ఆది నుంచి అమెరికాది ఇదే తీరు

అంగ బలం.. అర్థ బలం.. పై పెచ్చు ప్రపంచ పెద్దన్న హోదా. ఈ పెద్దన్న ప్రాపకం కోసం చేతులు కట్టుకొని మరీ దేబిరించే బోలెడు దేశాలు. తమ మాట వినని వారిపై ఏదో సాకుతో యుద్ధ విమానాలతో దండెత్తే బండతనం. అంతర్జాతీయ చట్టాలు ఈ పెద్దన్నకు చుట్టాలు. ప్రపంచ ప్రగతికోసమో, వెనుకబడిన దేశాల ఆర్థికాభివృద్ధి కోసమో అంటూ ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌లాంటివి అప్పులిస్తామంటూ ఆఫర్ల మీద ఆఫర్లివ్వడం పెద్దన్న టంకశాలను నింపడానికే. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్న అమెరికా జాతి వివక్షకు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తోంది. తాము తెల్లవాళ్లం అన్న అహంకారాన్ని అణువణువునా ప్రదర్శిస్తోంది. సభ్యత, సంస్కారం మరిచి ప్రవర్తిస్తోంది. తన దగ్గర మూలుగుతున్న ధన రాశుల కోసమో, ఆయుధ సంపత్తి కోసం అన్ని దేశాలు తమ అడుగులకు మడుగులొత్తాల్సిందేనన్న అహంకారంతో దౌత్యవేత్తలను కూడా అవమానిస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాలను సైతం తనకు లెక్కకాదని బీరాలు పలుకుతోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో డెప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా పనిచేస్తున్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి దేవయాని ఖోబ్రగదే అరెస్టుతో అమెరికా తన ద్వంద్వ విధానాలను మరోసారి చాటిచెప్పింది. పిల్లలను స్కూల్‌ దగ్గర దింపడానికి వెళ్లిన దేవయానిని అమెరికా పోలీసులు అత్యంత అవమానకరంగా అరెస్టు చేశారు. చేతులకు బేడీలు వేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె దుస్తులు తొలగించి ఒళ్లంతా తడిమి విచారణ పేరుతో విసిగించారు. తాను న్యూయార్క్‌లో భారత దౌత్యవేత్తనని తెలిపినా, ఏడ్చిమొత్తుకున్నా పోలీసులు తమ దుర్మార్గ ప్రవర్తనను మాత్రం మానుకోలేదు. అంతటితో అమెరికా పోలీసులు తమ దుర్మార్గాన్ని మాత్రం ఆపలేదు. మాదకద్రవ్యాలు తీసుకునే వారు, విక్రయించే వారు, వ్యభిచారం చేసే వారితో కలిపి దేవయానికి ఉంచారు. అంతేకాదు ఆమె నుంచి డీఎన్‌ఏ నమూనాలు కూడా తీసుకున్నారు. అసలు డీఎన్‌ఏ నమూనాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో.. ఎందుకోసం డీఎన్‌ఏ నమూనాలు తీసుకున్నారో ఆ దేశ పోలీసులకే తెలియాలి. భారత్‌కు అమెరికా నుంచి ప్రతి ఒక్కరిని ఎంతో సాధరంగా ఆహ్వానిస్తాం. వారికి మర్యాదలు చేస్తాం. దౌత్యవేత్తలకు మన దేశంలో మంచి గౌరవ మర్యాదలు కల్పిస్తాం. అమెరికా నుంచి తెచ్చుకున్న కుక్కపిల్లకూ గౌరవమిచ్చే గొప్ప మనసు భారతీయులది. కానీ అమెరికన్లు మాత్రం ధన మదంతో లెక్కలేనితంగా వ్యవహరిస్తున్నారు. దౌత్యవేత్తకు ఇవ్వాల్సిన మార్యదను మరిచి దేవయాని పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఒక్క దేవయాని పట్లనే కాదు ఎందరో భారతీయ ప్రముఖుల పట్ల అమెరికన్లు ఇంతే దారుణంగా ప్రవర్తించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాంను సైతం తనిఖీల పేరుతో అవమానపరిచారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి, రక్షణ మంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లిన జార్జి ఫిర్నాండేజ్‌, మాజీ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణాలను అమెరికా తనిఖీల పేరుతో తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అతి దారుణంగా అవమానించింది. ప్రముఖ నటులు షారూఖ్‌ఖాన్‌, కమల్‌హాసన్‌ కూడా ఆధిపత్య ధోరణికి బలైనవారే. పలు సందర్భాల్లో వీరిని అమెరికా తనిఖీల పేరుతో ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి ఎదురు చూసేలా చేసింది. ఎవరైనా తప్పు చేస్తే జరిగిన పొరపాటుకు చింతిస్తారు. క్షమాపణలు చెప్తారు. కానీ అమెరికా ఇసుమంతై దోష భావం కానరాదు. తప్పు చేసినా తాము చెసిందే కరెక్ట్‌ అనే ధోరణిలో వ్యవహరిస్తుంది. చట్టాలకు లోబడే అలా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పుకుంటుంది. తన విపరీత ధోరణి వల్ల ప్రపంచ దేశాల ప్రజలు ఎంతగా ఇబ్బంది కలిగించినా కనీసం విచారం వ్యక్తం చేయదు. క్షమాపణ చెప్పమంటే ససేమిరా అంటూ మొండికేస్తుంది. దేవయాని వ్యవహారంలోనూ అలాంటి దుర్మార్గ ధోరణే అగ్రరాజ్యం అవలంబిస్తోంది. దేవయాని దౌత్య పరమైన విషయాల్లో కాకుండా సహాయకురాలికి నిబంధనల ప్రకారం వేతనం చెల్లించలేదు కాబట్టి ఆమెకు వియన్నా ఒప్పందానికి రక్షణలు కల్పించలేమని, అందులోని అంశాలు దేవయానికి వర్తించబోవని మొండిగా వాధిస్తోంది. అమెరికాలో కనీస వేతన చట్టం ప్రకారం 4500 డాలర్ల వేతనం ఇంట్లో పనిచేసే సహాయకురాలికి దేవయాని చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం చెల్లించడం లేదని ఆమెరికా ఆరోపించింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి దేవయాని డెప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా పనిచేస్తున్నందుకు ఆమెకు భారత ప్రభుత్వం ఇచ్చే వేతనమే 4,120 డాలర్లు. ఆమె వేతనం కంటే 380 డాలర్ల అధనపు వేతనం సహాయకురాలికి దేవయానికి చెల్లించి ఉండాల్సింది అనేది అమెరికా వాదన. ఆ దేశ కనీస వేతన చట్టం ప్రకారం చెల్లించాల్సిన కనిష్ట వేతనం 4,500 డాలర్లు ఇచ్చి తీరాలని అమెరికా అంటోంది. కనీస వేతన చట్టం అమలు చేయవద్దని ఎవరూ కోరరు. కానీ అమెరికాకు చెందిన సంస్థల్లో పనిచేస్తున్న వివిధ దేశాల వారికి కనీస వేతన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారా? అమెరికా సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కనీస వేతన చట్టం కల్పించని వారు, సంస్థలు కోకొళ్లలుగా ఉండగా ఒక్క భారత దౌత్యవేత్త పట్లనే ఇంత దుర్మార్గంగా వ్యవహరించడానికి కారణం ఆ దేశానికి భారతీయుల పట్ల ఉన్న ద్వేషభావమే కారణం. అమెరికా మొదటి నుంచి నల్లజాతీయులపై ఇదే దుర్మార్గ వైఖరి అవలంబిస్తోంది. మనం రాచ మర్యాదలు చేసినా మనవాళ్లను కనీసం మనుషులుగా చూడని నీచ స్వభావం అగ్రరాజ్యానిది. దౌత్య వేత్తకు ఇవ్వాల్సిన మర్యాదనే ఇవ్వని అగ్రరాజ్యం ఇక అక్కడ నివసించే మన దేశ ప్రజల పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా నిరసన తెలపడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిని కల్పించింది ఎవరు? ప్రజల దృక్పథంలో మార్పు రావాలి. పెద్దన్నకు రాచ మర్యాదలు చేసే పాలకులను నిలదీయాలి. అగ్రరాజ్యం అడుగులకు మడుగులొత్తే చర్యలకు పాలకులూ స్వస్తి పలకాలి. ఇలాంటి చర్యలపై ఘాటుగానే స్పందించాలి.