శాశ్వత నివారణ చర్యలేవి?
ప్రపంచంలోనే పొడవైన రైల్వేలైన్లు, అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనదని గొప్పలు చెప్పుకోవడం మినహా ప్రయాణికుల భద్రతకు చర్యలు చేపట్టడంలో మన రైల్వేలు ఘోరంగా విఫలవమతున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు ఎందరో ప్రయాణికులను బలితీసుకుంటున్నా వ్యవస్థలో మార్పు రావడం లేదు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడే రైల్వేశాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించడం, హడావిడి చేయడం మినహా తర్వాత అలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా నిర్దిష్టమైన చర్యలు చేపట్టింది లేదు. రైల్వేలైన్లు, సిగ్నలింగ్ వ్యవస్థ లోపాల వల్ల జరిగే ప్రమాదాల సంఖ్య ఇటీవల తగ్గినా అగ్ని ప్రమాదాలు మన రైల్వేల్లో భద్రతలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీలివ్వడం తప్ప అలాంటి చర్యలేమిటో కూడా తర్వాత చెప్పరు. భారతీయ రైల్వేల్లో అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు కమిటీలు వేసిన అధికారులు వాటి నివేదికల అమలును మాత్రం విస్మరించారు. సంకీర్ణ రాజకీయాల్లో రైల్వే శాఖ ప్రధాన భాగస్వామ్యపక్షాల చెప్పుచేతల్లో ఉండటంతో నిర్దిష్టమైన చర్యల అమలు సమయంలో ఏదో రాజకీయ సంక్షోభం తలెత్తడం, తర్వాత ప్రతిపాదనలు అటకెక్కడం తరచూ జరుగుతోంది. శనివారం తెల్లవారుజామున బెంగళూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు బీ1 ఏసీ బోగీ పుట్టపర్తి-కొత్తచెరువు స్టేషన్ల మధ్య అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 26 మంది సజీవ దహనమవగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి వరకు మృతుల్లో 20 మందిని గుర్తించారు. మరో ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఇలాంటి ప్రమాదమే గతేడాది జూన్‌లో సంభవించింది. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లోని ఎస్-11 బీగీ ఇలాగే దగ్ధమై 32 మంది దుర్మరణం చెందారు. మాంసపు ముద్దల్లా మారిన మృతదేహాలను గుర్తు పట్టే అవకాశం లేకపోవడంతో రోజుల తరబడి శవాల మూటలను ఆస్పత్రిలోనే ఉంచారు. డీఎన్‌ఏ పరీక్షల తర్వాత గానీ ఏ శవం ఎవరిదో గుర్తించలేనంత దైన్యం. కొందరు మృతదేహాలను తీసుకెళ్లకపోవడంతో స్థానికంగా అంత్యక్రియలు నిర్వహించారప్పుడు. అప్పుడు రైల్వే స్థాయీ సంఘం చైర్మన్‌గా ఉన్న టీఆర్ బాలు మళ్లీ ఇంతటి దారుణ ప్రమాదాలు పునరావృత్తం కానివ్వబోమని పేర్కొన్నారు.
కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఏడాదిన్నర గడిచింది మళ్లీ అలాంటి ప్రమాదమే. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన స్థలానికి 500 మీటర్ల దూరంలో సొరంగ రైల్వే మార్గముంది. అక్కడ కనుక బోగీకి నిప్పంటుకొని ఉంటే అది క్షణాల్లో మిగతా బోగీలకు విస్తరించడంతో పాటు ఊపిరాడక ఇంకా ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. 2012 మే 30న అనంతపురం జిల్లా పెనుగొండ రైల్వేస్టేషన్‌లోకి సిగ్నల్ ఇవ్వకముందే హంపీ ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో 24 మంది దుర్మరణం చెందారు. 2008 జూలై 31న సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ వరంగల్ జిల్లా కేసముద్రం వద్ద దగ్ధమై 42 మంది సజీవ దహనమయ్యారు. 1990 అక్టోబర్ 10న చర్లపల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 40 మంది మాడి మసిబొగ్గులుగా మారారు. అదే ఏడాది గొల్లగూడెం వద్ద జరిగిన మరో ప్రమాదంలో 35 మంది మృత్యువాతపడ్డారు. తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలు, ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎందరినో బలితీసుకుంటున్నా మన అధికారులు మాత్రం శాశ్వత నివారణ చర్యలేవి చేపట్టడం లేదు. రైలు ప్రమాదాల నివారణ పేరుతో నామ మాత్రపు చర్యలు చేపడుతున్నా వాటిపై పర్యవేక్షణ లేకుండా పోతుంది. ఇంతటి ఘోర ప్రమాదాలకు నిర్వహణలోపాలు, కిందిస్థాయి సిబ్బంది తప్పిదాలే కారణమని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. భారీ ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణ ఉద్యోగులను బలిపశువులు చేస్తూ తాము ఎంచక్కా తప్పించుకుంటున్నారు.
కిందటేడాది తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్రమాద సమయంలో వేసిన విచారణ కమిటీ రైళ్లలోని భద్రతా ప్రమాణాలు ఎంత తీసికట్టుగా ఉన్నయో స్పష్టం చేశాయి. బోగీల్లో వైరింగ్ సరిగా లేకపోవడం, లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించే నిపుణుల కొరత, ప్రమాదాలు జరిగే సమయంలో అప్పటికప్పుడు హెచ్చరించి అప్రమత్తం చేసే వ్యవస్థ లేకపోవడం లాంటి కారణాలతో భారీ ప్రమాదాలు జరుగుతున్నట్లు విచారణ బృందం తేల్చింది. రైలు బోగీలకు నిప్పంటుకోకుండా ఎలాంటి రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలో భారతీయ రైల్వేల చట్టం 67వ సెక్షన్ సూచిస్తోంది. రైళ్లలో భద్రత కోసం ప్రయాణికుల నుంచి సుంకం కూడా వసూలు చేస్తున్న రైల్వేశాఖ ఆచరణలో మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కదిలే రైళ్లలో, ఆపి ఉన్న బోగీల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణలు నివేదికలు ఇంతవరకూ ఆచరణకు నోచుకోలేదు. రైల్వేల్లో భద్రత వ్యవస్థ ప్రక్షాళణ కోసమంటూ రూ.70 వేల కోట్లతో అంచనాలను రూపొందించింది.
గత ఫిబ్రవరిలో కకోద్కర్ కమిటీ రైల్వేల్లో భద్రత కోసం లక్ష కోట్లు వెచ్చించాలని లెక్క తేల్చారు. కానీ ఆ నివేదికపై ఇంతవరకూ స్పందించిన దాఖలాలు లేవు. జర్మన్ టెక్నాలజీతో రూపొందించిన లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) బోగీలను ప్రవేశపెడితే అగ్ని ప్రమాదాల బారి నుంచి ప్రయాణికులను రక్షించే అవకాశమున్నా మన దేశంలో ఈ ప్రక్రియ నత్తకే నడక నేర్పేస్థాయిలో సాగుతోంది. స్టెయిల్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన బోగీల్లో రసాయనాలతో కూడిన రంగులు పూరడం వల్ల బోగీల్లో అగ్ని ప్రమాదాలు జరగవు. వీటిపై ఏమాత్రం దృష్టి సారించని మన రైల్వేలు పాతకాలపు డొక్కు బోగీలనే నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.