తెలంగాణలో సమస్యలు లేవా?
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాతనే విభజనపై ముందుకెళ్లాలంటూ సీమాంధ్ర పెత్తందారుల పక్షాన ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము పునర్వ్యస్థీకరణ బిల్లు-2014కు ఉభయ సభల్లో మద్దతు పలుకుతామని బీజేపీ కేంద్రాన్ని హెచ్చరిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎలాగైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదింపజేసుకోవాలని పట్టుదలతో ఉన్న యూపీఏ ప్రభుత్వం బీజేపీ పెట్టిన అసంబద్ధ డిమాండ్లను సైతం తుది ముసాయిదాలో చేర్చింది. బీజేపీ మద్దతిస్తే ఇక పార్టీతో అవసరం లేకుండా తెలంగాణ బిల్లు సునాయాసంగా పార్లమెంట్ ఆమోదం పొందుతుందన్నది యూపీఏ ప్రభుత్వం విశ్వాసం. అందుకే ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు తాము సానుకూలమే కాని సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌ను పెట్టగానే కేంద్ర ప్రభుత్వం వెనుకా ముందూ ఆలోచించకుండా అందుకు ఆమోదం తెలిపింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా అణచివేతలు, అవమానాలు, అవహేళనలు, దోపిడీ, పీడనను ఎదుర్కొంది తెలంగాణ. తెలుగు భాష పేరుతో ఆంధ్ర రాష్ట్రీయులు విసిరిన ఐక్యత వలలో చిక్కుకున్న హైదరాబాద్ పాలకులు ఒకే భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉంటే తప్పేంటని ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్ విలీనానికి సుముఖత వ్యక్తం చేశారు. మొదటి ఎస్సార్సీ తీర్మానం విధించిన గడువును కూడా కాదని ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వచ్చారు. తెలుగు రాష్ట్రం ఏర్పడే సమయంలో అధికార భాషగా కూడా తెలుగే ఉండాలన్నప్పుడు అప్పటిదాక ఉర్దూ అధికార భాషగా ఉన్న హైరదాబాద్ స్టేట్‌కు అనేక రక్షణల కూడిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని కుదుర్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసమో.. ఇంకేవో కారణాలు చూపుతూ ఆంధ్ర ప్రాంతీయులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఐదేళ్ల పాటు పాలన వ్యవహారాలు ఉర్దూలోని కొనసాగించాలని, కోర్టుల్లో వ్యాజ్యాల వాదోపవాదాలు ఉర్దూలో చేయాలని నిర్ణయించినా అవి అమలుకే నోచుకోలేదు. ఫలితంగా ఉర్దూ మాధ్యమంలో ఉన్నత విద్యావంతులకు కూడా ఉద్యోగావకాశాలు మృగ్యమయ్యాయి. దీంతో వారంతా కింది స్థాయి ఉద్యోగాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యమైన ఉద్యోగాలన్నీ సీమాంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వారే కొట్టేశారు. ఆ తర్వాతికాలంలో తెలుగు మాధ్యమంలో తెలంగాణ ప్రాంత వాసులు ఉన్నత విద్య అభ్యసించినా ముఖ్యమైన ఉద్యోగాలు మాత్రం దక్కలేదు. ఎప్పట్లాగే సీమాంధ్రులు స్థానిక రిజర్వేషన్లను తోసి రాజని తెలంగాణ యువతకు చెందాల్సిన ఉద్యోగాలను దక్కించుకున్నారు. దీంతో తెలంగాణ యువత నిరుద్యోగులుగా మారి ఉపాధిని వెదుక్కుంటూ బొగ్గుబాయి. బొంబాయి. దుబాయి బాట పట్టారు. ఈక్రమంలో ఎందరో తమ విలువైన ప్రాణాలు కోల్పోగా ఆయా కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. 57 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సర్వస్వం కోల్పోయి మోడువారింది. ఈక్రమంలో ఆత్మగౌరవం, స్వపరిపాలన కోసం ఉద్యమించిన తెలంగాణ పౌరులను రాజ్యం వివిధ పేర్లతో హత్య చేసింది. అణచివేత, నిర్బంధాల మధ్య బతకలేమని తెలంగాణ గడ్డ నాలుగున్నర దశాబ్దాలుగా నిత్యం పోరాటంలోనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా నష్టపోయింది తెలంగాణ. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం కాబట్టి దానిపై తమకే హక్కులు చెందాలని, పోలవరం నిర్మాణం కోసం ముంపు గ్రామాలను సీమాంధ్రలోనే కలపాలని సీమాంధ్ర ప్రాంత పెత్తందారులు, ప్రజాప్రతినిధులు గొంతెమ్మ కోర్కెలు కోరుతుంటే వారి తరఫున బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నాడు. ఇందులో బీజేపీ అంతర్గత రాజకీయాలూ నడుపుతోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలను తమ పార్టీలోకి ఆకర్షించేందుకు బీజేపీ వెంకయ్యను తురుపుముక్కలా వాడుకుంటోంది. సీమాంధ్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు పూనుకుందనే అభిప్రాయం సీమాంధ్ర ప్రజల్లో చొప్పించడానికి ఆ ప్రాంత పెత్తందారులు, నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించపోయినా హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నవారు అక్కడ లేని ఉద్యమాన్ని ఉన్నట్టుగా చూపుతూ తెలంగాణకు ద్రోహం తలపెడుతున్నారు. కేంద్రం కూడా ఇచ్చేది తెలంగాణ రాష్ట్రమే కాబట్టి సీమాంధ్ర ప్రజల సమస్యలే ప్రధానమైనవి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ మొత్తం తతంగానికి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం పన్నితే సీమాంధ్ర పెత్తందారులు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. వారి డైరెక్షన్‌లో ఢిల్లీలో వెంకయ్య తెలంగాణకు వ్యతిరేకంగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. తెలంగాణ ఇస్తున్నామంటూనే పోలవరం ముంపు ప్రాంతాల పేరుతో నోరులేని రెండు లక్షల మంది ఆదివాసీలను ముంచే కుట్రకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహం సిద్ధం చేసేశాయి. సీమాంధ్రులకు భద్రత పేరుతో పదేళ్లపాటు హైదరాబాద్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలను కేంద్రం గవర్నర్ చేతిలో పెట్టింది. కనీసం తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు గవర్నర్ శాంతి భద్రతల వ్యవహారంలో నిర్ణయాలు తీసుకోవాలనే సవరణను కేంద్రం పట్టించుకోలేదు. పోలవరం నిర్మాణాన్ని తెలంగాణ వద్దనడం లేదు. ఆదివాసీలను నిర్వాసితులను చేసి దేశ మూలవాసులను రోడ్డున పడేసే ప్రస్తుత డిజైన్లో మాత్రమే వద్దంటోంది. లక్షలాది ఎకరాల్లో అడవిని, వణ్యప్రాణులను, అరుదైన వృక్ష, జీవజాతులను ముంచే పద్ధతిలో మాత్రమే వద్దంటోంది. పోలవరం ఒకే ప్రాజెక్టు స్థానంలో చిన్న డ్యామ్‌లను నిర్మించుకోమంటుంది. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యాసంస్థల్లో పదేళ్లు కాకుండా రెండేళ్లపాటు సీమాంధ్రులకు విద్యావకాశాలు కల్పించి ఆలోగా సీమాంధ్రలో ఆయా సంస్థలను ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తోంది. అంతేకాలం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే సరిపోతుందని చెప్తోంది. ఇక ఉద్యోగుల సమస్య సరేసరి. తెలంగాణకు ఇన్ని సమస్యలున్నా కేంద్రం వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. బీజేపీ అసలే వాటిని ప్రస్తావించడం లేదు. ఇన్నాళ్లు దోపిడీకి పాల్పడ్డ సీమాంధ్రులకే సమస్యలున్నాయని, వాటిని పరిష్కరిస్తేనే తాము బిల్లుకు మద్దతిస్తామని బీజేపీ కొర్రీలు పెడితే కేంద్రం అందుకు తందానా అంటోంది. సీమాంధ్రలో బీజేపీ లేని బలాన్ని ఊహించుకొని ఏదో సాధిద్దామని ఈ కుట్రకు వ్యూహ రచన చేసింది కాని తెలంగాణలో ఉన్న కాస్తో కూస్తో బలాన్ని కోల్పోతామని విషయాన్ని మాత్రం విస్మరిస్తోంది.