అవినీతి నియంత్రణకు ఇదే దూకుడు కొనసాగించాలి

ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతం ఏ రంగంలో ప్రగతి సాధించిందో లేదో కాని అవినీతిలో మాత్రం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తనకు మాత్రమే సాధ్యమయ్యే సరికొత్త రికార్డులను కూడా నెలకొల్పింది. పరిపాలన వ్యవస్థను నడిపే పాలకులు మొదలు వాటిని అమలు చేసే ఉద్యోగుల వరకూ ఇందులో భాగస్వాములే. అక్కడక్కడ చంద్రుడికో నూలుపోగులాగా కొందరు నీతి మంతులు కనిపిస్తుంటారు. వారిని వీరితో కలిపి ఒకే ఘాటన కట్టడం లేదు. కానీ అవినీతికర వ్యవస్థలో వారు భాగమే. స్వతహాగా లంచగొండులు కాదు కాబట్టి అలాంటి వారిని శక్తిహీనులు, దుర్భలులు అని కూడా ఆడిపోసుకునే సమాజం మనది. అవినీతి వేళ్లూనుకుపోయిన వ్యవస్థలో నీతి మంతులుగా బతకడం కూడా పాపమే. అవినీతి, బంధుప్రీతి, లంచగొండి తనమే అధికార కేంద్రాలుగా ఉన్న ప్రస్తుత తరుణంలో నీతివంతమైన సమాజం కోసం వెదుకులాట కూడా మొదలైంది. అవినీతిపరులు సులభంగా తప్పించుకోవడానికి చట్టంలో ఉన్న వెసులుబాట్లతోనే ఇది పరివ్యాప్తమవుతుందనే వాదనా లేకపోలేదు. అవినీతి ఇప్పుడు ఇంత తీవ్రరూపంలో ఉందంటే దాని చేతిలోనే అధికారం కేంద్రీకృతమై ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసే స్థాయికి వెళ్లింది. పాలనా వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతి అధికారయంత్రాంగంలోనూ విస్తరించింది. ఇది ఒకప్పుడు చాలా స్వల్పస్థాయిలో ఉండగా గడిచిన రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగి తానూ గ్లోబలైజేషన్‌ అంత వేగం పుంజుకుంది. సర్కారు కార్యాలయానికి ఏదైనా పనికి వెళ్లడమే పాపమన్నట్లుగా ఉంది పరిస్థితి. అటెండర్‌ మొదలు ఆఫీసర్‌ వరకూ ప్రతి దానికి చేతులు చాచడమే. ఈ లంచాలకు కొందరు అందమైన పేర్లు కూడా పెట్టుకున్నారు. బ్యూరోక్రాట్లు అవినీతికి దూరంగా ఉంటారనేది అపోహగానే మిగిలింది. అన్ని రంగాల్లో ఉన్నట్లు ఇక్కడ కూడా కొద్ది మంది మంచోళ్లున్నారు. కానీ కొందరు ఏకంగా జైలు ఊచలు కూడా లెక్కబెట్టి వచ్చారు. ఇక సాధారణ ఉద్యోగుల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. అధికారి పనిచేసి పెట్టాలంటే ఆయన కింద ఉన్న ఉద్యోగి కోరిన మొత్తాన్ని ఏదో మార్గంలో ముట్టజెప్పుకోవాలి. అదే డబ్బులు కావొచ్చు, వస్తువులు కావొచ్చు..
మాటల్లో చెప్పలేనిది కూడా కావొచ్చు. ప్రతి సమస్యకు పరిష్కారమున్నట్లే ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటుంటుంది. దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్న ప్రస్తుత తరుణంలో ఇది పేట్రేగి పోయింది. ఒకప్పుడు ప్రసారమాధ్యమాలు కుగ్రామం వరకు వెళ్లలేదు కాబట్టి ప్రభుత్వ పథకాలపై ఒకవర్గానికి మాత్రమే అవగాహన ఉండేది. వాళ్లు మాత్రమే దోపిడీ చేసే అవకాశముండేది. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పథకంపై అన్ని వర్గాలకు సంపూర్ణ అవగాహన కలుగుతుంది. కానీ దోపిడీ మాత్రం ఆ ఒక్క వర్గానికి మరో రెండు మూడు వర్గాలు తోడయ్యాయి. ఆ వర్గాలు తోడేళ్లలా మారి సామాన్యులు, నిర్దేశిత వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందకుండా దోచేస్తున్నాయి. ఇది ఒక తరహా అవినీతి అయితే వారికి పనిచేసి పెట్టడానికి లంచాలు మింగుతున్న అధికారవర్గాలు మరో రకం అవినీతి పరులు. ఇక సామాన్య ప్రజలకు పనులు చేసి పెట్టడానికి లంచం తప్పనిసరి చేసిన అవినీతి జలగలు గ్రామ స్థాయి నుంచి ప్రజల రక్తాన్ని పీల్చుకు తాగుతున్నారు. ప్రభుత్వ, పాలనాపరమైన అవినీతిని ఇటీవల లోక్‌సభ ఆమోదించిన లోక్‌పాల్‌ చట్టం ఎంతో కొంత దోహద పడుతుంది. ప్రధానిని ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం ప్రజా విజయమే.
లోక్‌పాల్‌కు పార్లమెంట్‌ ఆమోదం పొందడానికి వెనుక ఎంతో ప్రజా ఉద్యమం ఉంది. మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధికి చెందిన మాజీ సైనికోద్యోగి అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం యావత్‌ భారతాన్ని కదిలించింది. సోషల్‌ మీడియా దీనికి కావాల్సినంత ఊతమిచ్చింది. యువత స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగస్వాములయ్యారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ప్రజా ఆస్తుల్ని రక్షించాల్సిన పాలకులే భక్షకులుగా మారి సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం ఉధృతమైంది. ఆ ఉద్యమంలో అన్నా హజారాతో కలిసి నడిచిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని నెలకొల్పి ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాడు. 70 ఎమ్మెల్యే స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 28 స్థానాలను ఆప్‌ దక్కించుకున్నదంటే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఎంతటి తీర్పునిచ్చారో సుస్పష్టమైంది. ఈనేపథ్యంలో లోక్‌పాల్‌, లోకాయుక్త బిల్లుకు ఉభయ సభలు ఆమోదముద్ర వేశాయి. ఈ బిల్లు ద్వారా ఇంతకాలం పాలకుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన సీబీఐ, ఏసీబీలాంటి సంస్థలకు స్వయం ప్రతిపత్తి సమకూరుతుంది. అంతర్లీనంగా పాలకుల అజమాయిషీ ఉన్నా వాటిపై ఇదివరకు లాగా స్వారీ చేసే అవకాశం మాత్రం ఉండదు. ఇది శుభపరిణామం. దీని ద్వారా పాలన వ్యవస్థలోని అవినీతితో పాటు అధికార, ఉద్యోగ వర్గాల్లోని అవినీతి, లంచగొండితనానికి బ్రేక్‌ వేయొచ్చు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ కీలక భూమిక పోషిస్తోంది. పోరుగడ్డ కరీంనగర్‌లో ఏడాదిలో 50 మంది అవినీతిపరులను లంచాలు తీసుకుంటుండగా పట్టుకుంది.
ఏసీబీకి స్వయం ప్రతిపత్తి రాకముందే అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే ఎంతటి ఫలితాలు సాధించవచ్చో కరీంనగర్‌ అధికారులు చేతల్లో చూపించారు. శనివారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఏడు చెక్‌పోస్టులపై దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో అవినీతి పరులకు ఏసీబీ సింహస్వప్నమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు లంచాలు తీసుకోవాలంటేనే భయపడే స్థాయికి చేరుకున్నారంటే ఏసీబీ తన కర్తవ్య నిర్వహణలో ఎంతటి చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లోనూ ఇదే దూకుడు కొనసాగించాలి. ఈ రోజు కాకపోయిన రేపైనా అవినీతి అంతం సాధ్యమే.