బాబూ! నిప్పుతొక్కిన కోతిలా… ఏమిటా చిందులు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపిస్తుందా? రాష్ట్రపతి 40 రోజుల గడువిచ్చినా ప్రత్యేక విమానంలో బిల్లు పంపాల్సిన అవసరమేంటి? తెలంగాణపై వేసిన శ్రీకృష్ణ కమిటీని, ఆంటోనీ కమిటీని, ప్రణబ్‌ముఖర్జీ కమిటీని, రోశయ్య కమిటీని ఏం చేశారు? ఆ కమిటీ సూచనలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? తెలంగాణపై రాజకీయ లబ్ధికోసం ఉన్నట్టుండి నిర్ణయం తీసుకుంటారా? తెలుగు ప్రజలతో ఆడుకుంటారా? మాతో మాట్లాడరా? అంటూ నిప్పుతొక్కిన కోతిలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతి చర్యపైనే చంద్రబాబు ఇంతేస్థాయిలో లేస్తున్నాడు. తెలంగాణ ఇచ్చి తెలుగుజాతిని విచ్ఛిన్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాడు. గురువారం నాటి ఆరోపణల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌పై దుమ్మెత్తిపోశాడు. సొంత రాష్ట్రంలో పార్టీని గెలుపించుకోలేని వాడు ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తాడా అంటూ మండిపడ్డాడు. మేం చేయాలో అదే చేస్తాం.. చేసి చూపిస్తాం అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. చంద్రబాబు నిప్పు తొక్కిన కోతిలా చిందులు వేయడానికి కారణమేంటి? ఎవరినడిగి, ఎవరితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తున్నారని ఎందుకంత ఎత్తు ఎగెరెగిరి పడుతున్నాడు? తెలుగుజాతి మధ్య చిచ్చుపెడుతున్నారని.. తెలుగుతల్లిని విడదీస్తున్నారని.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి పుట్టగతులుండవని ఎందుకంతలా శాపనార్థాలు పెడుతున్నాడు? చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న తీరును చూస్తే ఈయనేనా రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లపాటు పాలించింది? ఇంత పరిణతి లేని వ్యక్తినా ఆయన చెప్తున్న తెలుగు ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది అన్న సందేహాలు తలెత్తక మానవు. తెలంగాణపై ఎవరిని పిలిచి మాట్లాడరని కేంద్రాన్ని, కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నిస్తున్న చంద్రబాబునాయుడు 2009 డిసెంబర్‌ నుంచి 2012 డిసెంబర్‌ వరకు ఏం మాట్లాడాడో.. ఏం ఏం చేశాడో తెలియదా? లేక మర్చిపోయాడా? ప్రతిసారి హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశాను.. ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దానని సొంత బాకా ఊదుకునే చంద్రబాబు అసలు హైదరాబాద్‌ను ఏం అభివృద్ధి చేశాడో చెప్పగలడా? రాజీవ్‌గాంధీ ప్రధానిగా సమయంలో దేశంలో మొగ్గతొడిగిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక చిగురించి మొగ్గతొడిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్నట్లుగానే హైదరాబాద్‌లోనూ చెందింది. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మినహా చంద్రబాబు చేసిందేమిటో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ సొంతగా కంప్యూటర్‌ ఆన్‌ చేయడం కూడా చేతగాని చంద్రబాబు ఐటీని తానే కనుగొనన్నట్లుగా బిల్డప్‌ ఇస్తుంటాడు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాలన్నీ వేగంగా అభివృద్ధి చెందడం మొదలైంది. ప్రపంచబ్యాంకు నిధులతో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఫ్లైవోవర్లు, ఐటీ హబ్‌లు నిర్మించారు. తాను హైటెక్‌సిటీ నిర్మించడం ద్వారా సంపదన సృష్టించానని చంద్రబాబు చెప్తుంటాడు. హైటెక్‌సిటీ వల్ల ఐటీ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ బాబు ఐటీ, కంప్యూటర్‌సైన్స్‌ మినహా మిగతావేవి చదువులేకాదన్నట్టుగా ఇచ్చిన బిల్డప్‌, చేసిన ప్రచారంతో విద్యార్థులు ఆయా కోర్సుల కోసం ఎగబడ్డారు. ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు కళాశాలలకు అనుమతులివ్వడంతో నైపుణ్యమున్న అధ్యాపకులు దొరకక వారి చదువులు ఎందుకు కొరగాకుండా పోయాయి. ఐటీ, కంప్యూటర్‌సైన్స్‌లో బీటెక్‌ పూర్తిచేసినా, ఎంసీఏ చదివినా ఉద్యోగాలు రాక ఎంతోమంది యువత రోడ్డున పడ్డారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం పరుగులు పెట్టారు. కళాశాలల పెంపుకోసం ప్రైవేటు యాజమాన్యాల దగ్గర అందినకాడికి దండుకొని నిరుద్యోగ భారతాన్ని నిర్మించాడు. ఆయన హైదరాబాద్‌ అభివృద్ధి గురించి మాట్లాడ్డమే కాదు ప్రపంచ శ్రేణి నగరంగా నిలిపానని, అది వరకు హైదరాబాద్‌ అంటే చార్మినార్‌ను మాత్రమే చూపేవారని, ఇప్పుడు హైటెక్‌సిటీని కూడా చూపిస్తున్నారని గొప్పలు చెప్పుకోవడంతో పాటు హైదరాబాద్‌ చారిత్రక, వారసత్వ సంపదను తాను ఎంతగా ధ్వంసం చేశానో స్వయంగా ప్రకటించాడు. తెలంగాణ బిల్లును విమానంలో పపండం బాబుకు ఆగ్రహాన్ని, ఆవేశాన్ని.. ఇంకా ఏమేమో తెప్పించింది. ఎవరిని పిలిచి మాట్లాడారు అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు 2009 డిసెంబర్‌ నుంచి 2012 డిసెంబర్‌ వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తన ప్రతినిధులను పంపిన విషయం విస్మరించాడా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును మీరు ప్రవేశపెడతారా? లేక మమ్మల్నే ప్రైవేటు తీర్మానం పెట్టమంటారా? అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను నిలదీసిన విషయాన్ని విస్మరించాడా? ప్రణబ్‌ కమిటీకి ఇచ్చిన లేఖను, 2012 డిసెంబర్‌ 28న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మరోసారి లేఖ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయాడా? తాను కేంద్రానికి లేఖ రాస్తేనే అఖిలపక్షానికి ఆహ్వానించిందని చెప్పడం గుర్తుకు లేదా? తెలంగాణపై తానో.. తన పార్టీ పక్షాన్నో అసెంబ్లీలో, అఖిలపక్ష సమావేశాల్లో అభిప్రాయాలు వెల్లడించడాన్ని చంద్రబాబు మర్చిపోయాడంటే ఆయనకు మతిమరుపు రోగమేమన్నా ఉందా? అలాంటి రోగిష్టోడు నడిపే పార్టీతో ప్రజలకు రక్షణ ఉంటుందా? ఆ రోగిష్టోడి అడుగులకు మడుగులొత్తే ఎర్రబెల్లి, మోత్కుపల్లి లాంటి వారిని తెలంగాణ సమాజం ఎందుకు క్షమించాలి? ఎవరిని పిలిచి మాట్లాడరని ఇప్పుడు బాబు గుడ్లురుముతున్న బాబు మంత్రుల బృందానికి ఎందుకు అభిప్రాయం చెప్పలేదు? జేఏసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు? తెలంగాణ ఏర్పాటు అనివార్యం అని తెలిసినా ప్రధాన ప్రతిపక్ష నేతగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సింది పోయి బాధ్యతల నుంచి పారిపోయి ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడవడంలో ఆంతర్యమేమిటీ? తాను ఎన్ని అడ్డుపుల్లలు వేసినా తెలంగాణ ఆగడం లేదనే అక్కసుతో నోరుపారేసుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం. సీమాంధ్ర పెత్తందారులు, దొంగతనంగా ఉద్యోగాలు సాధించుకున్న వారి హక్కులే బాబుకు ముఖ్యమైతే అదే విషయం చెప్పి ప్రజాక్షేత్రంలోకి రావాలి.