గడువులోపే ఎన్నికలు

5 నుంచి 7 విడతల్లో పోలింగ్‌
జూన్‌ ఒకటికి 16వ లోక్‌సభ : ఈసీ సంపత్‌
వాషింగ్టన్‌, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) :
గడువులోపే పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వీఎస్‌ సంపత్‌ తెలిపారు. జూన్‌ 1వ తేదీకల్లా కొత్త లోక్‌సభ కొలువు తీరనుందని ఆయన పేర్కొన్నారు. ఐదు లేదా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. అమెరికా వాషింగ్టన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్నికలపై వివరాలు వెల్లడించారు. వచ్చే మార్చి మధ్యంతరంలో ఎన్నికల పక్రియ ప్రారంభం అవుతుందన్నారు. తొలి విడత పోలింగ్‌కు ఆరు వారాల ముందు నుంచే ఎన్నికల షెడ్యూల్‌ మొదలవుతుందని సంపత్‌ తెలిపారు. మొదటి విడత పోలింగ్‌కు మూడు వారాల ముందు నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని సంపత్‌ పేర్కొన్నారు. భారత్‌లో సాధారణ ఎన్నికల ప్రణాళికపై సంపత్‌ అమెరికాలో స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది 5 నుంచి 7 విడతల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్‌ 1 నాటికి 16వ లోక్‌సభ కొలువుదీరుతుందని స్పష్టం చేశారు. ఇందుకోసం 80కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని అన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ చురుకుగా సాగుతుందన్నారు. వచ్చే నెలనాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోందని, ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నామని అన్నారు. ఈవీఎంలను ఇందుకోసం ఉపయోగిస్తామని చెప్పారు.