రాజకీయ క్షేత్రంలో సామాన్యుడు
ఆమ్ ఆద్మీ పార్టీ. దేశంలో రిజిస్టర్డ్ అయిన వందలాది పార్టీల్లో ఒకటిగా ఎందరో తేలిగ్గా కొట్టిపారేసిన పార్టీ. మాటలు.. చేతలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పే రాజకీయ నాయకులను చూస్తున్న ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యామ్నాయంగా కనిపించారు. మాటలే కాదు ఇతడితో ఆచరణ సాధ్యమే అనే ప్రజల విశ్వాసాన్ని కేజ్రీవాల్ పొందడం ఒక్క రోజుల్లో జరిగింది కాదు. ఏళ్లకేళ్లు ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఉద్యమ బాటలో ఉన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి కేజ్రీవాల్ చాలా కష్టపడ్డారు. ఆ చట్టం క్షేత్రస్థాయిలో అమలవడానికి ఆయన చాలా కృషి చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్న కేజ్రీవాల్ సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. మొదట టాటా స్టీల్‌లో పనిచేసిన ఆయన 1995లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. ఐఆర్ఎస్ అధికారిణి సునీతాను వివాహమాడాడు. 1999లో ఢిల్లీలో పరివర్తన్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో కేజ్రీవాల్ ఒకరు. ఆదాయపన్ను శాఖలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తూ ఐఆర్ఎస్కు రాజీనామా చేశారు. 1995లో కేజ్రీవాల్ ఐఆర్ఎస్కు ఎంపికైనా మధ్యలో ఎక్కువ కాలంలో ఆయన సెలవు తీసుకున్నారు. 2006లో ఐఆర్‌ఎస్‌ను వీడే సరికి ఆయన కనీసం మూడేళ్లు కూడా ఉద్యోగం చేయలేదు. దీంతో అతడిపై కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయగా, నిర్ణీత కాల వ్యవధి కంటే ముందే ఐఆర్ఎస్కు రాజీనామా చేసినందుకు స్నేహితుల వద్ద అప్పులు చేసి కేంద్రానికి శిక్షణ కోసం ఖర్చు చేసిన మొత్తం చెల్లించాడు. దేశంలో వేల్లూనుకుపోయిన అవినీతి అంతానికి అన్నాహజారేతో కలిసి అతినీతి వ్యతిరేక ఉద్యమం నడిపిన వారిలో కేజ్రీవాల్ ముఖ్యుడు. ఉద్యోగుల అవినీతే కాదు పాలకుల అవినీతిని అంతమొందించడానికి జన్ లోక్‌పాల్ చట్టం కోసం తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని నడిపించారు. ఈ ఉద్యమం దేశవ్యాప్తమయ్యేందుకు సోషల్ మీడియాను కేజ్రీవాల్ విరివిగా వినియోగించుకున్నారు. ఈక్రమంలో అన్నాతో విభేదించారు కూడా. అనంతరం 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ అధోగతి పాలైందని, అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపిస్తూ పాలకపక్షానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ఉద్యమంలోనూ సామాన్యులను, యువతను భాగస్వాములను చేశారు. ఇక్కడా సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకొని నెటిజన్ల ఓట్లను పదిల పరుచుకున్నారు. కాంగ్రెస్ అవినీతిని ఊడ్చేస్థానని పార్టీ గుర్తుగా చీపురుకట్టను ఎంచుకున్నారు. పార్టీ పెట్టిన 13 నెలల అనంతరం జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్ అరుదైన విజయం సొంతం చేసుకున్నారు. అది కేజ్రీవాల్ ప్రజల్లో కల్పించిన నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక. 70 ఎమ్మెల్యే స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు దక్కించుకుంది. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను 26 వేల భారీ మెజార్టీతో ఓడించారు. బీజేపీ ఈ ఎన్నికల్లో 31 స్థానాలు సాధించగా, కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు రాకపోవడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మొదట బీజేపీ శాసనసభ పక్షనేత హర్షవర్దన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. తమకు మెజార్టీ లేనందున ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ కూడా అదే సమాధనమివ్వడంతో రాష్ట్రపతి పాలన కోసం లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి పాలన కోసం నివేదించారు. ఏ పార్టీకి మద్దతివ్వబోమని, ఏ పార్టీ మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని మొదట ప్రకటించిన కేజ్రీవాల్ తర్వాత ప్రజాభిప్రాయం కోసం సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తద్వార ఢిల్లీ పీటాన్ని ఓ సామాన్యుడు అధిరోహించబోతున్నాడు. 13 నెలల క్రితం ఓ సాధారణ పౌరుడు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ అధికారపక్షంగా అవతరించబోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడ్డ కేజ్రీవాల్ ఢిల్లీ పోలీసులు కల్పిస్తామన్న జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను తిరస్కరించాడు. అంతేకాదు ప్రభుత్వ పరంగా అందించే అధికారిక నివాసమూ వద్దన్నాడు. తాను సామాన్యుడినని, ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా సామాన్యుడిలానే ఉంటానని కేజ్రీవాల్ పేర్కొన్నాడు. కాంగ్రెస్ అవినీతిని ఊడ్చేస్తానన్న కేజ్రీవాల్ ఇప్పుడు ఆ అవినీతి పార్టీ మద్దతుతోనే గద్దెనెక్కడం ప్రజలను మోసగించడమేననే ఆరోపణలు జోరందుకున్నాయి. రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా, ఆరు నెలల వ్యవధిలో ఢిల్లీ ప్రజలు మళ్లీ ఎన్నికలు ఎదుర్కొనే అఘత్యాన్ని కేజ్రీవాల్ తప్పించారు. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని లౌకికవాద పార్టీ అండతో ఏర్పాటు చేయబోతున్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా సామాన్యుడిలాగే ఉంటానని అలనాటి కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్యను గుర్తు చేశారు. రాజకీయాల్లో రావడంతోనే కోట్లు పోగేసుకుందామనుకుంటున్న నేతలకు భిన్నంగా అవినీతి వ్యతిరేక ఎజెండాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తనతో ఉద్యమంలో కలిసి నడిచిన విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులకు మంత్రివర్గంలో చోటివ్వబోతున్నట్లు ప్రకటించాడు. తాను అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తామని చెప్తున్నాడు. మెజార్టీ లేనందున ఇది రాజకీయంగా కాస్త ప్రతిబంధకమే కావొచ్చు. విద్యుత్ బిల్లులు 50 శాతం తగ్గిస్తామని, ప్రతి ఇంటికీ ఉచితంగా 700 లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తామని, కొత్తగా 500 పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, నగరంలో రెండు లక్షల కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తామని, వాటిలో సగం మహిళలకే కేటాయిస్తామని, అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరిస్తామని, యుమునా నదిని శుద్ధి చేస్తామని, వృద్ధులు, మహిళలు, పిల్లల భద్రత కోసం ‘పౌర భద్రతాదళం’ ఏర్పాటు చేస్తామని, ఏడాదికి రెండు పర్యాయాలు ఆటో చార్జీలు సవరిస్తామని, మొహల్లా సభలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని కేజ్రీవాల్ హామీలిచ్చారు. ఈ హామీలన్నీ నెరవేరడానికి అనేక ప్రతిబంధకాలున్నాయి. మైనార్టీ ప్రభుత్వమే ప్రధాన అడ్డంకి. ఇవన్నీ కేజ్రీవాల్ ఎలా అధిగమిస్తారనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అంశాలెలా ఉన్నా ఢిల్లీ ముఖ్యమంత్రి సామాన్య జీవనం మాత్రం భవిష్యత్ తరాలకు ఆశాజ్యోతిగా మిణుకుమిణుకు మంటోంది.