హైదరాబాద్ ఆంక్షలపై అభ్యంతరాలు చెప్పాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ తర్వాత పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా కేంద్రం నగరంపై కొర్రీలు పెట్టింది. ప్రజాస్వామిక ప్రభుత్వం మనుగడలో ఉండగా నిర్దిష్ట భూభాగంపై గవర్నర్ అజమాయిషీ అంటే తెలంగాణ ప్రజలను ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించడమే. తద్వారా తెలంగాణ ప్రజలపై కేంద్రానికి నమ్మకం లేదనే విపరీత అభిప్రాయం ప్రచారంలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది. హైదరాబాద్ ఆంక్షలెందుకంటే ఇక్కడ నివసించే సీమాంధ్రుల కోసమని చెప్పడం మరీ దారుణం. హైదరాబాద్‌లో ఒక్క సీమాంధ్రులు మాత్రమే జీవించడం లేదు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచీ, హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉన్నప్పుడే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారు హైదరాబాద్ జీవనశైలిని అలవర్చుకొని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఇక్కడ జరిగే ఉత్సవాలు, పండుగలు పబ్బాల్లో భాగస్వాములవుతున్నారు. తాము హైదరాబాదీలమని గర్వంగా చెప్పుకుంటున్నారు. వందలాది ఏళ్ల నుంచి పంజాబీలు, మార్వాడీలు, కన్నడీగులు, బెంగాళీలు, బిహారీలు, కేరళీయులు హైదరాబాద్‌లో జీవిస్తున్నారు. తమ సంప్రదాయాలను పాటిస్తూనే, సంస్కృతిని పరిరక్షించుకుంటూనే హైదరాబాద్ జీవనశైలిని పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 58 ఏళ్లు గడిచినా ఇక్కడికి వలస వచ్చిన సీమాంధ్రులు హైదరాబాద్ లైఫ్‌స్టైల్‌కు చేరువ కాలేదు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు సైతం తాము హైదరాబాదీలమని ఏ ఒక్కరోజు అనుకోలేదు. హైదరాబాదీలు జరుపుకునే పండుగలు, పబ్బాల్లో వారు కానరారు. తమ ప్రాంతానికి చెందిన పండుగలు జరుపుకోవడం మినహా తెలంగాణ, హైదరాబాద్ కు చెందిన ఒక్క పండుగలోనూ వారు పాలుపంచుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ మలి దశ ఉద్యమం మొదలైన 2000 సంవత్సరం తర్వాత కొందరు మహంకాలి అమ్మవారి బోనాల్లో భాగస్వాములవుతున్నారు తప్ప అదికూడా మనస్ఫూర్తిగా కాదు. హైదరాబాద్‌లో ఆస్తులు కూడబెట్టుకొని, వ్యాపారాలు చేసి సంపాదించుకున్న వారంతా తాము సీమాంధ్రులమేనని దృఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే తెలంగాణ, హైదరాబాద్ జీవనశైలితో మమేకం కాలేకపోయారు. హైదరాబాదీలకు, ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రులకు మధ్య వ్యత్యాసం ప్రస్ఫుటం. హైదరాబాద్ ప్రజలతో మమేకం కాలేకపోయిన వారి రక్షణ కోసమంటూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి భద్రతను గవర్నర్ చేతుల్లో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013లో పొందుపరిచారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసించే ప్రజల ప్రాణ, ఆస్తి, స్వేచ్ఛ, భద్రతలను కాపాడే బాధ్యతను ప్రత్యేకంగా గవర్నర్‌కు కట్టబెట్టారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలక ప్రాంతాలు, సంస్థల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ బాధ్యతలకు గవర్నర్‌కు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిని సంప్రదించిన తర్వాత గవర్నర్ తనకు న్యాయమని తోచిన నిర్ణయం తీసుకోవచ్చని ముసాయిదాలో పేర్కొన్నారు. అయితే ఇందులో గవర్నర్‌కు విచక్షణ అధికారాలు కట్టబెట్టారు. వాటిని ప్రశ్నించే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి కాని, తెలంగాణ ప్రజలకు కాని ఉండదు. కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు సలహాదారులు ఉమ్మడి రాజధానికి సంబంధించిన కీలక వ్యవహరాల్లో గవర్నర్‌కు సహాయ సహకారాలు అందిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత గవర్నర్ చేతిలో పెడితే తెలంగాణ ప్రభుత్వం ఉండి ప్రయోజనం ఏమిటి? గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు గవర్నర్‌కు అప్పగించడంలో కేంద్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వాలని అనుకుంది. తెలంగాణ ప్రజలు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి. హైదరాబాదీలు, తెలంగాణ ప్రజలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, పలు దేశాల్లో జీవనం సాగిస్తున్నారు. వీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి వీరి కోసం ప్రత్యేకంగా భద్రత చర్యలు తీసుకోవాలా? సీమాంధ్రులు కూడా బెంగళూర్, చెన్నై తదితర నగరాల్లో జీవనం సాగిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత గవర్నర్లకే అప్పగించారా? ఒక్క హైదరాబాద్ విషయంలోనే సీమాంధ్రులు ఎందుకు ఇంతలా పట్టుబడుతున్నారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామన్నది నిజమైతే ఇంతగా బెంబేలెత్తిపోవడం ఎందుకు? హైదరాబాద్‌కు పొట్టచేతబట్టుకొని వచ్చిన సామాన్యులను వెళ్లిపోమనే నీచత్వానికి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ దిగజారరు. హైదరాబాద్‌ను కొళ్లగొట్టిన పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు, అక్రమంగా ఇక్కడి ఉద్యోగాలు దక్కించుకున్న వారు ఎట్టిపరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ను వీడాల్సిందేనని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. ఈ దోపిడీదారులకు దశాబ్దం పాటు రక్షణ కల్పిస్తూ కేంద్రం గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టింది. ఈమధ్య కాలంలో వారు కొళ్లగొట్టిన తెలంగాణ సంపద వారి హస్తగతమయ్యేలా పన్నిన కుట్రలో కేంద్రం ముమ్మాటికీ భాగస్వామి అయింది. ఈ ఆంక్షలపై తెలంగాణ ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ముసాయిదాపై చర్చలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌పై ఆంక్షలు తొలగించేలా ఒత్తిడి చేయాలి. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఐక్యంగా హైదరాబాద్‌లో ప్రజాస్వామిక పాలన సాగేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలి. ప్రజా ఉద్యమాలతోనే హైదరాబాద్‌పై పెట్టిన కొర్రీలు తొలగించడం సాధ్యం. ఈమేరకు ప్రజలంతా పోరాటానికి సన్నద్ధం కావాలి.