హంతకులెవరో సర్కారే చెప్పాలి
సాయుధులైన మావోయిస్టుల కంటే జనాల మధ్య ఉండే హక్కుల ఉద్యమకారులు, వారికి అండగా నిలిచే మేధో వర్గంతోనే ప్రమాదం ఎక్కువని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. అడవిలో ఉండే మావోయిస్టులు సమసమాజ స్థాపన కోసమంటూ తుపాకీలతో పోరు చేయడం కంటే వారిని ఉద్యమం వైపు ఆకర్షింపజేస్తున్న వ్యక్తులతోనే దేశ అంతర్గత భద్రతకు ముప్పుందని కేంద్రం ఈ అఫిడవిట్లో ప్రస్తావించింది. అలాంటి వ్యక్తులను కట్టడి చేయడం, వీలైతే ఈ లోకంలోనే లేకుండా చేయడం ఇంతకాలం పోలీసుల బలగాల ఎజెండాలో మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని చట్టబద్ధం చేసే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. కేంద్రం ఈ దిశగా చర్యలు మొదలు పెట్టిందో లేదో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఉద్యమకారులకు గొంతుకగా పనిచేస్తున్న పౌరహక్కుల ఉద్యమ కారులను టార్గెట్ చేసింది. జీవితాంతం తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన ఉపాధ్యాయుడు, తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ల సృష్టికర్త ఆకుల భూమయ్య హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కేంద్ర ఎజెండాను ఆంధ్రప్రదేశ్‌ను ఏలుతున్న సీమాంధ్ర పాలకులు అమలు చేసిన ఎజెండా పౌరసమాజం సందేహాలు వ్యక్తం చేస్తోంది. పౌర హక్కుల నేతలను పోలీసులు ఈ విధంగా హత్య చేయడం ఇదే మొదటిసారి కాదు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వైనంపై న్యాయస్థానాలు చీవాట్లు పెట్టిన పర్యాయాలు అనేకం. శాంతిభద్రతలను పరిరక్షించే పేరుతో పోలీసులు తమ తుపాకులను పౌరులపైకి ఇష్టారాజ్యంగా ఎక్కుపెట్టి సామాన్యులను బలితీసుకున్న సందర్భాలు అనేకం. ఇలాంటి చర్యలను ఖండించిన పౌర హక్కుల నేతలనూ తమ దారికి అడ్డువస్తున్నారని సునాయాసంగా హత్య చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ పోలీసులది. వరంగల్ జిల్లాలో ప్రజా వైద్యుడిగా పేరున్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రామనాథం తన ఆస్పత్రిలో పిల్లలను పరీక్షిస్తుండగా పోలీసులు తుపాకీతో కాల్చి చంపారు. అలాగే పౌర హక్కుల ఉద్యమకారులు జాప లక్ష్మారెడ్డి, గోపి రాజన్న, నర్ర ప్రభాకర్‌రెడ్డి, పురుషోత్తం, ఆజం అలీ, కనకాచారి, దుడ్డు ప్రభాకర్‌ను కాల్చి చంపేశారు. కొద్ది రోజుల క్రితం బంధుమిత్రుల కమిటీ నాయకుడు గంటి ప్రసాదంను ఓ ఆస్పత్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయనను హత్య చేసింది పోలీసులే అనే విమర్శులున్నా దానిపై ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలుండవు. ఎవరిపైనో చిన్నపాటి కేసులు పెట్టి తప్పించుకోవడం ఇక్కడ పరిపాటే. హక్కుల ఉద్యమకారులను అడ్డు తప్పించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తర్వాతే ఎవరైనా. కేంద్రం మేధో వర్గం వల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పుందనగానే రాష్ట్రంలో పోలీసులు మళ్లీ రెచ్చిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నాలుగున్నర దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్న తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం పైన పేర్కొన్న హత్యాకాండ కిందకే వస్తుంది. దీనిపై కొందరు విభేదించిన నిజాన్ని మాత్రం దాచలేరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరుకునే వారిపై రాజ్యం ఉక్కుపాదం మోపిన సమయంలో తెలంగాణ జనసభ పేరుతో ఊరూరు తిరిగి ప్రజలను చైతన్యవంతం చేసిన భూమయ్యను హతమారుస్తామని గతంలో ఎన్నో పర్యాయాలు హెచ్చరికలు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తామన్నా పాలకుల్లో చలనం లేదు. ఇక పోలీసుల ప్రమేయం లేకుండా పౌరహక్కుల ఉద్యమకారులకు ఇలాంటి హెచ్చరికలు వచ్చే అవకాశమే లేదు. తెలంగాణ ఉద్యమాన్ని జనసభ క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న సమయంలో అందులో సభ్యురాలైన బెల్లి లలితను పోలీసుల చేతుల్లోని ఓ హంతకముఠా ముక్కలు ముక్కలుగా నరికి చంపింది. వరంగల్‌లో ఐలయ్య అనే యువకుడ్ని పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో చంపేశారు. ఇలాగే జనసభ నాయకులపై తీవ్ర నిర్బంధం కొనసాగినా భూమయ్య ఉద్యమాన్ని ముందుకే తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ స్థాపించి ప్రజాసంఘాలను ఆ గొడుగు కిందికి తీసుకువచ్చి ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సమయంలో ఆయన హత్య ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రలో భాగమేననే ఆరోపణలకు అనేక రుజువులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదంటోంది. ఎప్పుడూ చెప్పినట్లుగానే నెపం ఎవరో శత్రువులున్నారంటూ వారి పైకే తోసే ప్రయత్నం చేస్తోంది. సమైక్య రాష్ట్రంలో పాలకులు రాజ్యం మాటున సాగించిన హత్యాకాండలో ఎందరో సమిధలయ్యారు. ఎన్నో కుటుంబాలు పెద్దలను కోల్పోయాయి. అయినా ఉద్యమాన్ని మాత్రం తెలంగాణ గడ్డ వీడలేదు. ఈక్రమంలోనే తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి పాటుపడ్డ భూమయ్య హత్య జరిగింది. అది ప్రమాదం కాదనే నిజం పోలీసులకూ తెలుసు. కానీ వారు నిజాలు చెప్పరు. వారు చెప్పకున్నా ఆ నిజాన్ని వెల్లడించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఇవ్వాల కాకున్నా రేపన్నా నిజమేంటో తెలియకపోదు.