విద్వేషాలు రగల్చొద్దు.. ముసాయిదాపై చర్చించండి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013పై నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చించాలి. 1956లో హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం కలిపి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ 57 ఏళ్ల తర్వాత మళ్లీ రెండు రాష్ట్రాలుగా విడిపోబోతోంది. ఇందుకు శాసనసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరారు. రాష్ట్ర విభజనపై శాసనసభకు, మండలికి అభిప్రాయాలు చెప్పడం మినహా ఓటింగ్ జరిపే హక్కు లేదు. అలాగే సవరణలు ప్రతిపాదించే అవకాశమూ లేదు. గతంలో పలు రాష్ట్రాల విభజన సందర్భంగా ఆయా రాష్ట్ర శాసనసభల్లో చేసిన సవరణ ప్రతిపాదనలను పట్టించుకోలేదు కూడా. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను విభజించే, సరిహద్దులను సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా కేంద్రానికి సంక్రమించిన హక్కు. పరిపాలన సౌలభ్యం కోసమో, ఇతర కారణాలతోనో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలను విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అవకాశం కేంద్రానికి ఉంది. ఆర్టికల్-3 దీనిని స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోయే సందర్భంలో రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరడం సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్‌కుమార్ ముఖర్జీ కేంద్ర ప్రభుత్వం నుంచి తన వద్దకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదాను రాష్ట్రానికి పంపారు. ఇందుకోసం 40 రోజుల సమయమిచ్చారు. డిసెంబర్ 16న ఉదయం అసెంబ్లీలో స్పీకర్ నాదెండ్ల మనోహర్, మండలిలో చైర్మన్ చక్రపాణి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదాను ప్రవేశపెట్టారు. ఈరోజే సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు సభా గౌరవాన్ని మంట గలిపేలా ప్రవర్తించారు. ముసాయిదా ప్రతులను చించి రచ్చరచ్చ చేశారు. మీడియా పాయింట్‌లోనూ అనుచితంగా ప్రవర్తించారు. తమకు సహజంగా అబ్బిన నటనా కౌశలాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. వాయిదా అనంతరం స్పీకర్ సభలోకి రాకుండా చాంబర్ ఎదుట బైఠాయించి ఆయన్ను నిర్బంధించారు. సభా గౌరవాన్ని గంగలో కలిపారు. స్పీకర్ అనుమతితో డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క అదే రోజు సాయంత్రం సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుపై చర్చ ప్రారంభించగా స్పీకర్ స్థానాన్ని అవమానించారు. శాసనసభాపతి స్థానంలో ఉన్న భట్టి విక్రమార్కపై దాడికి తెగబడ్డారు. ముసాయిదా ప్రతులను చించి ఆయన ముఖంపైకి విసిరేసారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు శాసనసభ, మండలి సమావేశాలు జరుగకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడుగడుగునా అడ్డు తగిలారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును తిప్పి పంపాలనే విషయాన్ని విస్మరించి తమ స్థాయిని మరిచి దిగజారి వ్యవహరించారు. వారి కుప్పిగంతులతో స్పీకర్ శాసనసభను, చైర్మన్ శాసనమండలిని జనవరి 3 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముసాయిదాపై అభిప్రాయం చెప్పేందుకు రాష్ట్రపతి శాసనసభ, మండలికి ఇచ్చిన 40 రోజుల గడువు ఈనెల 23తో ముగుస్తుంది. స్పీకర్, చైర్మన్ కూడా రెండు విడతల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వాయిదా సమయంలోనే ప్రకటించారు. మొత్తంగా 13 రోజుల పాటు శాసనసభలో విభజన ముసాయిదాపై చర్చించి తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో సీమాంధ్రులు విభజన అసంబద్ధం అంటూ సభలో చర్చజరుగకుండా చూస్తామని, అడ్డుకుంటామని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకు సమావేశాల ప్రారంభానికి ముందు శాసనసభ వ్యవహారాల నుంచి శ్రీధర్‌బాబును తప్పించాడు. అంతటితో ఆగకుండా కరడుకట్టిన సమైక్యవాదిగా చెప్పుకునే ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకె శైలజానాథ్‌కు శాసనసభ వ్యవహారాల శాఖను కట్టబెట్టాడు. తద్వారా తాను తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాననే సంకేతం సీమాంధ్రులకు ఇవ్వడంతో పాటు ఇక తెలంగాణ రాదని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాడు. శాసనసభలో తెలంగాణపై మన ప్రతినిధులు చెప్పే అభిప్రాయాలను విభజన సమయంలో పరిగణలోకి తీసుకోవాలని ఏమీ లేదు. కానీ ప్రజల పక్షాన ఏవైనా విన్నవిస్తే వాటిని పరిష్కరించవచ్చు. కానీ సీమాంధ్ర ప్రతినిధులెవరూ ముసాయిదాపై చర్చకు సిద్ధపడట్లేదు. ముసాయిదాను అడ్డుకోవడం ద్వారా ప్రజల మధ్య విద్వేషాలు రగల్చాలనే యత్నిస్తున్నారు. తద్వారా తమకు ఓట్లేసి చట్టసభలకు ఎన్నుకున్న ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. సీమాంధ్రుల చేస్తే ప్రయత్నాలతో విభజన ఆగదని వారికి తెలుసు. అంతేకాదు శాసనసభ నిర్దేశిత సమయంలోగా తన అభిప్రాయాన్ని చెప్పకుంటే దాన్ని ఆమోదంగా రాష్ట్రపతి భావించే అవకాశం కూడా ఉంది. ఈ విషయమూ విభజన బిల్లును అడ్డుకుంటామని బీరాలు పలుకుతున్న సీమాంధ్ర నేతలకు తెలుసు. అయినా చర్చకు ససేమిరా అంటున్నారు. రాష్ట్ర విభజన అనేది జరిగిపోయిన అంశం. పార్లమెంట్‌లో చర్చ ఓటింగ్, రాష్ట్రపతి ఆమోద ముద్ర మాత్రమే మిగిలుంది. ఇంతకుముందుగా అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవడం సంప్రదాయం కాబట్టి, తమను సంప్రదించకుండా విభజన చేశారని నేతలు దుమ్మెత్తిపోసే అవకాశం ఉంది కాబట్టి వారికి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతి చర్చ కోసం 40 రోజుల సమయమిచ్చారు. మూడు రోజుల విలువైన సభా సమయాన్ని ఇప్పటికే వృథా చేసినా సీమాంధ్ర ప్రతినిధులు ఇప్పుడున్న సమయాన్నైనా సద్వినియోగం చేసుకోవాలి. సభలో ముసాయిదాపై నిర్మాణాత్మక చర్చ జరిపి సీమాంధ్రుల డిమాండ్లు సభ ముందుంచాలి. ప్రజలకు ఏం కావాలో కేంద్రానికి నివేదించకుండా మేం పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు వ్యవహరిస్తే అది సీమాంధ్ర ప్రజలకే నష్టం. ఈ నిజాన్ని సీమాంధ్ర నేతలు ఇకనైనా గుర్తించాలి. సభలో చర్చలో పాల్గొని తమ అభిప్రాయమేంటో వెల్లడించాలి.