ఎంఐఎం ఆలస్యంగానైనా తెలంగాణపై మంచి నిర్ణయం తీసుకుంది
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆల్ ఇండియా మజ్లీస్ ఎ ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఎంఐఎం రాష్ట్ర విభజన అనివార్యమైన తరుణంలో హైదరాబాద్, పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రం మాత్రమే ఏర్పాటు చేయాలని కోరుతోంది. ఉమ్మడి రాజధానిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిని కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఖైరతాబాద్ రెవెన్యూ డివిజన్‌ను ఉమ్మడి రాజధాని పరిధిగా గుర్తిస్తే సరిపోతుందని, ఉమ్మడి రాజధానిగా పదేళ్ల కాలపరిమితి సరికాదంటోంది. అదే సమయంలో హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని అంగీకరించబోమని తేల్చి చెబుతోంది. శాసనసభలో తెలంగాణ ముసాయిదాపై చర్చ సందర్భంగా ఆ పార్టీ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ పార్టీ వైఖరిని స్పష్టం చేయడంతో పాటు హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, హైదరాబాద్ అభివృద్ధిపై అవాకులు చెవాకులు పేలుతున్న సీమాంధ్రులకు దీటైన సమాధానమే ఇచ్చారు. ఒక్కప్పుడు హైదరాబాద్ పాత నగరానికే చెందిన పరిమితమైన ఎంఐఎం ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. పాతబస్తీకి చెందిన ఈ పార్టీ ముస్లిం మైనార్టీల ప్రతినిధిగా తనకు తానుగా ప్రకటించుకుంటోంది. కొన్ని సందర్భాల్లో తమ అభిప్రాయాలనే యావత్ ముస్లిం ప్రజల అభిప్రాయంగా చెలామణీ చేసిన పార్టీ ఎంఐఎం. పాత బస్తీలో మరో రాజకీయ పార్టీకి చోటు లేకుండా చేసేందుకు ఆ పార్టీ దుర్మార్గాలకు సైతం పాల్పడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యవహార శైలి ఆ ఆరోపణలు బలం చేకూర్చింది కూడా. ఎంఐఎం పార్టీ సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ హయాం నుంచి తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తోంది. సీమాంధ్ర నేతలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిన ఎంఐఎం ఒక ప్రాంతానికి చెందిన పార్టీగానే చాలా కాలం ఉండిపోయింది. ఆ పార్టీ విస్తరణలోకి వెళ్లాక కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగాలనే కోరుకుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశాల్లోనూ ఎంఐఎం సమైక్యాంధ్రే తమ పార్టీ విధానమని చెప్పింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే రాయలసీమలోని కర్నూల్, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఇవ్వాలని కోరింది. 2009 నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సంప్రదింపులు కొనసాగిస్తోండగా ఎంఐఎం ఆది నుంచి రాయల తెలంగాణ డిమాండ్‌నే ముందు పెడుతూ వస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఎంఐఎం రాయల తెలంగాణే ఇవ్వమని కోరింది. సమైక్యాంధ్ర కొనసాగించని పక్షంలో 12 జిల్లాలతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే కోరింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఎంఐఎం పార్టీ వైఖరిలో స్పష్టమైన వైఖరి కనిపించింది. ఉమ్మడి రాజధానిగా కొనసాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలు గవర్నర్ చేతిలో పెట్టబోతున్నట్లు కేంద్రం ప్రకటించడంపై ఎంఐఎం మండిపడింది. హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రజాస్వామికంగా ఎన్నికయ్యే ప్రభుత్వం చేతిలోనే పాలన అధికారులుండాలని డిమాండ్ చేస్తోంది. సీమాంధ్రులు హైదరాబాద్‌పై అధికారాల కోసం చేస్తున్న కుట్రలను ఎంఐఎం తిప్పికొడుతోంది. హైదరాబాద్ అభివృద్ధిపై సీమాంధ్రులు సాగిస్తోన్న విషప్రచారానికి జవాబిస్తోంది. ఇంతకాలం సమైక్యాంధ్ర కొనసాగాలని కోరిన ఎంఐఎం తన కార్యక్షేత్రం హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని ప్రయోగించాలని చూడటంతో మేల్కొంది. ప్రజలకు సంబంధం లేని పాలనను రుద్దాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తోంది. ఎంఐఎంలో వచ్చిన మార్పు లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణలో వచ్చిన మార్పులాంటిదేననే వాదన కూడా ఉంది. అయితే రాజకీయ ఉనికిని కాపాడుకోవడమెలాగో అర్థం కాని స్థితిలో ఉన్న జేపీ కనీసం మళ్లీ గెలవాలంటే ఢిల్లీలో రాజకీయ తుపాను సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టు కట్టాలని భావిస్తున్నాడు. ఆమ్ ఆద్మీ అవినీతి వ్యతిరేక ఉద్యమానికి రాష్ట్రంలోనూ మంచి స్పందన రావడంతో ఆ ఊపులో తాను ఎన్నికల గండం గట్టెక్కవచ్చని భావిస్తున్నాడు. అందుకోసమే ఇంతకాలం తెలంగాణపై అడ్డంగా మాట్లాడిన జేపీ తెలంగాణ ఇవ్వాల్సిందేనన్నాడు. ప్రజలు కలిసుండలేనంతగా విద్వేషాలు పెరిగిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను విభజించాల్సిందేనని పేర్కొన్నాడు. ఎంఐఎం తన స్థాన బలిమి ఉన్న హైరదాబాద్‌పై కేంద్రం, గవర్నర్ పెత్తనాన్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడమనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోన్న ప్రజాస్వామిక ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట కేంద్రం పెత్తనాన్ని పార్టీగా ప్రశ్నించడం ఆహ్వానించదగ్గదే. ఆ పార్టీ ప్రాబల్యానికి కేంద్రం పెత్తనానికి మధ్య సన్నని గీత స్పష్టంగా ఉంది. మైనార్టీలకు స్వయం ప్రకటిత పార్టీగా ఉన్న ఎంఐఎం వారు చిక్కుల్లో పడ్డప్పుడు అందులోంచి బయట పడేయాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీపై ఉంది. శాంతి భద్రతల పర్యవేక్షణ అధికారం కేంద్రం చేతిలోనో, గవర్నర్ చేతిలోనో ఉంటే హైదరాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసుల్లా పాలకులకు ఎదురు తిరగవచ్చు కూడా. అలాంటి పరిస్థితే ఉత్పన్నమైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని ప్రయోజనముండదు. హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని ఇప్పుడు అందరూ వ్యతిరేకించాల్సిన అవసరముంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు దీనిపై ఐక్యం కావాల్సిన అవసరముంది. తెలంగాణ విషయంలో ఎంఐఎం ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.