ముసాయిదాపై చర్చ కొనసాగించాలి అధ్యక్ష స్థానాన్ని గౌరవించాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా బిల్లుపై సోమవారం శాసనసభలో చర్చ మొదలైంది. స్పీకర్‌ స్థానంలో డెప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క తెలంగాణపై చర్చను ప్రారంభించారు. ఉదయం పది గంటలకే శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, శాసనమండలిలో చైర్మన్‌ చక్రపాణి రాష్ట్రపతి నుంచి అందిన ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సీమాంధ్రులు ఉభయ సభల్లో, వెలుపల హైడ్రామా సృష్టించారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి చివరి ప్రయత్నాలన్నీ చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోజూశారు. తెలంగాణ ఏర్పడముందే తమ పరిస్థితి ఇలాఉంటే తెలంగాణ వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులైన తమ పరిస్థితే ఇలా ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో అంతా కలిసి కిష్కిందకాండ సృష్టించారు. ఉభయ సభల ప్రతిష్టను దిగజార్చారు. మంగళవారం శాసనసభ, మండలిలో అలాంటి సీనే రిపీట్‌ అయింది. అయితే ఈసారి సభ సంప్రదాయాలను మంటగలిపే రీతిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరికొందరు నేతలు ప్రయత్నించారు. సోమవారమే శాసనసభలో తెలంగాణపై చర్చ మొదలైనా, అలాంటిదేమీ లేదని సభకు హాజరుకాని కిరణ్‌ చెప్పే ప్రయత్నం చేశారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీమాంధ్ర ఎమ్మెల్యే స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చాంబర్‌లో బైటాయించి ఆయనను బయటికి రాకుండా అడ్డుకున్నారు. తద్వారా రాజ్యాంగాన్ని అవమానించారు. ఈనేపథ్యంలో డెప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్క, స్పీకర్‌ సూచన మేరకు తెలంగాణ ముసాయిదాపై శాసనసభలో చర్చ ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. ఈ సమయంలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఆయనను సైతం అడ్డుకున్నారు. ఒకనొక దశలో దాడికి కూడా యత్నించారు. ఆయన సభలో చర్చ ప్రారంభించిన తర్వాత ముసాయిదా ప్రతులు చించేసి స్పీకర్‌ స్థానంలో ఉన్న భట్టివిక్రమార్కపైకి విసిరారు. స్పీకర్‌ స్థానాన్ని దారుణంగా అవమానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గుర్తెరగకుండా కేవలం తాము అక్రమంగా కూడ బెట్టుకున్న ఆస్తులు ఎక్కడ దక్కకుండా పోతాయోనని ఇంతటి దుర్మార్గానికి తెగబడ్డారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి చట్టసభలో అడుగుపెట్టిన వారంతా ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారు. స్పీకర్‌ స్థానంలో కూర్చున్న భట్టి విక్రమార్క దళితుడు కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి, ఇతర సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్నారా? అధ్యక్ష స్థానంలో కూర్చున్న వ్యక్తికి కులాలు, మతాలు ఆపాదించడం తగున. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి, ఆ స్థానానికి సముచిత గౌరవం ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పీకర్‌ స్థానాన్ని తక్కువ చేసేలా మాట్లాడారు. సభలో చర్చ ఎక్కడ మొదలైంది.. బీఏసీ తర్వాత కదా మొదలయ్యేది అంటూ తెలంగాణ మంత్రులను ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదాపై చర్చకు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు చర్చకు స్పీకర్‌ సమయం కేటాయించారు. ఒకవేళ మూడు రోజుల్లోగా చర్చ పూర్తికాకపోతే తర్వాత మళ్లీ బీఏసీ సమావేశం నిర్వహించి చర్చను కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈలెక్కన బుధవారం ఉదయాన్నే డెప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్క ప్రారంభించిన తెలంగాణ చర్చను కొనసాగించాలి. అదే సంప్రదాయం. అదే స్పీకర్‌ స్థానానికి ఇచ్చే గౌరవం. అలా కాకుండా బుధవారం ఉదయం మళ్లీ కొత్తగా చర్చ ప్రారంభిస్తే అది స్పీకర్‌ స్థానాన్ని దారుణంగా అవమానించనట్టే. సీమాంధ్ర నేతలు సభలో తెలంగాణపై తమ అభిప్రాయం చెప్పడమే కాదు. సీమాంధ్ర ప్రాంతానికి ఏం కావాలో కూడా అడగవచ్చు. అక్కడి ప్రజలకు న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులపై చర్చ సందర్భంగా సభలో మాట్లాడవచ్చు. ఆయా డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదించవచ్చు. అలా కాకుండా విభజన వేళ అందుకు విరుద్ధంగా, తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడానికే సమయం కేటాయిస్తే సీమాంధ్ర ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసిన వారవుతారు. అది వారి హక్కులను హరించడం, గొంతులను నులిమేయడమే అవుతుంది. ప్రజాప్రతినిధులుగా వారిని ఎన్నుకొని చట్ట సభలకు పంపిన ప్రజల హక్కులను పట్టించుకోని నేతలు, విభజన సమయంలో రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించడం ద్వారా సాధించేదేమీ ఉండబోదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సహా మిగతా నేతలు గుర్తిస్తే మంచిది. వాళ్లు అరిచి గీ పెట్టిన తెలంగాణ ఏర్పాటు ఆగబోదు. ఇంకా మొండిపట్టు పట్టి విలువైన సమయాన్ని వృథా చేస్తే వారిని చరిత్ర క్షమించదు. సీమాంధ్ర ప్రజలు క్షమించరు. ఇది గుర్తించి తెలంగాణపై చర్చ సందర్భంగా నడుచుకుంటే అందరికీ మంచిది.