరంగా, దుర్మార్గంగా ప్రవర్తించినా, ఉద్యమకారులను వివిధ పేర్లతో పొట్టనబెట్టుకున్నా ఆకాంక్షను మాత్రం వీడలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం భారత సార్వభౌమాధికారానికి లోబడే పోరాటం చేశారు. ఈ ఉద్యమంపై సీమాంధ్ర పెత్తందారుల చేతిలోని మీడియా ఎంతగా విషం కక్కినా లక్ష్యం దిశగా ముందుకు సాగారే తప్ప వారి తీరును పట్టించుకోలేదు. సీమాంధ్ర పెట్టుబడిదారులు, ప్రజాప్రతినిధులు, అక్రమంగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు కొళ్లగొట్టిన వారు మొదట తెలుగుతల్లిని, తెలుగుజాతిని విడదీస్తారా అంటూ ప్రశ్నించినా? తెలుగువారు ఐక్యంగా ఉండాలని కోరినా కేంద్రం తెలంగాణపై ముందడుగు వేయడంతో తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. తమ శ్రమతో హైదరాబాద్‌ను నిర్మించి అభివృద్ధి చేశామని, ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దామని నోటికి వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పుకుపోయారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కోతలకైతే అంతేలేదు. తాను ముఖ్యమంత్రిని కాకముందు హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్ మాత్రమే చూపేవారని, ఇప్పుడు హైటెక్ సిటీని చూపుతున్నారని హైదరాబాద్ చారిత్రక వైభవాన్ని పాతరేసే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్‌లో తామూ నివసిస్తున్నాం కాబట్టి కేంద్ర పాలితప్రాంతంగా మార్చాలని డిమాండ్ మొదలు పెట్టారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)ని చేయాలని కోరి, జవసత్వాలు లేని తెలంగాణ ఇవ్వాలనే పల్లవి ఎత్తుకున్నారు. తమకు దక్కని హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు కూడా దక్కవద్దని వారు చేయని ప్రయత్నం లేదు. చివరి వరకూ ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే తమ గొంతెమ్మ కోర్కెను వీడలేదు. కేంద్ర కేబినెట్ భేటీలోనూ సీమాంధ్ర మంత్రులు ఇదే డిమాండ్‌ను వినిపించారు. చివరికి కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు జీవోఎం సంప్రదింపులు పూర్తి చేసి ఇచ్చిన నివేదికను ఆమోదించారు. అదే ముసాయిదాను శుక్రవారం రాష్ట్రపతి భవన్‌కు పంపారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన జూలై 31 నుంచి కేంద్రం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన అక్టోబర్ మూడో తేదీ, కేబినెట్ జీవోఎం ముసాయిదాను ఆమోదించిన డిసెంబర్ ఐదు వరకు తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర పెత్తందారులు అడుగడుగునా అవాంతరాలు సృష్టించడానికి ప్రయత్నించారు. ఇక తెలంగాణ బిల్లు కేబినెట్ ఆమోదం పొందుతుందనగా రాయలసీమను నిలువునా చీల్చి కర్నూల్, అనంతపురం జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరారు. శ్రీశైలం, శ్రీశైలం ప్రాజెక్టు, మహానంది, అహోబిలం, మంత్రాలయం తెలంగాణకు ఇచ్చేందుకు సిద్ధమని ఇరు జిల్లాల ప్రతినిధులు ప్రతిపాదనలు తెచ్చారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం తమ పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని కోరారు. రెండు జిల్లాలు అధనంగా ఇస్తామన్నా తెలంగాణ ప్రజలు తమకు వద్దే వద్దన్నారు. అంతేకాదు ప్రత్యేక జీవనశైలి, ఆచార వ్యవహారాలు, వేష భాషలున్న రాయలసీమను విడదీయవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులేవి రాయలసీమ ప్రజలు ఎదుర్కోవద్దని, అది తమకు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఆంక్షలు లేని హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ మాత్రమే కావాలని కోరారు. సీమాంధ్రులు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునే వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటానికి తమకేమి అభ్యంతరం లేదని చెప్పారు. హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న సీమాంధ్రులు ఇక్కడే ఉండొచ్చని, వారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చని, మిగతా రాష్ట్రాల వారు ఎలా జీవనం సాగిస్తున్నారో మీరు అలాగే ఉండవచ్చని సూచించారు. తెలంగాణ ప్రజలు ఇంత విశాల దృక్పథంతో ఉంటే సీమాంధ్రులు మాత్రం హైదరాబాద్ తెలంగాణకు దక్కనే వద్దని కుట్రలు చేశారు. తాము అక్రమంగా కొళ్లగొట్టిన ఆస్తులను ఎళ్లకాలం అనుభవించేందుకు తెలంగాణ ప్రజలకు కాసింత నీడ కూడా దొరకకుండా చేయాలని యత్నించారు. తెలంగాణ ఆకాంక్షపై అడుగడుగునా విషం చిమ్మిన సీమాంధ్రులకు, రెండు జిల్లాలు అధనంగా ఇస్తామని చెప్పినా వద్దన్న తెలంగాణ ప్రజలకు ఎంతో వ్యత్యాసం. తెలంగాణ ప్రజల విశాల హృదయానికి నిలువెత్తు నిదర్శనం.