కేజ్రీవాల్ చొరవ ఆహ్వానించదగ్గదే…
న్యూఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఎవరెన్ని విమర్శలు చేసినా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ప్రజాస్వామ్య పరిరక్షణకు కేజ్రీవాల్ వేసిన ముందుడుగును సహృదయంతో ఆహ్వానించాల్సిన సందర్భమిది. దేశంలో రాజకీయ వ్యవస్థతో సహా అన్ని రంగాల్లో అవినీతి ఊబిలో కూరుకుపోయి కుళ్లు కంపుకొడుతోన్న తరుణంలో అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ముందు నడిచి కేజ్రీవాల్ ప్రజలకు చేరువయ్యారు. ఉద్యమాలతోనే కాదు రాజకీయాల్లో అడుగుపెట్టి అవినీతిని పారద్రోలడానికి ప్రయత్నిస్తానని ముందుకొచ్చారు కేజ్రీవాల్. ఆయన పార్టీ పెడతానని ప్రకటించినప్పుడు ఆయనతో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కలిసి నడిచిన వారు సైతం వద్దన్నారు. ఇక రాజకీయ పార్టీల నాయకులైతే నోటికొచ్చినట్లుగా విమర్శలు గుప్పించారు. ఇలా మంది వచ్చి పార్టీలు పెట్టారు.. పత్తా లేకుండా పోయారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపనను లైట్ తీసుకున్నారు. 2012 నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని చూరగొనేందుకు బాగానే కష్టపడ్డారు. సామాన్యులు, యువత, కార్మికులు ఆమ్ ఆద్మీని తమ పార్టీగా సొంతం చేసుకోవడం వెనుక కేజ్రీవాల్ ఆయన టీమ్ ప్రయత్నమెంతో ఉంది. ఇందుకు ఆయన సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకున్నారు. ఢిల్లీలో సాంకేతికతను అత్యధికంగా ఉపయోగించుకునే యువతరానికి కేజ్రీవాల్ బాగా చేరువయ్యారు. పార్టీ స్థాపించిన ఏడాది కాలంలోనే ఢిల్లీలాంటి ఎంతో చైతన్యవంతమైన రాష్ట్రంలో గణనీయమైన ఓట్లను సొంతం చేసుకోవడం వెనుక కేజ్రీవాల్ కృషి ఎంతో ఉంది. ఒక్కడిగానే పార్టీ స్థాపించి తనకంటూ సొంతగా ప్రజాసైన్యాన్నే నిర్మించుకున్నారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపన ద్వారా ప్రజాస్వామ్యంపై కొత్త ఆశలు చిగురింపజేశారని బుద్ధిజీవులు పేర్కొంటున్నారు. ఓటుస్వామ్యంలో ఓటరు అంగడి సరుకుగా మారి బ్రాందీ బాటిల్‌కో, కరెన్సీ నోటుకో అమ్ముడుపోతాడని అన్ని పార్టీలు ఆశలు పెంచుకున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అలాంటి ఆశలను ఖండఖండాలుగా నరికేసింది. ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా ఓటర్లను పోలింగ్ బూతుల వద్దకు తేగలిగింది. వారితో ఓట్లు వేయించింది. గ్లోబలైజేషన్ పుణ్యమా అని దేశం ఏ రంగంలో అభివృద్ధిలో పరుగులిడుతోందో తెలియదుగానీ గడిచిన రెండు దశాబ్దాల్లో ఎన్నికల ఖర్చు మాత్రం లెక్కకు అందనంతగా పెరిగింది. ఓటర్లను కొనుగోలు చేయడంలో ఎవరు ఎక్కువ చొరవ చూపుతారో.. ఎవరు ఓటర్లను తాయిలాల వలతో తమవైపు తిప్పుకుంటారో వారినే ఎన్నికల్లో విజయలక్ష్మి వరిస్తూ వస్తోంది. ఇలా డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు తాము ఖర్చు చేసిన డబ్బుకు పదింతలు, ఇంకా వీలైతే వంద రెట్లు సంపాదించుకోవడంపైనే దృష్టి సారిస్తున్నారు. పైకి పార్టీలు, అధికారం అనే ముసుగేసుకున్నా ఇప్పటి రాజకీయాల్లో నీతిమంతులు ఒక్క శాతానికి మించరంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అధికారంలో ఉండొచ్చు.. కానీ ప్రజాప్రతినిధుల ప్రయోజనాలు మాత్రం నెరవేరుతాయి. వారు ఏ పార్టీవారైనా పర్వాలేదు. రేపెప్పుడైనా అక్కరకు రాకపోతారా అనే ఉదాత్త స్వభావం అధికార పార్టీలో ఇటీవల పెరిగిపోయింది. ఫలితంగా కప్పదాటు రాజకీయాలు పెరిగిపోయాయి. ఇప్పటి నేతల్లో విలువలు వెదుక్కోవడం అత్యాశే. విలువలే లేని ప్రతినిధులు ఎంతకైనా దిగజారడం ఖాయం. అలాంటి దిగజారుడు రాజకీయాలు ప్రత్యక్షంగా చూసీ చూసీ విసుగుచెందిన ప్రజలు సిసలైన ప్రత్యామ్నాయం కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో కొత్తగా వచ్చిన పార్టీలపై గంపెడాశలు పెట్టుకున్నారు కూడా. అయితే ఆయా పార్టీలు నిర్మాణ స్థాయిలోనే అనేక అవలక్షణాలు పుణికిపుచ్చుకొని, మిగతా పార్టీలకు ఏమీ తీసిపోమని నిరూపించుకున్నాయి. ప్రజాసేవే పరమావధి అయిన రాజకీయాల్లోకి వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులు, రౌడీషీటర్లు, హత్య రాజకీయాలతో సంబంధమున్నవారు రావడంతో ప్రజాసేవ అనేది ఇప్పుడు నల్లపూసైపోయింది. వ్యక్తిసేవ, వ్యక్తిపూజ, తమ వారి ప్రయోజనాలు, కాంట్రాక్టులు పొందడం, ప్రజా ధనాన్ని లూటీ చేయడం, ప్రశ్నించిన వారిని బెదిరించడం, అయినా వినకపోతే పూర్తిగా అడ్డుతొలగించుకోవడం ప్రస్తుత రాజకీయాల్లో పరిపాటిగా మారింది. రాజకీయాలు కార్పొరేట్, పెట్టుబడిదారుల జేబుసంస్థగా మారుతోన్న తరుణంలో, ప్రజాస్వామ్యం అంగడి సరుకుగా మారుతోన్న దయనీయ పరిస్థితుల్లో కారు చీకట్లో కాంతి పుంజంలా దూసుకువచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు ఆదరించారు. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన 28 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారంతా రాజకీయాలకు కొత్త వారే. గతంతో రాజకీయ సంబంధాలున్నా సచ్చీలురే. టికెట్ల కేటాయింపులో కొన్ని చోట్ల తప్పటడుగులు వేసినా కేజ్రీవాల్ వెంటనే సరిదిద్దుకున్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసారు కాబట్టి వారి పక్షాన ఉద్యమించడానికి ప్రతిపక్షానికి పరిమితమవుతామని ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకటించారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 మంది ఎమ్మెల్యేలు అవసరమవగా బీజేపీ 31, ఆప్ 28, కాంగ్రెస్ 8 సీట్లలో గెలుపొందాయి. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆమ్ ఆద్మీకి మద్దతిస్తామని ప్రకటించాయి. అయితే ఆ పార్టీల మద్దతు తీసుకొనే విషయంలో ఆప్ ఆచితూచే వ్యవహరించింది. మత తత్వ పార్టీ బీజేపీతో కాకుండా అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ మద్దతు తీసుకోవడానికే మొగ్గు చూపింది. దీనిపై ప్రజాభిప్రాయం తీసుకొనే ముండుగు వేసింది. రాజకీయాల్లో వచ్చిందే అధికారం కోసమన్నట్లుగా కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారని, ఢిల్లీ ప్రజల ఆశలు వమ్ము చేశారని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. కేజ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గుచూపుతూనే హంగూ ఆర్భాటాలు వద్దే వద్దన్నాడు. ప్రమాణ స్వీకారానికి ఆటో, మెట్రో రైళ్లలో వచ్చి తాను ఢిల్లీ ప్రజల్లో ఒక్కడిననే చాటుకున్నాడు. తనతో పాటు తన మంత్రి వర్గ సహచరులెవరూ ప్రభుత్వ బంగాళాలు, కార్లు తీసుకోరని, సామాన్యుల్లాగే ఉంటూ ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురావడం వల్ల ఆరు నెలల వ్యవధిలో రెండో సారి ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని ఢిల్లీ ప్రజలకు తప్పించారు. తద్వారా ప్రజాధనం అధనంగా ఖర్చు కాకుండా చూశారు. అలాగే తనకు వచ్చిన అవకాశాన్ని కేజ్రీవాల్ ఎలా ఉపయోగించుకుంటారో, సామాన్యులకు ఎలాంటి పాలన అందిస్తారో చూసే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఒకవేళ కేజ్రీవాల్ కనుక ఢిల్లీ ప్రజలకిచ్చిన హామీల్లో సగానికిపైగా నెరవేర్చినా అది ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో కేజ్రీవాల్ మేనియా ఢిల్లీకే కాదు యావత్ దేశానికి పాకుతుంది. అలాంటి రోజు రావాలని, రాజకీయాల్లో మంచికి ఇంకా చోటుందని నిరూపించే అవకాశం కావాలని దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.