అవినీతిపై పోరుకు లోక్‌పాల్ ముందడుగు
విపక్షాలు సహకరించాలని రాహుల్ వినతి
న్యూఢిల్లీ, డిసెంబర్ 14 (జనంసాక్షి) :
అవినీతిపై పోరుకు లోక్‌పాల్‌తో ముందడుగు వేద్దామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. లోక్‌పాల్ బిల్లు తెచ్చేందుకు అన్ని పార్టీలు కలిసిరావాలని ఆయన కోరారు. బిల్లుకు కాంగ్రెస్ చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు. లోక్‌పాల్ బిల్లు విషయంలో గెలుపు, ఓటముల ప్రస్తావన లేదని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ అన్నారు. జాతి ప్రయోజనాల కోసం ఈ బిల్లు తేవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ భావిస్తోందని చెప్పారు. లోక్‌పాల్ బిల్లు తీసుకు రావడానికి కాంగ్రెస్ నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాడేందుకు లోక్‌పాల్ బలమైన అస్త్రమని.. ఈ బిల్లు ఇప్పుడు తెరపైకి తేవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒత్తిడి కారణం కాదని తెలిపారు. లోక్‌పాల్ బిల్లే అన్నింటిని పరిష్కరించకపోయినా.. ఓ ముందడుగు అవుతుందని పేర్కొన్నారు.బిజెపి సహా అన్ని పార్టీలు లోక్‌పాల్ బిల్లుకు మద్దతు ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన ఢిల్లీలో విూడియా సమావేశంలో చెప్పారు. పార్టీలు లేవనెత్తిన అంశాలు బిల్లులో పొందుపరిచినట్లు వెల్లడించారు. ప్రస్తుత లోక్‌పాల్ బిల్లుకు అవసరమైనన్ని అధికారులు ఉన్నాయని తెలిపారు. అన్నా దీక్షతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వీలైనంత త్వరగా అంటే ఈ సమావేశాల్లోనే లోక్‌పాల్ బిల్లు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత ఐదు రోజులుగా అన్నా తన స్వగ్రామం రాలేగాంవ్ సిద్దిలో దీక్షకు దిగారు. ఆయన బరనువు తగ్గారని డాక్టర్లు చెప్పారు. ఈ దశలో బిల్లు త్వరగా తీసుకుని రావాలని ఇప్పటికే బిజెపి నేత సుష్మాస్వరాజ్ కూడా డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఇప్పటికే మంత్రి నారాయణస్వామి బిల్లును శుక్రవారం ప్రవేశ పెట్టారు.